కోనసీమలో ఒక కొబ్బరి చెట్టునో, ఒక గేదెనో.. ఒక ఎకరం భూమినో నమ్ముకుని ఆదాయం పొందుతూ ఏదోలా బతికేద్దామని అనుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. కానీ తాను అలా అనుకోలేదంటున్నారు పెన్మెత్స రామ సత్యనారాయణరాజు అలియాస్ ఈస్ట్ గోదావరి రామరాజు. నేడు భూములు, పశువులు, కొబ్బరి చెట్ల వల్ల ఆదాయం అంతగా లభించక కొంతమంది ఉన్నత చదువులతో ఉన్నత రంగాలకు వెళ్లిపోతున్నారు. కానీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం బట్టేలంక గ్రామానికి చెందిన ఈ యువకుడు కేవలం ఒక కోడిపుంజును నమ్ముకున్నాడు, తద్వారా దండిగా ఆదాయం సంపాదిస్తున్నాడు. – మలికిపురం
ఈస్ట్ గోదావరి రామరాజు (32) బీటెక్ పూర్తి చేశారు. తండ్రి వేంకటేశ్వరరాజు రెండేళ్ల క్రితం కరోనాతో మృతి చెందడంతో అప్పటి నుంచి కుటుంబం కోసం ఉద్యోగం ఆలోచన విరమించుకుని రామరాజు బట్టేలంకలోనే ఉంటున్నారు. ఈయనకు ఇదే మండలం ఇరుసుమండ గ్రామంలో 15 ఎకరాల కొబ్బరి తోట ఉంది. అదీ ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి పంచుకోగా వచ్చింది. దీని ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. దీంతో కోనసీమలో పలువురు చేస్తోన్న మాదిరిగానే రామరాజు దేశవాళీ కోడిపుంజులు పెంచుతూ సంక్రాంతి సమయంలో అమ్ముతు ఉంటారు. ఇందులోనూ అంతంత మాత్రంగానే ఆదాయం వస్తుండటంతో ఆయన సరికొత్త ఆలోచన చేశారు.
పుంజుకూ వీసా..!
అమెరికాలో పరిచయమున్న వారి ద్వారా రామరాజు ‘పెరూ’ జాతి కోడిపుంజును అక్కడి ధర రూ.1.40 లక్షలకు 2020 జూన్‌లో కొనుగోలు చేశారు. పెరూ నుంచి దిగుమతి చేసుకున్న కోడి పుంజులకు ప్రత్యేకంగా వీసా ఖర్చులతో పాటు విమానంలో ప్రయాణానికి అదనంగా టికెట్‌ను కొనుగోలు చేసి ఆ కోడిపుంజును అమెరికా నుంచి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా తయారైన కారులో ఇరుసుమండలోని రామరాజు కొబ్బరి తోటలోకి పుంజు చేరింది. ఈ పుంజును అన్నీ కలుపుకొని ఇక్కడకు తీసుకురావడానికి రామరాజుకు రూ.2.85 లక్షలు ఖర్చయ్యింది.
అప్పటి నుంచీ ఈ పెరూ జాతి కోడిపుంజును రాజభోగాలతో రామరాజు మేపుతున్నారు. మేలు రకాలయిన దేశవాళీ పెట్టల క్రాసింగ్ ద్వారా దీని సంతానం విపరీతంగా పెరిగింది. ఈ జాతి పుంజులు పందాల్లో విశేష ప్రతిభ చూపడంతో దీని బ్రీడ్‌కు డిమాండ్ పెరిగింది. రామరాజు కోడిపుంజులను పెంచడం లేదు. వీటి పిల్లలను 3 నెలల వయసు వచ్చే వరకు మాత్రమే పెంచి అనంతరం ఒక్కో పిల్లను రూ.10,000కు పైగా విక్రయిస్తున్నారు. ఇలా ఈ రెండేళ్లలో ఇప్పటివరకు రూ.41.60 లక్షల ఆదాయం వచ్చినట్లు రామరాజు చెప్పారు. దీనిలో నెలకు రూ.25 వేల చొప్పున ఖర్చవుతుందని, రూ.35.60 లక్షలు మిగిలిందని వెల్లడించారు.
దండిగా ఆదాయం
ప్రస్తుతం కొబ్బరి ఆదాయం తోటల నిర్వహణకే సరిపోతోంది. దీంతో ఇలా ప్రయోగం చేసి ఈ కోడిపుంజును దింపాను. రెండేళ్లలో రూ.41.60 లక్షల షేర్ వచ్చింది. నిర్వహణ ఖర్చు నెలకు రూ.25 వేలకు పైగా ఉంటుంది. ఏడాదికి రూ.10 లక్షలు పైగా మిగులుతుంది. – పెన్మెత్స రామ సత్యనారాయణ రాజు, బట్టేలంక
Comments
Please login to add a commentAdd a comment