విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి.. నాణ్యమైన విద్యాబోధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో నూతన సంస్కరణల వైపు అడుగులు వేస్తోంది. విద్యార్థుల భవిష్యత్‌కు టెన్త్ కీలక మలుపు. పదో తరగతి పరీక్షలంటే విద్యార్థుల్లో ఎక్కడాలేని భయం. ఈ భయాన్ని పోగొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షల్లో సమూల మార్పులు తీసుకు వచ్చింది. పది పబ్లిక్ పరీక్షల్లో 11 పేపర్లకు బదులు 6 పేపర్లు నిర్వహించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. సీబీఎస్‌ఈ తరహాలో పరీక్షలు నిర్వహించనున్నారు.
నెల్లూరు (టౌన్): టెన్త్ పరీక్షలంటే.. ఇక నో టెన్షన్. విద్యా వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలతో విద్యార్థులపై చదువులు, ర్యాంక్‌లు, మార్కులు ఒత్తిడి తగ్గనుంది. తద్వారా నాణ్యమైన విద్య ప్రమాణాలు అందనున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి పబ్లిక్ పరీక్షల్లో 6 పేపర్లనే ఉండడంతో విద్యార్ధులపై ఒత్తిడి తగ్గుతుందని పలువురు విద్యావేత్తలు చెబుతున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ప్రభుత్వం నిర్ణయంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలలు 420 వరకు ఉన్నాయి.
వీటిల్లో 35 వేల మందికి పైగా విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. గతంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మొత్తం 11 పేపర్లు ఉండేవి. హిందీ మినహా మిగిలిన ఒక్కో సబ్జెక్ట్‌కు రెండు పేపర్లు ఉండేవి. కోవిడ్ కారణంగా గతేడాది çపది పబ్లిక్ పరీక్షల్లో 7 పేపర్లు నిర్వహించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో 2019–20, 2020–21 విద్యా సంవత్సరాల్లో పది పబ్లిక్ పరీక్షలు నిర్వహించలేదు. సమ్మేటివ్ పరీక్షల్లో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకుని పబ్లిక్ పరీక్షలకు సంబంధించి మార్కులు కేటాయించారు. 2022–23 విద్యా సంవత్సరం నుంచి పది పబ్లిక్ పరీక్షల్లో 6 పేపర్లు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. దీని వల్ల విద్యార్థులకు భారం తగ్గడంతో పాటు మానసిక ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం కలుగుతుందని విద్యావేత్తలు అభిప్రాయ పడుతున్నారు. పది పబ్లిక్ పరీక్షల్లో తెలుగు, హిందీ, ఇంగ్లి‹Ù, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్ట్‌లు ఉంటాయి. వీటిల్లో హిందీకి తప్ప మిగిలిన సబ్జెక్ట్‌లకు రెండేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తరహాలో ఒక్కో సబ్జెక్ట్‌కు ఒక్కో పరీక్షను మాత్రమే నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి మోడల్ పేపర్లను సిద్ధం చేసి ఉపాధ్యాయులకు అందజేశారు.
చదువుకునేందుకు ఎక్కువ సమయం
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 6 పేపర్లకు తగ్గించడంతో విద్యార్థులు చదువుకునేందుకు ఎక్కువ సమయం దొరుకుతుంది. ఎక్కువ రోజులు పరీక్షలు జరగకుండా నూతన పరీక్ష విధానం వల్ల పరీక్షలు కేవలం 6 రోజుల్లోనే ముగిసిపోతాయి. దీని వల్ల విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. పరీక్షల సమయంలో ప్రశాంతంగా రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు ఉపయోగపడుతుంది. పోటీ పరీక్షలకు కూడా విద్యార్థులు టెన్షన్‌ను పక్కన బెట్టి రాసేందుకు సిద్ధమవుతారు.
– పి. రమేష్, డీఈఓ
ఆనందం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 6 పేపర్లు నిర్వహించాలని నిర్ణయించడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ పరీక్షల్లో తక్కువ పేపర్లు నిర్వహించడం వల్ల చదువుకునేందుకు సమయం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో పాటు టెన్షన్ కూడా తగ్గుతుందంటున్నారు. నూతన జిల్లాల్లోనే పది పబ్లిక్ పరీక్షలు నిర్వహించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. పరీక్షలను కూడా పకడ్బందీగా నిర్వహించేలా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment