
తిరుమలరెడ్డినగర్‌లో ఫీవర్ సర్వేను పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీహరి
తిరుపతి, అన్నమయ్య సర్కిల్: కరోనా డెల్టా ప్లస్ వేరియంట్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ యు.శ్రీహరి పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్‌ల ఆదేశాల మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో ప్రస్తుతం ఎటువంటి డెల్టా ప్లస్ కేసులు లేవన్నారు. తిరుపతిలో డెల్టా ప్లస్ ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తిరుపతి మంగళం పీహెచ్‌సీ పరిధిలో ఓ వ్యక్తికి ఏప్రిల్ 4న పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, 5న స్విమ్స్ కోవిడ్ కేర్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారన్నారు.
బాధితుడు కరోనాకు చికిత్స తీసుకొని ఏప్రిల్ 13న డిశ్చార్జ్ అయ్యాడని, ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వెల్లడించారు. చికిత్స తీసుకున్న సమయంలో అతని నుంచి శాంపిల్స్‌ను సేకరించి హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పరీక్ష నిమిత్తం పంపించారన్నారు. జూన్ 23వ తేదీన వచ్చిన రిజల్ట్‌లో డెల్టా ప్లస్‌గా నిర్ధారణ అయిందన్నారు. సమాచారం అందిన వెంటనే ఆ వ్యక్తిని, అతని కుటుంబసభ్యులను పరామర్శించి, ఆరా తీయగా అందరూ ఆరోగ్యంగా వున్నారని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని గుర్తించామన్నారు. అతను నివసించే ప్రాంతంలో ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించగా అక్కడి వారంతా కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు తేలిందన్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో డెల్టా వేరియంట్ ప్రభావం ఏమాత్రం లేదన్న విషయాన్ని గుర్తించి ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment