ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు 73 వేల దరఖాస్తులు
ర్యాలీ నుంచి ఇంటింటి ప్రచారం వరకు అన్నీ ఈ పోర్టల్ ద్వారానే
ముందు దరఖాస్తు చేసుకున్నవారికి ముందు అవకాశం
సాక్షి, అమరావతి: ఎన్నికల ప్రవర్తన నియమావళికి అనుగుణంగా రాజకీయ పార్టీలు తీసుకోవాల్సిన ముందస్తు అనుమతులు సులభతరంగా, పారదర్శకంగా అందించడానికి తీసుకొచ్చిన సువిధ పోర్టల్ రికార్డులు సృష్టిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత 20 రోజుల్లోనే దేశవ్యాప్తంగా రాజకీయపార్టీలు, అభ్యర్థుల నుంచి 73,379 అభ్యర్థనలు వచ్చినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో 60 శాతం (44,626) అభ్యర్థనలకు అనుమతులు ఇవ్వగా 15 శాతం (11,200) అభ్యర్థనలను తిరస్కరించినట్లు తెలిపింది. మిగిలిన అభ్యర్థనలు పరిశీలనలో ఉన్నట్లు పేర్కొంది.
సువిధ పోర్టల్ వినియోగంలో 23,239 అభ్యర్థనలతో తమిళనాడు మొదటిస్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో పశ్చిమబెంగాల్ (11,976 అభ్యర్థనలు), మధ్యప్రదేశ్ (10,636 అభ్యర్థనలు) ఉన్నాయి. కనిష్టంగా చండీగఢ్‌లో 17 అభ్యర్థనలు, లక్షదీ్వప్‌లో 18, మణిపూర్లో 20 అభ్యర్థనలు అందాయి. ఇంకా నోటిఫికేషన్ వెలువడాల్సిన ఆంధ్రప్రదేశ్ నుంచి 1,153 అభ్యర్థనలు వచ్చాయి. ఉచిత, న్యాయమైన, పారదర్శకమైన ప్రజాస్వామ్యం అనే సూత్రాలకు అనుగుణంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల నుంచి అనుమతి అభ్యర్థనలు స్వీకరించేందుకు, వెంటనే వాటిపై చర్యలు తీసుకునేందుకు భారత ఎన్నికల సంఘం సువిధ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది.
పార్టీలు, అభ్యర్థులు ఓటర్లకు చేరువయ్యే కార్యక్రమాలకు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సూత్రంపై పారదర్శకంగా అనుమతులు ఇచ్చేందుకు ఈ పోర్టల్ వీలు కల్పిస్తోంది. ర్యాలీలు నిర్వహించడం, తాత్కాలిక పార్టీ కార్యాలయాలు తెరవడం, ఇంటింటికి ప్రచారం చేయడం, వీడియో వ్యాన్లు, హెలికాప్టర్లు, వాహనాలు, కరపత్రాలు పంపిణీ వంటి వాటికి అనుమతులు ఇస్తుంది.
ఆన్‌లైన్ ద్వారా అనుమతులు
సువిధ పోర్టల్ (https://suvidha.eci.gov. in) ద్వారా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎక్కడనుంచైనా, ఎప్పుడైనా అనుమతి అభ్యర్థనలను ఆన్‌లైన్‌లో సమరి్పంచవచ్చు. ఆఫ్‌లైన్‌లో కూడా అభ్యర్థనలు ఇవ్వవచ్చు. వివిధ రాష్ట్ర విభాగాల నోడల్ అధికారులతో నిర్వహించే పటిష్టమైన ఐటీ ప్లాట్‌ఫాం సహకారంతో దరఖాస్తులను సమర్థంగా ప్రాసెస్ చేయడానికి ఈ పోర్టల్ సహాయకారిగా ఉంటోంది. యాప్ ద్వారా కూడా సువిధ సేవలను పొందవచ్చు. దరఖాస్తుదారులు తమ అభ్యర్థనల స్థితిని ట్రాక్ చేయవచ్చు. ఈ యాప్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారాల్లో అందుబాటులో ఉంది.
సువిధ ప్లాట్‌ఫాం ఎన్నికల ప్రక్రియ సామర్థ్యాన్ని పెంపొందించడమే కాకుండా, అప్లికేషన్ల రియల్ టైమ్ ట్రాకింగ్, స్టేటస్ అప్‌డేట్, టైమ్‌స్టాంప్ చేసిన సమర్పణలను ఎంఎస్‌ఎం ద్వారా తెలియజేయడం ద్వారా పారదర్శకతను నిర్ధారిస్తుంది. ఇంకా పోర్టల్‌లో లభించే అనుమతి డేటా ఎన్నికల వ్యయాలను పరిశీలించడానికి విలువైన వనరుగా ఉపయోగపడుతుంది. ఎన్నికల ప్రక్రియలో మరింత జవాబుదారీతనం, సమగ్రతకు దోహదపడటమేగాక ఎన్నికల సంఘం నిబద్ధతను పునరుద్ఘాటించడానికి సువిధ ప్లాట్‌ఫాం ఎంతో దోహదపడుతుంది. న్యాయమైన, సమర్థమైన, పారదర్శక ఎన్నికల వాతావరణాన్ని సులభతరం చేయడానికి, అన్ని రాజకీయపార్టీలు, అభ్యర్థులు అవసరమైన అనుమతులు పొందేందుకు సమాన అవకాశాలు కలి్పంచేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment