మదనపల్లె మార్కెట్‌కు రైతులు తీసుకువచ్చిన టమాటా
మదనపల్లె: నిన్న మొన్నటిదాకా రూ.6 నుంచి రూ.16 వరకు పలికిన టమాటా ధరలు ఒక్కసారిగా రూ.22కు చేరుకున్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె టమాటా మార్కెట్లో శుక్రవారం మొదటిరకం టమాటా కిలో రూ.15 నుంచి రూ.22 మధ్య ధర పలికింది. రెండోరకం టమాటా రూ.8 నుంచి రూ.14.60 వరకు నమోదైంది. అయితే నిన్నటివరకు మార్కెట్‌కు 1,120 నుంచి 1,646 మెట్రిక్ టన్నుల వరకు వచ్చిన టమాటా ఒక్కసారిగా 470 మెట్రిక్ టన్నులకు పడిపోయింది. రెండురోజులుగా మదనపల్లె డివిజన్‌లో వర్షాలు కురుస్తుండటం, పొలాల్లో నీళ్లు నిలవడం కాయలు కోసేందుకు ఇబ్బందిగా మారింది.
పంట బాగా దెబ్బతినడం, కొద్దోగొప్పో వస్తున్న పంట నాణ్యత ఆశించిన స్థాయిలో లేకపోవడం, కాయపై మచ్చలు, పగుళ్లు రావడంతో మార్కెట్‌కు వచ్చే టమాటా ఒక్కసారిగా తగ్గిపోయింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు పలికిన టమాటా ధరల్లో రూ.22 అత్యధికం కావడం, తక్కువస్థాయిలో దిగుబడులు రావడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం టమాటాకు లభిస్తున్న ధరతో రైతు సంతృప్తిగా ఉన్నప్పటికీ దిగుబడులు తగ్గుతుండటంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment