సాక్షి, విజయవాడ: జన క్షేత్రంలో అడుగడుగునా నీరాజనాలు అందుకుంటూ బస్సు యాత్రను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి రాజకీయ ప్రత్యర్థులు వణికిపోతున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్‌పై ఒక ఆగంతకుడు హత్యాయత్నానికి తెగబడ్డాడు. సీఎంకు బలమైన గాయం కావడంతో రక్తం ధారగా కారింది.. గాయం నుంచి కారుతున్న రక్తాన్ని సీఎం జగన్ అదిమిపట్టుకున్నారు. బాధను పంటిబిగువన భరిస్తూనే ప్రజలకు అభివాదం చేశారు. ప్రాథమిక చికిత్స తర్వాత యాత్ర సీఎం జగన్ కొనసాగించారు. దాడి తర్వాత మరో 20 కి.మీ వరుకు బస్సు యాత్ర కొనసాగించారు. అసలు సీఎం జగన్‌పై దాడి ఎలా జరిగిందంటే..
యాత్రలో భాగంగా శనివారం రాత్రి 8.10 గంటలకు సీఎం వైఎస్ జగన్ విజయవాడ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్‌కు చేరుకోగానే హత్యకు ప్రయత్నించాడు. సీఎం జగన్ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ పై భాగాన బలమైన గాయమైంది. దీంతో సీఎం పక్కకు తూలి.. ఎడమ కంటిని బలంగా అదిమి పట్టుకున్నారు. ఆయన ఎడమ కన్ను పైభాగం వాచిపోయింది. కాగా ఆ వస్తువు పదును, వేగాన్ని బట్టి అది రాయి, గ్రానైట్ పలక, పెల్లెట్, ఎయిర్ బుల్లెట్ ఏదైనా కావచ్చని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం జగన్ ఎడమ కంటి పై భాగాన గాయమయ్యాక.. ఆ పదునైన వస్తువు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కూ తగలడంతో ఆయనకు కూడా గాయమైంది.
8:10 PM: విజయవాడ సింగ్‌నగర్‌లో సీఎం జగన్‌పై రాళ్ల దాడి
8:30 PM: బస్సులోనే సీఎంకు ప్రథమ చికిత్స
8:50 PM దాడి తర్వాత తిరిగి జగన్ బస్సు యాత్ర
10:00 PM: బస్సు నుంచే జనానికి సీఎం జగన్ అభివాదం
10.30 PM: కేసరపల్లి క్యాంప్‌నకు చేరుకున్న సీఎం జగన్
11:15: కేసరపల్లి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి
11.30 విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
అర్ధరాత్రి 12:10 AM: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
అర్ధరాత్రి 12.20 ఆసుపత్రి నుంచి కేసరపల్లి క్యాంప్‌నకు తిరుగు ప్రయాణం
సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసులో అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుట్రపూరితంగానే సీఎం జగన్ పై దాడి చేసినట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. రెండు రకాలుగా దాడి జరగొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివేకానంద స్కూల్ కు, గంగానమ్మ గుడికి మధ్య నుండి రాయితో దాడి చేసి ఉండొచ్చని అనుమానం.. మరో వైపు వివేకానంద స్కూల్ నుంచి దాడి చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివేకానంద స్కూల్ లోని కొన్ని కిటికీలు తెరుచుకుని ఉన్నాయి. వాటి నుండి ఎయిర్ గన్స్ తో క్యాటర్ బాల్‌తో దాడి చేసి ఉండొచ్చని అనుమానం. దీంతో స్కూల్ నుండి దాడి జరగొచ్చన్న కోణంలో కొనసాగుతున్న దర్యాప్తు చేస్తున్నారు.
స్కూల్‌కి గుడికి మధ్య నుంచి చెట్ల మధ్య నుండి దాడి జరగొచ్చన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. కుడివైపు జన సమూహం ఉండడంతో ఎడమవైపు స్కూల్, గంగానమ్మ గుడి మధ్య నుండి దాడి చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం. పూర్తిగా చీకటిగా, చెట్లు ఉండడంతో నిందితుడు ఎవరికీ కనిపించలేదు. దాడికి పాల్పడిన తర్వాత సులభంగా తప్పించుకోవచ్చని ఆ ప్రాంతాన్ని దాడికి ఎంచుకుని ఉంటాడని పోలీసులు అనుమానం. కేవలం 20 నుండి 30 అడుగుల దూరం నుండే సీఎం జగన్‌ని టీడీపీ గుండాలు టార్గెట్ చేశారు. సీఎం జగన్‌ని బలంగా కొట్టాలన్న ఉద్దేశ్యంతోనే దాడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment