‘జగనన్నే మా భవిష్యత్తు’.. ఇంటింటా సందడి | Huge Response For Jagananne Maa Bhavishyath Andhra Pradesh | Sakshi
Sakshi News home page

Jagan Anne Ma Bhavishyat: ‘జగనన్నే మా భవిష్యత్తు’.. ఇంటింటా సందడి

Published Mon, Apr 10 2023 1:35 AM | Last Updated on Mon, Apr 10 2023 3:53 PM

Huge Response For Jagananne Maa Bhavishyath Andhra Pradesh - Sakshi

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్టిక్కర్‌కు హారతులిస్తున్న మహిళలు

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలు, కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లు కలసికట్టుగా ఇంటింటికీ వెళ్తున్నారు. జగనన్న ప్రతినిధులుగా వచ్చిన వీరందరినీ.. తమ ఇంటికి బంధువులొచ్చినంత సంబరంగా ప్రజలు చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నారు. తమ ఇళ్ల వద్దకు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నారు. కొన్ని ఊళ్లలో మేళ­తాళాలతో ఎదురేగి ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మ­రథం పడుతున్నారు.

‘ఎమ్మెల్యే వద్దకు ప్రజలు వెళ్లడం మామూలే.. అందుకు విరుద్దంగా ప్రజల వద్దకే ఎమ్మెల్యే రావడం అంటే అది కేవలం ఒక్క జగనన్న వల్లే సాధ్యమైంది’ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగేళ్లలో ఏ మేరకు లబ్ధి కలిగిందో ప్రజలే ఆనందంగా నేతలకు వివరిస్తుండటం ఊరూరా ప్రత్యక్షంగా కనిపిస్తోంది. సీఎం వైఎస్‌ జగన్‌ పలు విధాలా తమను ఆదుకుంటున్నారని, ఇలా ఆదుకుంటుండటం కొంత మంది పెత్తందారులకు గిట్టడం లేదని అక్కచెల్లెమ్మలు నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంత మంచి పనులు చేస్తుంటే సంతోషించాల్సింది పోయి దుష్ప్రచారం చేయడం దుర్మార్గం అని, వారంతా బాగు పడరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, ఎల్లోమీడియా ఎన్ని అబద్ధాలు చెప్పినా.. వాటిని నమ్మే ప్రసక్తే లేదని.. తిరిగి జగనన్ననే మళ్లీ సీఎంగా గెలిపించుకుంటామని ప్రతినబూనుతున్నారు. ‘వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, రైతుల బాగు కోసం సీఎం జగన్‌ తీసుకున్నన్ని చర్యలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ సీఎం కూడా తీసుకోలేదు.

ఈ నాలుగేళ్లలో చేపట్టిన సంస్కరణలు ఆషామాషీ కాదు. వీటి ఫలితాలు ఎంతటి సంచలనాలు సృష్టిస్తాయో ముందు ముందు తెలుస్తుంది. 85–87 శాతం కుటుంబాలకు లబ్ధి చేకూర్చడమంటే మాటలా! అందువల్లే ఇంత ధైర్యంగా ఇంటింటికి ఆయన ప్రతినిధులుగా ఎమ్మెల్యేలను పంపిస్తున్నారు’ అని తిరుపతికి చెందిన వెంకటయ్య వ్యాఖ్యానించారు.

‘సీఎం జగనే లేకపోయుంటే మా పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేదో ఊహించలేం’ అని అనంతపురానికి చెందిన శ్రీదేవి, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రాణి పేర్కొంది.గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను వివరిద్దామనుకున్న నేతల కంటే ప్రజలే ముందుగా స్పందిస్తూ గత చంద్రబాబు పాలను తూర్పారబడుతున్నారు. తామంతా జగన్‌ వేంటేనని, ఆరు నూరైనా తిరిగి వైఎస్‌ జగనే సీఎం అవ్వడం ఖాయం అని స్పష్టం చేస్తున్నారు.  
 
అన్ని వర్గాలకూ న్యాయం చేశారు 
‘జగనన్నే మా భవిష్యత్తు’ మూడో రోజు కార్యక్రమం ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచే ప్రారంభమైంది. అన్ని వర్గాల ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. టీడీపీ సర్కార్‌కూ ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను వివరిస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కరపత్రాన్ని చదివి వినిపించినప్పుడు.. సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమతో పాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారనే మాట ప్రతి ఇంటా వినిపించింది.

చెప్పింది చెప్పినట్లు చేస్తున్నందు వల్లే ‘జగనన్నే మా భవిష్యత్‌’ అని స్పష్టం చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలతో తమకు అండదండగా నిలిచారని అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు సంతోషం వ్యక్తం చేశారు. ఈసారి మళ్లీ సీఎం జగన్‌కే తమ మద్దతు అని చెబుతున్నారు.  
 
స్వచ్ఛందంగా అభిప్రాయం 
ప్రజా సర్వేలో భాగంగా ప్రజా మద్దతు పుస్తకంలో స్లిప్పులలోని ఐదు ప్రశ్నలను గృహ సారథులు వినిపించినప్పుడు.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంతోనే తమకు న్యాయం జరిగిందని, మళ్లీ సీఎంగా వైఎస్‌ జగనే కావాలంటూ ప్రజలు సమాధానం చెబుతున్నారు. వాటిని నమోదు చేయించి, రసీదు తీసుకుంటున్నారు. ఆ తర్వాత గృహ సారథులు అడగక ముందే.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 82960 82960 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇస్తున్నారు.

ఆ వెంటనే.. ప్రభుత్వానికి మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం వైఎస్‌ జగన్‌ సందేశంతో ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గృహ సారథుల వద్ద నుంచి వైఎస్‌ జగన్‌ ఫొటో ఉన్న స్టిక్కర్లను తీసుకుని, ఇంటి తలుపునకు, మొబైల్‌ ఫోన్‌కు అతికించి.. ‘జగనన్నే మా భవిష్యత్‌’ అంటూ నినదించారు. ఇలా ఊరూరా రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని వర్గాల నుంచి స్వచ్ఛందంగా మద్దతు వ్యక్తం అవుతోంది. 
 
15 లక్షలకు పైగా మిస్డ్‌ కాల్స్‌ 
రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ‘జగనన్నే మా భవిష్యత్‌’ కార్యక్రమం ఈ నెల 7వ తేదీ ప్రారంభమైంది. సచివాలయానికి ముగ్గురు చొప్పున నియమించిన కన్వీనర్లు, ప్రతి 50 నుంచి వంద ఇళ్లకు ఇద్దరు చొప్పున నియమించిన గృహ సారథులతో కూడిన ఏడు లక్షల మంది సైన్యం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, వలంటీర్లతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

ఈ నేపథ్యంలో వారికి ప్రత్యేకమైన కిట్‌ బ్యాగ్‌లు అందజేశారు. 14 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా 15,004 సచివాలయాల పరిధిలో 1.60 కోట్ల కుటుంబాలలోని ఐదు కోట్ల మంది ప్రజలను కలుసుకోనున్నారు. ఇదిలా ఉండగా ’మెగా పీపుల్స్‌ సర్వే’కు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా మద్దతు పుస్తకంలో 21 లక్షలకు పైగా కుటుంబాలు పాల్గొన్నాయి. తొలి రెండు రోజుల్లోనే 82960–82960 నంబర్‌కు 15 లక్షలకు పైగా మిస్డ్‌ కాల్స్‌ వచ్చాయి.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement