తిరుమల: శ్రీవారి ఆలయంలో నూతన రూపంలో హుండీలను ఏర్పాటు చేసేందుకు టీటీడీ అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. అందులో భాగంగా శనివారం శ్రీవారి ఆలయంలోకి స్టీల్‌తో తయారు చేసిన ఐదు అడుగుల హుండీని ప్రయోగాత్మకంగా తీసుకెళ్లి పరిశీలించారు. ప్రస్తుతం కొప్పెరలో భారీ గంగాళాలను ఉంచి అందులో భక్తులు కానుకలు సమర్పించేలా హుండీలను, మరికొన్ని ఇత్తడి హుండీలను ఏర్పాటు చేసి వినియోగిస్తున్నారు.
వీటిని శ్రీవారి సేవకులు, బ్యాంకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా ట్రాలీల్లో శ్రీవారి ఆలయం నుంచి బయటకు, అక్కడి నుంచి లిప్టు ద్వారా లారీలో ఎక్కిస్తున్నారు. అక్కడి నుంచి నూతన పరకామణికి తరలిస్తున్నారు. అయితే ఇటీవల హుండీ తరలింపు సమయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో నూతన హుండీలను తయారు చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కొంత మంది ఆలయంలోకి ప్రవేశించి హుండీలో భక్తులు నగదు వేస్తున్న సమయంలో హుండీ లోపలకు చేయిపెట్టి చోరీ చేసిన సంఘటనలు తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ రెండు ఇబ్బందులు రాకుండా నూతన హుండీలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నూతన హుండీలో మూడు వైపులా భక్తులు నగదు వేయవచ్చు. అదే సమయంలో ఇందులో భక్తుడి చేయి పూర్తిగా దూరే అవకాశం లేదు. మధ్యలో ఓ ఇనుప చువ్వను ఏర్పాటు చేశారు. ఈ మేరకు నూతన హుండీ పనితీరును అధికారులు పరిశీలిస్తున్నారు. వినియోగం సులభంగా ఉంటే దీనినే ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
నేడు శ్రీవారి పాదాల వద్ద ఛత్రస్థాపనోత్సవం
తిరుమల నారాయణగిరిలోని శ్రీవారి పాదాల వద్ద ఆదివారం ఛత్రస్థాపనోత్సవం జరుగనుంది. ఏడాదికోసారి ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఆలయంలోని బంగారు బావి నుంచి తీర్థాన్ని తీసుకొచ్చి శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, అలంకారం, పూజ, నైవేద్యం సమర్పిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment