కోడిగుడ్డు ధర ఆశాజనకంగా ఉన్నప్పటికీ పౌల్ట్రీ రైతులు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. పెరిగిన మేత ఖర్చులు, వేసవిలో కోళ్ల సంరక్షణకు అధికంగా ఖర్చు పెట్టాల్సి రావడం వారికి భారంగా మారింది. దీనికి తోడు గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడం వారిని మరింత కుంగదీస్తోంది. గతంలో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు 100కు పైగా లారీల్లో గుడ్లు ఎగుమతి కాగా, ప్రస్తుతం 60కి పడిపోయింది.
ఇరగవరం: పశ్చిమ గోదావరి జిల్లాలో రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుండగా, ఇతర రాష్ట్రాలకు 80 లక్షల మేర ఎగుమతి చేస్తున్నారు. స్థానికంగా 20 నుంచి 30 లక్షల వరకు వినియోగిస్తున్నారు. జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా సుమారు పదివేల మంది ఉపాధి పొందుతున్నారు. అన్ స్కిల్డ్ లేబర్‌ను తీసుకుని వారికి పూర్తి స్థాయిలో ఉపాధి కల్పిస్తోంది. లేయర్ కోడిపిల్లను ప్రస్తుతం పౌల్ట్రీ రైతులు రూ.41లకు కొనుగోలు చేస్తున్నారు. 23 వారాలకు గుడ్లు పెట్టే దశకు చేరుకునేసరికి మొత్తం రూ.250 ఖర్చు అవుతుంది.
ఈ దశ నుంచి ఒక కోడి సరాసరి రోజుకొకటి చొప్పున ఏడాదికి 320 గుడ్లు పెడుతుంది. గుడ్లను పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలకు గతంలో 100 నుంచి 120 లారీల్లో ఎగుమతి చేయగా, ప్రస్తుతం రోజుకు 60 నుంచి 70 లారీలు మాత్రమే ఎగుమతి అవుతుండటం గమనార్హం.
కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం లేదు
జిల్లాలో ఉత్పత్తి అయిన గుడ్డును స్థానికంగా నిల్వ చేసే అవకాశం లేదు. గుడ్డు నిల్వ చేసి ఎగుమతి చేసే అవకాశం ఉంటే పౌల్ట్రీ రైతులకు వరమేనని చెప్పవచ్చు. అయితే కోల్డ్ స్టోరేజ్‌లలో నిల్వ చేయడం కష్టసాధ్యం. దీనిలో నిల్వ చేసిన గుడ్డును వెంటనే వినియోగించుకోవాలి. లేదంటే పాడైపోతుంది. దీంతో ఉత్పత్తికే పరిమితమయ్యారు. అయితే సేల్ పాయింట్‌ల వద్ద కోల్డ్ స్టోరేజ్‌లు పెట్టుకుని వేరే రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాలలో ఎక్కువ లాభాలు అర్జిస్తుండగా, పౌల్ట్రీ రైతులకు నిరాశే మిగులుతోంది.
పెరిగిన మేత రేట్లు
గతంతో పోలిస్తే మేత ధరలు భారీగా పెరిగాయి. గత ఏడాది ఇదే రోజుల్లో సోయ కేజి రూ.36 ఉండగా, ప్రస్తుతం రూ.58కి చేరింది. అలాగే ఎండు చేప, స్టోన్, నూకలు ఇలా ప్రతీది ధరలు పెరిగాయి. ఇందుకు అనుగుణంగా గుడ్డు ధర పెరిగినప్పటికీ పౌల్ట్రీ రైతులకు లాభాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. గతంలో ఒడిశా నుంచి కుటుంబాలతో సహా వచ్చి కోళ్లఫారాలలో మకాం ఉండి పనిచేసేవారు ఉండగా, ప్రస్తుతం కరోనా ప్రభావంతో కొత్తవారు పనిచేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఉన్నవారు వెళ్లిపోతుండటంతో ఈ పరిశ్రమ లేబర్ సమస్యను ఎదుర్కొంటోంది.
వేసవిలో జాగ్రత్తలతో అదనపు ఖర్చు
సాధారణ రోజుల్లో వేసవిలో పౌల్ట్రీ పరిశ్రమ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోక తప్పదు. కోళ్ల షెడ్లపైన స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తడుపుతూ ఉండాలి. దీనికి తోడు గోనుపట్టాలు, ఎండు గడ్డి, దబ్బగడ్డి వేసి కోళ్లకు రక్షణ కల్పించాలి. చల్లటి నీరు కోళ్లకు పెడుతుండాలి. ఇలా చేయడం వల్ల గతంలో కంటే కోడికి రూ.15 నుంచి 20 వరకు అదనంగా ఖర్చు అవుతోంది. అయినప్పటికీ సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే 10 నుంచి 20 శాతం కోళ్లు చనిపోయే ప్రమాదం ఉంది.
విద్యుత్‌పై రాయితీ ఇవ్వాలి
గతంలో బ్యాంకు రుణాలపై వడ్డీ రాయితీ ఇచ్చేవారు. ఇప్పుడు అది లేదు. లేబర్ సమస్యల వల్ల యంత్రాలను ఎక్కువ వినియోగిస్తుండటంతో విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయి. ఆక్వా పరిశ్రమకు ఇచ్చినట్లే పౌల్ట్రీ పరిశ్రమకు కూడా విద్యుత్ రాయితీ ఇవ్వాలి. పౌల్ట్రీ నిర్వహణలో గతంలో కంటే సమస్యలు పెరిగాయి. కోళ్లలో వైరస్‌ల నివారణకు ఒక్కో కోడికి రూ.15 నుంచి రూ.20 వరకు ఖర్చవుతోంది.
– పెన్మెత్స సుబ్బరాజు, పౌల్ట్రీ రైతు, డీసీఎమ్‌ఎస్‌డైరెక్టర్, కావలిపురం
మేత ధరలు తగ్గించాలి
వేసవిలో కోళ్లు మృత్యువాత పడుతుంటాయి. ఎండ తీవ్రతను బట్టి సుమారు 8 లక్షల వరకు మృత్యువాత పడుతుంటాయి. కోళ్లను సంరక్షించడానికి అదనంగా ఖర్చు అవుతుంది. వీటితో పాటు కోళ్లు మేతకు వాడే ముడి సరుకు ధరలు విపరీతంగా పెరిగాయి. ముడి సరుకులపై ప్రభుత్వం రాయితీ కల్పిస్తే రైతులకు మేలు జరుగుతుంది.
– జి.గంగాధరరావు, నెక్ గోదావరి జోనల్ కమిటీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment