సాక్షి, విశాఖ: రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం కాకుండా అడ్డుకున్న చరిత్ర వైఎస్ కుటుంబానిదని, వైజాగ్‌లో జింక్, షిప్ యార్డులను కాపాడిన ఘనత దివంగత నేత రాజశేఖర్ రెడ్డిదేనని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. వైఎస్ హయాంలో స్టీల్ ప్లాంట్ విస్తరణకు అంకురార్పణ జరిగిందన్న విషయాన్ని ఆయన గర్తు చేశారు. విశాఖ స్టీల్స్‌ను కాపాడుకునేందుకు కార్మికులంతా ఏకమై ఉక్కు సంకల్పంతో ఉద్యమం చేస్తుంటే నారా లోకేష్ అసందర్భ ప్రేలాపన చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. టీడీపీ శిబిరానికి వెళ్ళిన లోకేష్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో వున్న కార్మికుల దీక్షలు కనిపించ లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉండగానే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు బీజం పడిందని, ఈ విషయాన్ని 2014 జూలై 14వ తేదీన పత్రికలు రాశాయని సాక్షాధారాలతో బహిర్గతం చేశారు.
పరిశ్రమ రాష్ట్రంలో ఉన్నందున పోస్కో ప్రతినిధులు సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిస్తే టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, నాడు చంద్రబాబు అధికారంలో ఉండగా అదే ప్రతినిధులు ఆయన్ను ఎందుకు కలిసారని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ రాష్ట్రంలోనే వున్నా దానిపై సర్వ హక్కులు కేంద్రానికే ఉంటాయన్న కనీస అవగాహన లేకుండా లోకేష్ మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ జరిగినప్పుడు ఏపీలోనే అత్యధికంగా 54 సంస్థలు ప్రైవేట్ పరం అయ్యాయని గుర్తు చేశారు. జింక్ కంపెనీ చంద్రబాబు హయాంలోనే ప్రైవేట్ పరం అయ్యిందన్న విషయాన్ని మరిచి, టీడీపీ నేతలు ఇప్పుడు జింక్ గురించి మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందన్నారు.
గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చినప్పుడు కేంద్ర కేబినెట్‌లో టీడీపీ మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి వున్న విషయాన్ని మరిచినట్టున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఏపీ ప్రజలకు శాపంగా మారాయన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలు చేస్తున్నారని, అందులో భాగంగా ప్రధానికి లేఖ కూడా రాశారని గర్తు చేశారు. ఇటువంటి సమయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుశ్ప్రచారం చేయడం సరికాదన్నారు. లోకేష్ బరువు తగ్గించు కోవడానికని వెళ్లి బ్రెయిన్ తగ్గించు కున్నాడని ఎద్దేవా చేశారు. 420 యూనివర్సిటీ పెడితే చంద్రబాబు వైస్ ఛాన్సలర్ అవుతారని విమర్శించారు. లోకేష్ విశాఖలో అడుగుపెట్టే ముందు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment