కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం చాకలిపాలెంలో ప్రసంగిస్తున్న చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, ఏలూరు, కాకినాడ / పెనుగొండ: తమ ఊళ్లను వరద ముంచెత్తినప్పటి నుంచీ ప్రభుత్వం తమను ఆదుకుంటోందని, భోజనం, నీళ్లు, వసతి సౌకర్యాలు కల్పించారని లంక గ్రామాల ప్రజలు ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి స్పష్టం చేశారు. గురువారం ఆయన పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో వరద పరామర్శ యాత్ర నిర్వహించారు. తొలుత ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండ, ఆచంట మండలాల్లో కారు కాన్వాయ్, ట్రాక్టర్, పడవపై పర్యటించి బాధితులతో మాట్లాడారు. పెనుగొండ మండలం దొంగరావిపాలెం చేరుకొన్న చంద్రబాబు.. సిద్ధాంతం, నడిపూడి, చినమల్లం మీదుగా కోడేరుకు వచ్చారు. అక్కడి నుంచి పంటుపై మర్రిమూలం చేరుకున్నారు.
భోజనాలు అందుతున్నాయా.. అంటూ పడవపై నుంచే జనాన్ని ప్రశ్నించారు. తాగునీరు, భోజనాలు అందుతున్నాయని ప్రజలు రెండుసార్లు చెప్పినప్పటికీ, మళ్లీ అదే ప్రశ్న వేశారు. ప్రభుత్వంపై అదే పనిగా విమర్శలు మొదలు పెట్టడంతో గోదావరి బ్రిడ్జిపై సమాధానం చెప్పాలంటూ లంకవాసులు గొంతెత్తారు. రెండుసార్లు శంకుస్థాపనకే పరిమితం చేశారని నిలదీశారు. బ్రిడ్జి నిర్మాణం చేయలేకపోయామని, అధికారంలోకి రాగానే నిర్మిస్తామని బాబు హామీ ఇచ్చారు. వాస్తవానికి లంక గ్రామాల్లో ప్రభుత్వం అందిస్తున్న భోజనాలతో పాటు, మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు సొంత ఖర్చులతో భోజనాలు అందిస్తూ లంకవాసుల మన్ననలు పొందుతున్నారు. దీంతో చంద్రబాబు పదేపదే ప్రశ్నించినా ప్రజల నుంచి ఆయనకు సానుకూల స్పందన రాలేదు.
హైడ్రామా.. హడావిడి
చంద్రబాబు పర్యటనకు జనం నుంచి స్పందన లేకపోవడంతో టీడీపీ నేతలు హైడ్రామాకు తెరతీశారు. మర్రిమూలంలో చంద్రబాబు ప్రసంగం పూర్తయ్యాక.. గ్రామానికి చెందిన కొప్పాడి వీరమ్మ అనే మహిళ చేతికి బురద నీటి వాటర్ బాటిల్ ఇచ్చి ఇవే తాగుతున్నామని చెప్పమన్నారు. దాంతో సదరు మహిళ ఆ వాటర్ బాటిల్ చూపించింది. దానిపై చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘గోదావరి వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది.
బాధ్యత కలిగిన సీఎం అయితే ఇక్కడే ఉండి ప్రజల కష్టాలు తీర్చాలి. హుదూద్, తిత్లీ తుపాన్‌ల సమయంలో తుపాన్ కంటే వేగంగా ఈ ప్రాంతానికి వచ్చి ఆదుకున్నాం. బాధిత కుటుంబాలకు కేవలం రూ.2 వేలు ఇస్తున్నారు’ అని అన్నారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబు వెళ్లిన అనంతరం విలేకరులు కొప్పాడి వీరమ్మను ఈ నీళ్లే తాగుతున్నారా.. అని ప్రశ్నించగా.. అదేమీ లేదని చెప్పింది. టీడీపీ వాళ్లు ఆ బాటిల్ ఇచ్చి, అలా చెప్పమని బలవంతం చేశారంది. తమకు రోజూ భోజనం, మంచి నీళ్లు అందుతున్నాయని చెప్పింది.
దారిపొడవునా పూల దండలు, బొకేలు..
అనంతరం చంద్రబాబు గోదావరిలో పంటుపై కోనసీమ జిల్లా రాజోలు మండలం సోంపల్లికి చేరుకున్నారు. ఆ తర్వాత బాబు.. సోంపల్లి నుంచి పి.గన్నవరం మండలం చాకలిపాలెం వెళ్లారు. అక్కడ నుంచి మానేపల్లి చేరుకున్నారు. ఎక్కడికక్కడ ముందస్తుగా తరలించిన పార్టీ శ్రేణులు ఆయనకు భారీగా స్వాగతం పలికి హడావిడి చేశాయి. దారిపొడవునా పుష్పగుచ్ఛాలు, పూల దండలు, బొకేలతో కార్యకర్తలు హంగామా చేశారు. సీఎం.. సీఎం.. అని నినాదాలు చేశారు. మానేపల్లిలో.. మృతి చెందిన కడలి శ్రీనివాసరావు, కారాడి రామకృష్ణ కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారు. వారి కుటుంబాలకు రూ.75 వేల చొప్పున పరిహారం అందించారు. ఈ పర్యటన ఆద్యంతం పార్టీ ప్రచారం, బల ప్రదర్శనను తలపించింది.
Comments
Please login to add a commentAdd a comment