ప్రేమ పేరుతో వంచించి బాలికను గర్భిణిని చేసిన టీడీపీ నాయకుడి కుమారుడు
చెప్పినట్లు రాజీకి రాకపోతే బజారుకీడుస్తానంటూ బెదిరింపులు
భయపడి బాలిక తల్లి ఆత్మహత్యా యత్నం
ఒంగోలులోని ఒక ప్రైవేటు వైద్యశాలలో ప్రాణాలతో పోరాటం
దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి అండతోనే అబ్బాయి తండ్రి రెచ్చిపోతున్నాడంటూ బాలిక తండ్రి ఆరోపణలు
తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి వేడుకోలు
ఒంగోలు టౌన్: ప్రేమపేరుతో వెంటపడి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఒక బాలికను గర్భిణిని చేశాడు దర్శి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడి కుమారుడు. తమకు న్యాయం చేయమంటూ వేడుకున్న బాధిత బాలిక కుటుంబ సభ్యులపై బెదిరింపులకు దిగడంతో భయాందోళనకు గురైన బాలిక తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఒంగోలులోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బాధిత బాలిక తండ్రి కథనం ప్రకారం..
కావలికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె కావలిలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతుండగా, చిన్న కుమార్తె దర్శి సమీప గ్రామంలో అమ్మమ్మ దగ్గర ఉంటూ 7వ తరగతి చదువుకుంటోంది. కొద్దిరోజులుగా గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఏనిగంటి కోటేశ్వరరావు కుమారుడు వరుణ్ చౌదరి ప్రేమ పేరుతో బాలిక వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. శారీరకంగా లోబరుచుకొని గర్భిణిని చేశాడు. ఈ విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఆగస్టులో దర్శి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి వరుణ్ చౌదరిని అరెస్టు చేశారు.
రూ.50 వేలు ఇస్తా తీసుకొని వెళ్లు ...
బాలికను గర్భిణిని చేసిన వరుణ్ చౌదరి తండ్రి కొద్ది రోజులుగా రాజీ ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టాడని బాలిక తండ్రి చెబుతున్నారు. రాజంపల్లికి చెందిన తెలుగుదేశం నాయకులను మధ్యవర్తులుగా రాయబారానికి పంపించాడన్నారు. వారి ద్వారా డబ్బులు ఇస్తానంటూ ఆశ పెట్టాడని, అయితే ఇందుకు అంగీకరించలేదని, తమకు డబ్బులు ఏమీ వద్దని, తమ కూతురిని పెళ్లి చేసుకోవాలని కోరామన్నాడు. దాంతో అగ్గిమీద గుగ్గిలమైన కోటేశ్వరరావు రూ.50 వేలు ఇస్తా, తీసుకొని పోండి. పెళ్లి అంటే ఎదురు కేసు పెట్టి బాలికను, బాలిక తల్లిని బజారుకీడుస్తానంటూ రెచ్చి పోయాడని ఆరోపించాడు.
చెప్పినట్లు విని రాజీకి వస్తే సరేసరి లేకపోతే ఇబ్బందులు పడతావంటూ బెదిరింపులకు దిగాడన్నాడు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కావలిలో తన ఇంటిపై దాడి చేసి కొట్టారాని వాపోయాడు. కేసులో రాజీ పడాలని, లేకుంటే నిన్ను, నీ భార్యను చంపుతామని బెదిరించి వెళ్లారని ఆరోపించాడు. వెంటనే బాలిక తండ్రి కావలి వన్‌టౌన్ సీఐకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పామన్నాడు. వెంటనే ఎస్సై వచ్చి జరిగిన విషయం అడిగి తెలుసుకుని, చుట్టుపక్కల విచారించి వెళ్లారని తెలిపాడు.
బాలిక తల్లి ఆత్మహత్యా యత్నం..
ఈ ఘటనలతో బాలిక తల్లి భయాందోళనకు గురైంది. ఈ నెల 2వ తేదీ ఎలుకల మందు తిని ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను కావలి ఆస్పత్రికి తరలించి వైద్యం చేశారు. మెరుగైన చికిత్స కోసం శుక్రవారం ఒంగోలులోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆమెను ఎమర్జన్సీ వార్డులో ఉంచి కృతిమ శ్వాస అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉందని, లివర్ చెడిపోయిందని, ప్లేట్‌లెట్స్ కూడా తగ్గిపోతున్నాయని, రక్తపోటు తరచుగా పడిపోతుందని వైద్యులు తెలిపారు.
ఒకవైపున నిండా పద్నాలుగేళ్ల వయసు కూడా లేని కుమార్తె నిండు గర్భంతో ఉంది. చిన్న వయసు కావడంతో కాన్పు ప్రమాదం కావచ్చని, సిజేరియన్ చేసినా ప్రాణాలకు ముప్పు రావచ్చని వైద్యులు చెబుతున్నారని, మరోవైపు ఆత్మహత్యా యత్నం చేసిన భార్య చావు బతుకుల మధ్య పోరాడుతోందని బాలిక తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి అండ చూసుకునే కోటేశ్వరరావు రెచ్చి పోతున్నాడని ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment