గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్లకార్డులతో న్యాయవాదుల ధర్నా
సాక్షి నెట్‌వర్క్: హెకోర్టులో న్యాయమూర్తుల బదిలీలపై విమర్శలు చేస్తూ వాటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆపాదిస్తూ విధులను బహిష్కరించడం గర్హనీయమని రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్‌కు చెందిన న్యాయవాదులు ఆక్షేపించారు. ఇద్దరు జడ్జీల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేస్తే టీడీపీ మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు దీనికి రాజకీయం ఆపాదించడంపై వారు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తూ శనివారం అనేక జిల్లాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు.
న్యాయ వ్యవస్థకు కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్న దుష్టచతుష్టయం కుతంత్రాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎక్కడికక్కడ వినతిపత్రాలు ఇచ్చారు. రాజ్యాంగాన్ని, వ్యవస్థలను అపహాస్యం చేస్తున్న టీడీపీ, జనసేన పార్టీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఒంగోలులో ర్యాలీ నిర్వహించారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద కూడా పెద్ద సంఖ్యలో న్యాయవాదులు నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టి టీడీపీ, జనసేన పార్టీల కుట్రలు, కుతంత్రాలను ఎండగట్టారు.
మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడుపై చర్యలు తీసుకోవాలన్నారు. నెల్లూరులోనూ న్యాయవాదులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ, జనసేన తీరును నిరసిస్తూ కాకినాడలో మంత్రి దాడిశెట్టి రాజా సమక్షంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఇక గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన న్యాయవాదులు ‘రాజ్యాంగ పరిరక్షణకు దుష్టశక్తుల ఆట కట్టిద్దాం’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
ఎన్టీఆర్ జిల్లా, నగర కమిటీ ప్రతినిధులు విజయవాడలోనూ నిరసన ప్రదర్శన నిర్వహించి కోర్టులకు తప్పుడు సాక్ష్యాలు ఇవ్వమని చెప్పడం న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. మరోవైపు.. కోర్టుల్లో న్యాయమూర్తుల బదిలీలపై కూడా విమర్శలు చేస్తూ వాటిని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆపాదిస్తూ విధులను బహిష్కరించడం తగదంటూ శ్రీకాకుళంలోనూ న్యాయవాదులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు.
అనంతరం చెంగల్రాయుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్‌కు వినతిపత్రం అందించారు. చంద్రబాబు లాంటి వ్యక్తి చివరకు న్యాయవ్యవస్థలో బదిలీలను కూడా తన స్వార్థానికి వాడుకోవడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పలువురు లాయర్లు విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment