
సాక్షి, అమరావతి: వీకెండ్‌లో ఒకసారి వచ్చి జనవాణి అంటూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రభుత్వంపై విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారని రాష్ట్ర కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి (శేషు) విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్, పచ్చమీడియా స్క్రిప్ట్‌నే పవన్ చదువుతున్నాడని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ పథకాన్ని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శేషు మాట్లాడుతూ.. పవన్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. కనీసం తాను కాపునని ధైర్యంగా చెప్పుకోలేని పవన్‌కల్యాణ్ ఇప్పుడు కాపులపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని పదేపదే చెప్పుకొనే పవన్.. కాపు సంక్షేమానికి నిధులు కేటాయించకుండా దగాచేసిన, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా వేధించిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.
వారానికోసారి బయటకు వచ్చి అవాకులు చెవాకులు పేలుతున్న పవన్‌కల్యాణ్ ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకువస్తే కాపులకు నిజంగా మేలు చేసిందెవరో రుజువులతో సహా వివరిస్తానని చెప్పారు. కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ నిజమైన హీరో అని పేర్కొన్నారు.
బాబు హయాంలో అక్రమాలు
చంద్రబాబు హయాంలో విదేశీ విద్య అమల్లో జరిగిన అక్రమాలను, లోపాలను విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం గుర్తించిందని తెలిపారు. 2016–17 నుంచి విదేశీ విద్య కోసం చెల్లించాల్సిన రూ.318 కోట్లను గత ప్రభుత్వం బకాయి పెట్టిందన్నారు. 2014 నుంచి 2017 వరకు కాపు కార్పొరేషన్‌కు అప్పటి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదన్నారు. కాపు కార్పొరేషన్‌ను చంద్రబాబు నిర్వీర్యం చేస్తే, కాపునేస్తంతోపాటు అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన నిజమైన కాపునేస్తం సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. కాపునేస్తం ద్వారా ఏడాదికి రూ.500 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.2,500 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.