‘కాపు కులాన్ని నీకు ఏమైనా అద్దెకు ఇచ్చామా?’ | Kapu Corporation Chairman Slams Pawan Kalyan | Sakshi
Sakshi News home page

‘కాపు కులాన్ని నీకు ఏమైనా అద్దెకు ఇచ్చామా?’

Published Sat, Dec 30 2023 4:30 PM | Last Updated on Sat, Dec 30 2023 5:03 PM

Kapu Corporation Chairman Slams Pawan Kalyan - Sakshi

సాక్షి,తాడేపల్లి:  కాపు కులాన్ని చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టడానికి పవన్‌ కళ్యాణ్‌ ఎవరని ప్రశ్నించారు కాపు కార్పోరేషన్‌ చైర్మన్‌ అడపా శేషు. కాపు కులాన్ని ఏమైనా పవన్‌కు అద్దెకు ఇచ్చామా? అంటూ నిలదీశారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో అడపా శేషు మాట్లాడుతూ.. కాపులను అణచి వేసేందుకు బాబు కుట్ర చేస్తుంటే అందులో పవన్‌ కళ్యాణ్‌ భాగస్తుడయ్యాడని ధ్వజమెత్తారు.

అడపా శేషు ఇంకా ఏమన్నారంటే..

కాపుల ద్రోహి పవన్‌కళ్యాణ్‌
రాష్ట్రంలో కాపు సోదరులకు పవన్‌ ఏం న్యాయం చేశాడు? వారికి పవన్‌ చేసిన అన్యాయం గురించి మాట్లాడతాను. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ముసుగులో నుంచి పుట్టిందా? లేదా?. దీనికి సమాధానం చెప్పాలి. 

మాట్లాడితే వైఎస్సార్‌సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకుల మీద పవన్‌కళ్యాణ్‌ చేస్తున్న దాడి గమనించండి. నిజానికి పవన్‌కళ్యాణ్‌కు రాష్ట్రంలో ఇల్లు లేదు. ఓటు లేదు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఇక్కడ ఓటు లేదు. ఇప్పుడు ఆయన భార్య అసలు భారతీయురాలే కాదు. ఆయన రెండో భార్య పిల్లలకు కూడా ఇక్కడ ఓటు హక్కు లేదు.కేవలం చంద్రబాబుకు మేలు చేయడం కోసమే పవన్‌ రాజకీయాలు చేస్తున్నాడు. చంద్రబాబును సీఎం చేయడం కోసమే పవన్‌ ఇక్కడకు చుట్టపుచూపుగా వస్తున్నాడు. అందుకే పవన్‌కళ్యాణ్‌ కాపుల ద్రోహి

పవన్‌ ఆనాడెందుకు ప్రశ్నించలేదు?
కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పర్యటించి, టార్గెట్‌ రాజకీయాలు చేస్తున్నాడు. కాపు ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా పవన్‌ రాజకీయాలు చేస్తున్నాడు. దీన్ని గమనించాలి. ప్రశ్నించేందుకే తాను పార్టీ పెట్టినట్లు చెప్పే పవన్‌కళ్యాణ్, నాడు వంగవీటి రంగాను హత్య చేసిన తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేయడం సిగ్గుచేటు. ముద్రగడ పద్మనాభం ఆత్మగౌరవాన్ని రోడ్డుకీడ్చినా కనీసం ప్రశ్నించలేదు.వంగవీటి రంగా గారిని చంపితే.. అది ఫ్యాక్షన్‌ హత్య అన్నాడు. అదే అక్కడ పరిటాల రవి హత్యను ప్రత్యర్థులు చేసిన హత్య అనడం దారుణం.ఎవరిది ఫ్యాక్షన్‌ హత్య? పవన్‌ అలా మాట్లాడడం సరికాదు. కాబట్టి ఆయన మాటలను గమనించమని కోరుతున్నాను. మనకూ ఆత్మ గౌరవం, పౌరుషం ఉంది. రొమ్ము విడిచి చెప్పగలం. కానీ ఎందుకు ఆ పని చేయలేకపోతున్నాం.

కాపులపై చంద్రబాబు కుట్ర
అటు ఉత్తరాంధ్ర మొదలు ఇటు రాయలసీమ జిల్లాల వరకు మనకు ఎందరో కాపు నాయకులు ఉన్నారు. వారు జిల్లాల్లో ఆధిపత్యం చేస్తుంటే.. దాన్ని అణిచి వేయడం కోసం చంద్రబాబు, పవన్‌చేత జనసేన పార్టీ పెట్టించి రాజకీయం చేస్తున్నాడు. అందుకే పవన్‌కళ్యాణ్‌ ఆయా ప్రాంతాల్లోనే పర్యటిస్తున్నాడు. కాబట్టి కాపు సోదరులు దీన్ని గమనించి, ప్రశ్నించాలని కాపు సోదరులను కోరుతున్నాను.

గత మూడు రోజులుగా రాజమండ్రి రూరల్‌లో పవన్‌ పర్యటిస్తున్నాడు. అక్కడే ఎందుకు? కేవలం కాపు సామాజికవర్గం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనే పర్యటించడం ఎందుకు? జనసేన ప్రారంభించిన రోజున కాపు సోదరులకు రాజ్యాధికార సాధన కోసం అందరూ అనుకున్నారు. కానీ కాపులు ఎక్కడా రాజ్యాధికారంలో ఉండకూడదన్నది చంద్రబాబు కుట్ర. అందుకే పవన్‌ను ఆయా చోట్లకు పంపిస్తున్నారు.

పవన్‌.. నీవా కాపులను కాపాడేది!
గతంలో మహానేత వైయస్సార్‌గారు మాత్రమే కాపులకు పెద్దపీట వేశారు. వారికి అన్నింటా ప్రాథాన్యత ఇచ్చారు. అదే చంద్రబాబునాయుడు, కాపు సోదరులను ఎక్కడికక్కడ అణిచివేసి, లోపల వేయించాడు. ఇటీవలే నారా లోకేష్‌ ఒక మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్‌ సీఎం చంద్రబాబు మాత్రమే అన్నారు. కానీ, పవన్‌ కనీసం దాన్ని కూడా ప్రశ్నించలేదు. 

టీడీపీ హయాంలో రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు జరిగాయి. వాటిని పవన్‌ కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడు వారాలబాబు మాదిరిగా రాష్ట్రానికి వారం రోజులకో, నెలకో ఒకసారి వస్తూ పవన్‌ రాజకీయాలు చేస్తున్నాడు. ఖమ్మంలో మంత్రి శ్రీ అంబటి రాంబాబుపై ఒక సామాజికవర్గం దాడి చేస్తే.. పవన్‌ కనీసం పట్టించుకోలేదు.

పవన్‌.. నీవా కాపులను కాపాడేది? నిన్ను నమ్ముకున్న కాపు సోదరులను ఏనాడైనా పట్టించుకున్నావా? వారికి కనీసం టికెట్లు అయినా ఇప్పించావా? వారిని ఎక్కడైనా కనీసం ఆదుకున్నావా? అసలు దేనికి నీ ప్రయాణం? కేవలం చంద్రబాబు ప్రయోజనాలు కాపాడడమేనా?

కాపు సోదరులు గుర్తించాలి
పవన్‌.. నీకంటూ రాష్ట్రంలో సొంత నియోజకవర్గం ఉందా? కనీసం ఇల్లైనా ఉందా?. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కాపు సోదరులు పోరాడుతున్నారు. అలాంటి వారిని పవన్‌కళ్యాణ్‌ తొక్కేస్తున్నాడు. కాబట్టి, కాపు పోదరులు ఒకసారి వాస్తవాలు గుర్తించాలి.

కాపులకు ఎవరు కావాలి?
సీఎం జగన్‌ కాపు సోదరులకు రాజకీయ పదవులు ఇవ్వడమే కాకుండా, వారికి ఆర్థిక పరిపుష్టత కూడా కలిగించారు. ఇన్ని పదవులు ఇచ్చిన జగన్‌గారు కావాలా? లేక కాపులను ఏకతాటిపై అమ్మేస్తున్న పవన్‌కళ్యాణ్‌ కావాలా? ఒక్కసారి ఆలోచించమని కాపు సోదరులను కోరుతున్నాను. ఒక్కసారి కళ్లు తెరవండి. పవన్‌ అనైతిక రాజకీయాలను నిలదీయండి.

టీడీపీలో భాగస్తుడు
నువ్వే దైవం, నువ్వే సర్వస్వం అని తిరిగిన జన సైనికులు, వీర నారీమణుల గురించి ఏనాడైనా పట్టించుకున్నావా? వారి గురించి ఏం చెప్పదల్చుకున్నావ్‌?. వారికి ఒక్క పదవి అయినా ఇచ్చావా? వారి ఆర్థిక స్థితి ఏమిటన్నది పట్టించుకున్నావా?. కనీసం నీ పర్యటనల్లో ఒక్క జన సైనికుడితో అయినా మాట్లాడావా?

పార్టీని, కులాన్ని పక్కన పెట్టేసి కేవలం చంద్రబాబునాయుడు పార్టీలో ఒక భాగస్తుడవయ్యావు. అందుకు ఈ ఫోటోలే నిదర్శనం.. (అంటూ టీడీపీ ప్రచురించిన పోస్టర్లు చూపిన అడపా శేషు).

అసలు పవన్‌కళ్యాణ్‌ జనసేన నాయకుడా? లేక తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నాయకుడా? లేకుంటే మేం చెబుతున్నట్లు చంద్రబాబు దత్తపుత్రుడా?. నిజానికి పవన్‌కళ్యాణ్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. కాపుల అభ్యున్నతిని అడ్డుకుంటున్న సామాజికవర్గ నాయకులను కట్టడి చేసే ప్రయత్నం కూడా చేయడం లేదు.

కాపు కులాన్ని అద్దెకు ఇచ్చామా?
ఇవాళ రాష్ట్రంలో చాలా చోట్ల టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తాము ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడితే, ఈరోజు అదే పార్టీని చంద్రబాబుకు, టీడీపీకి ఇస్తున్నావని వారంటే.. కనీసం సమాధానం చెప్పడం లేదు. నీకు కాపు కులాన్ని  అద్దెకు ఇచ్చామా? నీవేమైనా పోటుగాడివా? కాపులను ఉద్ధరిస్తారని నిన్ను నమ్మారనుకుంటున్నావా?

కాపులకు ఆర్థిక పరిపుష్టి కల్పించి, ఆదుకున్న నాయకుడు జగన్‌గారు మాత్రమే. కోవిడ్‌ సంక్షోభంలో కూడా వారిని ఆయన ఎంతో ఆదుకున్నారు.అదే పేదల రక్తం తాగిన చంద్రబాబుకు, పవన్‌ కొమ్ము కాస్తున్నాడు. కాబట్టి ఆలోచించమని కోరుతున్నాను.

చంద్రబాబు ఒక్కటైనా చెప్పుకోగలరా?
సీఎం జగన్‌ ఎక్కడికి పోయినా.. అక్కడి ప్రజలు ఆదరిస్తున్నారు. ఎందుకంటే ఊరూరా ప్రతి ఇంట్లో నాడు వైయస్సార్, ఇప్పుడు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ వల్ల ప్రయోజనం పొందిన వారున్నారు. అదే లోకేష్‌ 3 వేల కిలోమీటర్లు తిరిగాడంటున్నారు కదా? కనీసం ఒక్క ఊరిలో అయినా, తన తండ్రి వల్ల ఒక్క మేలు జరిగిందని చెప్పుకోగలరా? కనీసం ఒక్క కుటుంబం అయినా ముందుకొచ్చి, తమకు చంద్రబాబు వల్ల మేలు జరిగిందని చెప్పారా?.

కాపులకు నాడు–నేడు వారితోనే మేలు
పేదల సంక్షేమం కోసం నాడు వైయస్సార్, ఇప్పుడు జగన్‌గారు ఎంతో చేశారు. ఇంకా చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైయస్సార్‌ కుటుంబానికి పేదలంటే మక్కువ. వారికి మేలు చేయడం కోసం ఎక్కడా వెనకడుగు వేయరు. 

అదే చంద్రబాబు ఏం చేశాడనేది చూస్తే.. పేదల రక్తంతో ఎన్నో రాష్ట్రాలలో తన సామాజిక వర్గానికి కోటలు కట్టించాడు. పవన్‌కళ్యాణ్‌తో అవసరం ఉంటే, ఛార్టర్డ్‌ ఫ్లైట్‌ పెట్టించి, పవన్‌కు ఇక్కడకు రప్పిస్తున్నాడు.కాపుల్లో కానీ, ఇతర కులాల్లోని నిరుపేదలను కానీ ఆదుకోవడంలో జగన్‌గారు ఎంతో కృషి చేశారు. 

పవన్‌ ఏనాడు ఈ దిశలో పని చేయలేదు. కేవలం చంద్రబాబుకు మేలు చేయడం కోసం కాపు సామాజికవర్గం ఉన్న ప్రాంతాల్లో తిరుగుతూ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. పవన్‌ రాజకీయాలు చేస్తున్నాడు.

కాపులను ఎవరు గెలిపిస్తున్నారు? వారికి ఎవరు ఎక్కువ సీట్లు ఇస్తున్నారు? వారికి ఎవరు ఎక్కువ పదవులు ఇస్తున్నారు? ఇవన్నీ ఆలోచించమని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అదే సమయంలో పవన్‌కళ్యాణ్‌ చేస్తున్న అనైతిక రాజకీయాలను ప్రశ్నించమని కోరుతున్నాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement