పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో అత్యాధునిక సాంకేతికతతో కూడిన రెడీమేడ్ ఇళ్ల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం పరిచయం చేస్తోంది. మన దేశ వాతావరణానికి తగ్గట్టుగా తక్కువ ఖర్చుతో.. నాణ్యమైన ఇళ్ల నిర్మాణాన్ని 6 విభిన్న మోడళ్లలో ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఈ టెక్నాలజీపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ‘గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ’ పేరిట లైట్ హౌస్ ప్రాజెక్టులను ప్రారంభించి.. వాటిని లైవ్ లేబొరేటరీలుగా మార్చింది.
సాక్షి, అమరావతి: పట్టణ గృహ నిర్మాణ రంగంలో ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇటుక, సిమెంట్‌తో నెలల తరబడి ఇళ్ల నిర్మాణాలు చేయక్కర్లేకుండా ఫ్యాక్టరీలోనే దాదాపు 90 శాతం ఇంటి పనులు పూర్తయిపోతాయి. విడిభాగాలను సైట్‌కు తరలించి బిగిస్తే బహుళ అంతస్తుల భవనం సిద్ధమైపోతుంది. విదేశాల్లో అమలులో ఉన్న ఈ టెక్నాలజీని ఇప్పుడు మనదేశంలో చేపట్టే నిర్మాణాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తక్కువ ఖర్చుతో వేగంగా బహుళ అంతస్తుల భవనం సిద్ధం కావడం ఇందులో ప్రత్యేకత.
కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్మాణ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 54 అత్యుత్తమ ప్రాజెక్టులను పరిశీలించి మనకు అనువైన 6 మోడళ్లను ఎంపిక చేసింది. ప్రజల్లో అవగాహన పెంచేందుకు గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్ పేరుతో చెన్నై, రాజ్‌కోట్, ఇండోర్, లక్నో, రాంచీ, త్రిపురలో నిర్మాణాలు చేపట్టింది. నిర్మాణ రంగంలో సరికొత్త విప్లవంగాను, లైట్ హౌస్ ప్రాజెక్టులుగా పేర్కొంటున్న వీటిని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ కాలేజీలతో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణ రంగంలో ఉన్న సంస్థలకు లైవ్ లే»ొరేటరీలుగా ఉపయోగపడనున్నాయి.
ఆరు ప్రాజెక్టుల్లో 6,368 ఇళ్ల నిర్మాణం
భిన్న భౌగోళిక, వాతావరణ పరిస్థితులున్న 6 రాష్ట్రాల్లో విభిన్న టెక్నాలజీలను ఉపయోగించి నిర్మాణాలను చేపట్టారు. ప్రీకాస్ట్ కాంక్రీట్ నిర్మాణ విధానంలో చెన్నైలో అన్ని వసతులతో 1,152 ఇళ్లను రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. రాజ్‌కోట్‌లో మోనోలిథిక్ కాంక్రీట్ టెక్నాలజీతో 1,144 ఇళ్లను నిర్మించారు. ఈ రెండు ప్రాజెక్టులు కోవిడ్‌తో దేశంలో ప్రతికూల పరిస్థితులున్నా తక్కువ కాలంలో విజయవంతంగా పూర్తయ్యాయి.
ఇండోర్‌లో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ శాండ్‌విచ్ ప్యానెల్ విధానంలో 1,024 ఇళ్లు, లక్నోలో పీవీసీ ఫ్రేంవర్క్ టెక్నాలజీతో 1,040 ఇళ్లు, రాంచీలో ప్రీకాస్ట్ కాంక్రీట్–3డీ నిర్మాణ విధానంలో 1,008 ఇళ్లు, అగర్తల (త్రిపుర)లో లైట్‌గేజ్ స్టీల్ స్ట్రక్చరల్ విధానంలో 1,000 ఇళ్లు నిర్మించారు. ఇకపై దేశంలోని అన్ని పట్టణాల్లో ప్రభుత్వం నిర్మించే ఇళ్లకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని యోచిస్తున్నట్టు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ప్రీకాస్ట్ కాంక్రీట్ విధానంలో..
ఈ విధానంలో భవనం గోడలు, స్లాబ్, మెట్లు, బీమ్ మొదలైన అన్ని భాగాలు ప్లాంట్ లేదా కాస్టింగ్ యార్డ్‌లో తయారు చేసి, సైట్‌లో ఒకదానికొకటి బిగిస్తారు. కాంక్రీట్‌ను కూడా ఫ్లైయాష్, గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్, మైక్రో సిలికా వంటి పారిశ్రామిక ఉప ఉత్పత్తులతో చేస్తారు. దీంతో మన్నికగా ఉండడంతో పాటు సహజ వనరులను సంరక్షించినట్టవుతుని నిపుణులు చెబుతున్నారు. ఈ టెక్నాలజీతో చెన్నైలో 1,152 ఇళ్లను నిర్మించారు.
మోనోలిథిక్ టన్నెల్ కాంక్రీట్‌తో..
‘టన్నెల్‌ఫార్మ్’గా పిలిచే అచ్చుల్లో స్లాబ్‌లు, గోడలు, గదులను ఒకేసారి వేస్తారు. ఇవి చాలా బలంగా ఉంటాయి. ఒక్కరోజులో సెంట్రింగ్ సపోర్టును తొలగించవచ్చు. గోడలకు ప్లాస్టరింగ్ అవసరం ఉండదు. వీటికీ ఫ్లైయాష్ గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్, మైక్రో సిలికా వంటి పారిశ్రామిక ఉప ఉత్పత్తులతో కాంక్రీట్ తయారు చేస్తారు. బాక్స్ టైప్ మోనోలిథిక్ స్ట్రక్చర్ కావడంతో భూకంపం, తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుంటుంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్ ఈ టెక్నాలజీతో 1,144 ఇళ్లను నిర్మించారు.
శాండ్‌విచ్ ప్యానెల్ టెక్నాలజీ ఇలా..
ఎక్కువ అంతస్తుల భవనాలు నిర్మించేటప్పుడు సంప్రదాయ ఇటుక గోడలకు బదులుగా ఫ్యాక్టరీలో తయారైన సిమెంట్ లేదా కాల్షియం సిలికేట్ బోర్డులను వాడతారు. స్టీల్ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్‌కు గోడలుగా ఈ బోర్డులను బిగిస్తారు. వీటిని ఫ్యాక్టరీలోనే తయారుచేసి సైట్‌లో ఒకదానికొకటి అనుసంధానిస్తారు. ఇవి తక్కువ బరువుతో పాటు మెరుగైన థర్మల్ ఇన్సులేషన్‌గానూ పనిచేస్తాయి. బలమైన పునాది కూడా అవసరం లేదు. ఇండోర్ (మధ్యప్రదేశ్)లో ఈ టెక్నాలజీతో 1,024 ఇళ్ల నిర్మాణం చేపట్టారు.
పీవీసీ పాలిమర్ కాంక్రీట్ టెక్నాలజీ
ఈ టెక్నాలజీలో ఇంటి ప్లాన్ ప్రకారం పాలీ వీనైల్ క్లోరైడ్ (పీవీసీ) వాల్ ప్యానెళ్లు ఫ్యాక్టరీలో తయారు చేసి సైట్‌లో బిగిస్తారు. స్ట్రక్చరల్ ఫ్రేమ్స్ బిగించిన తర్వాత గోడ ప్యానెళ్లను డెక్కింగ్ ఫ్లోర్‌తో అనుసంధానం చేస్తారు. గోడ ప్యానెళ్ల మధ్యనున్న ఖాళీల్లో కాంక్రీట్ నింపుతారు. లక్నోలో 1,040 ఇళ్లను ఈ టెక్నాలజీతో చేపట్టారు.
ప్రీకాస్ట్ కాంక్రీట్– 3డీ వాల్యూ మెట్రిక్ విధానం
3డీ వాల్యూమెట్రిక్ కాంక్రీట్ నిర్మాణంలో గదులు, టాయిలెట్, కిచెన్, బాత్రూమ్, మెట్లు.. ఇలా వేటికవే మాడ్యూల్స్‌గా యార్డులో నిర్మించి సైట్‌లో బిగిస్తారు. ఇలా ఒకదానిపై మరొకటిగా ఎన్ని అంతస్తులైనా బిగించవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా గోడలంటూ వేరుగా ఉండవు. అన్ని వాతావరణాలను తట్టుకోవడం దీని ప్రత్యేకత. ఈ విధానంలో రాంచీలో 1,008 ఇళ్లను నిరి్మస్తున్నారు.
లైట్‌గేజ్ స్టీల్ స్ట్రక్చరల్– ప్రీ ఇంజనీర్డ్ స్ట్రక్చరల్
పునాది అవసరం లేని ఈ టెక్నాలజీలో గాల్వనైజ్డ్ లైట్ గేజ్ స్టీల్ భాగాలతో ఇంటి భాగాలను బిగిస్తారు. ఫ్రేమ్‌ల మధ్యలో ఇన్సులేషన్ మెటీరియల్‌ను నింపి, తేలికపాటి కాంక్రీట్ ప్యానెళ్లను గోడలుగా అతికిస్తారు. ఈ విధానంలో నాలుగు అంతస్తుల భవనాన్ని నెల రోజుల్లోనే నిర్మించవచ్చు. భవనాన్ని విడదీసి మరోచోటుకు తరలించవచ్చు. స్టీల్ ఫ్రేమ్ బీమ్‌లు తేలిగ్గా ఉండటంతో భూకంపాలను తట్టుకుంటుంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నిర్మాణాలకు అనువైనది కావడంతో అగర్తల (త్రిపుర)లో 1,000 ఇళ్లను నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment