అండమాన్‌కు చలో చలో | Onslaught Of Tourists To The Andamans Increased Again | Sakshi
Sakshi News home page

అండమాన్‌కు చలో చలో

Published Sun, May 1 2022 11:36 AM | Last Updated on Sun, May 1 2022 11:40 AM

Onslaught Of Tourists To The Andamans Increased Again - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం నుంచి పోర్టు బ్లెయిర్‌కు తొలినాళ్లలో మూడు నెలలకోసారి పాసింజర్‌ షిప్‌ నడిచేది. క్రమంగా డిమాండ్‌ పెరగడంతో నెలకోసారి పరుగులు తీసింది. విశాఖ పోర్టు నుంచి ఉత్తరాంధ్రతో పాటు ఇతర జిల్లాల నుంచి ప్రయాణికులు, ముఖ్యంగా వలసదారులు ఈ నౌక ద్వారానే అండమాన్‌ చేరుకునేవారు. ఫుల్‌ డిమాండ్‌తో నడుస్తున్న తరుణంలో కరోనా వ్యాప్తి చెందడం... లాక్‌డౌన్‌ కారణంగా.. షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా రెండేళ్ల పాటు రాకపోకలను నిలిపివేసింది. తాజాగా పరిస్థితులు సద్దుమణిగిన నేపథ్యంలో ఫుల్‌ స్వింగ్‌లో షిప్‌ ప్రయాణం మొదలుపెట్టింది.

శనివారం సాయంత్రం బయలుదేరి..
450 మంది ప్రయాణికులతో శనివారం సాయంత్రం పోర్టుబ్లెయిర్‌లో పాసింజర్‌ కార్గో షిప్‌ క్యాంప్‌బెల్‌ బే బయలుదేరింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వారే 95 శాతం మంది  ఇందులో ఉండటం విశేషం. అండమాన్‌ నికోబార్‌లో వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న వారంతా.. వేసవి సెలవుల కోసం తమ స్వస్థలాలకు బయలుదేరినట్లు షిప్‌ ఏజెంట్స్‌ చెబుతున్నారు. మూడు రోజుల ప్రయాణం తర్వాత విశాఖపట్నం పోర్టుకు ఈ నెల 3వ తేదీ ఉదయం చేరుకోనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ట్రాఫిక్‌ మేనేజర్‌ రత్నకుమార్‌ పూర్తి చేశారు.

5న ఫుల్‌ప్యాక్‌తో ప్రయాణం
విశాఖ నుంచి తిరుగు ప్రయాణం కూడా ఖరారైంది. ఈ నెల 5వ తేదీ సాయంత్రం క్యాంప్‌బెల్‌ బే షిప్‌ విశాఖ నుంచి బయలుదేరనుంది. 8వ తేదీ ఉదయానికి క్యాంప్‌బెల్‌ బే.. తిరిగి పోర్టు బ్లెయిర్‌కు చేరుకోనుంది. సుదీర్ఘ విరామం తర్వాత నడుస్తుండటంతో టికెట్స్‌ హాట్‌ కేక్స్‌లా అమ్ముడు పోయాయి. మొత్తం 500 మంది సామర్థ్యం ఉండగా బుకింగ్స్‌ ప్రారంభించిన రెండ్రోజుల్లోనే మొత్తం టికెట్స్‌ విక్రయించేశారు. అండమాన్‌ నికోబార్‌ అడ్మినిస్ట్రేషన్‌ మార్గదర్శకాలను అనుసరించి క్యాంప్‌బెల్‌షిప్‌ని నడుపుతున్నట్లు షిప్పింగ్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న ఏవీ భానోజీరావు, గరుడ పట్టాభి రామయ్య అండ్‌ కో ఏజెన్సీ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

డిమాండ్‌ నేపథ్యంలో మరో షిప్‌ రెడీ..!
క్యాంప్‌బెల్‌ బే ప్యాసింజర్‌ కార్గో షిప్‌ తొలి ప్రయాణంలోనే 100 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేయడంతో షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టికెట్స్‌ ఇంకా కావాలంటూ ప్రజల నుంచి ఒత్తిడి వస్తుండటంతో మరో షిప్‌ని కూడా నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో విశాఖ నుంచి పోర్టుబ్లెయిర్‌కు ఎంవీ స్వరాజ్‌ద్వీప్‌ నౌక రాకపోకలు సాగించేది. తర్వాత ఎంవీ హర్షవర్థన్‌ నడిపారు. రెండేళ్ల క్రితం ఇది మరమ్మతులకు గురికావడంతో డాక్‌యార్డులో మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఇది దాదాపు పూర్తయిందనీ.. త్వరలోనే ఎంవీ హర్షవర్ధన్‌ షిప్‌ని విశాఖ నుంచి పోర్టు బ్లెయిర్‌కు రాకపోకలు సాగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ప్రయాణం చాలా చౌక
అండమాన్‌కు చాలా తక్కువ ధరకే ప్రయాణం చేయవచ్చు. అయితే ప్రయాణికులను రెండు రకాలుగా విభజించారు. అండమాన్‌ ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రయాణికుడిని ఐలాండర్‌ అనీ.. పర్యాటకుల్ని నాన్‌ ఐలాండర్‌గా షిప్‌ టికెట్స్‌ విక్రయంలో విభజిస్తారు. ఐలాండర్‌కు జనరల్‌ టికెట్‌ కేవలం రూ.1250 మాత్రమే కాగా.. పర్యాటకుడికి జనరల్‌ టికెట్‌ రూ.3,375 వసూలు చేస్తున్నారు. విశాఖ నుంచి అండమాన్‌కు విమానంలో వెళ్లాలంటే రూ.10 వేల వరకూ ఖర్చవుతుంది. ఎంత లగేజ్‌ తీసుకెళ్లినా.. ఎలాంటి అదనపు చార్జీ వసూలు చేయడం లేదు. మొత్తం నాలుగు విభాగాలుగా టికెట్స్‌ విక్రయాలు జరుపుతున్నట్లు షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులు తెలిపారు.

మంచి ప్రారంభం దక్కింది
కోవిడ్‌ తర్వాత అండమాన్‌కు పాసింజర్‌ షిప్‌ ప్రయాణం మొదలు కావడం సంతోషంగా ఉంది. గతంలో మాదిరిగానే ప్రారంభం నుంచే ప్రయాణికులు ఆసక్తి చూపించడం శుభపరిణామం. ఈ నెల 3న వస్తున్న షిప్‌కు బెర్తు, ఇతర సౌకర్యాలు పోర్టు పరంగా పూర్తి చేశాం. ప్రతి ప్రయాణికుడు కనీసం 10–15 పెద్ద సైజు బ్యాగ్‌లు, లగేజీతో ప్రయాణిస్తుంటారు. ఇందుకనుగుణంగా పోర్టులోకి ఆర్టీసీ బస్సులను కూడా ఆ సమయంలో అనుమతిస్తున్నాం.
 – కె.రామ్మోహన్‌రావు, విశాఖ పోర్టు చైర్మన్‌ 

(చదవండి: రాచబాటల్లో రయ్‌ రయ్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement