
మడకశిర : అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామికి కరోనా పాజిటివ్ రావడంతో గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఫోన్‌లో ఆయనను పరామర్శించారు. ఎమ్మెల్యే ఆరోగ్యం పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. అంతేకాకుండా ఆస్పత్రి డాక్టర్లతో కూడా ఫోన్‌లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. ఎమ్మెల్యే తనయుడు డాక్టర్ స్వామిదినేష్‌తో కూడా ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు.
ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌కు కరోనా పాజిటివ్
నూజివీడు: నూజివీడు శాసనసభ్యుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఐదు నెలలుగా ప్రజాహిత కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్న ఎమ్మెల్యే ప్రతాప్ రెండు రోజుల కిందట కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. తనకు కరోనా లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాయని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఎమ్మెల్యే ప్రతాప్ చెప్పారు. ప్రస్తుతం తాను హైదరాబాద్‌లో క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఎవరైనా అత్యవసరమైతే ఫోన్‌లో తనను సంప్రదించవచ్చన్నారు. ఎవరికైనా పనులుంటే పట్టణంలోని తన కార్యాలయానికి వెళ్లి కార్యాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్తే పరిష్కరిస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment