AP: రైతు బాగు నచ్చని బాబు బ్యాచ్‌.. | FactCheck: Ramoji Rao False News On Agricultural Mechanization In AP, Facts Inside - Sakshi
Sakshi News home page

Fact Check: రైతు బాగు నచ్చని బాబు బ్యాచ్‌

Published Thu, Dec 28 2023 5:28 AM | Last Updated on Thu, Dec 28 2023 3:00 PM

Ramoji Rao false news on Agricultural Mechanization - Sakshi

ఏదైనా వాహనం నడపాలంటే ఆ యజమానికి తగిన శిక్షణ అవసరం. కనీస శిక్షణ, నిర్వహణపై అవగాహన లేకుండా వాహనం కొన్నా, మూలన పెట్టడం తప్ప చేసేది ఏమీ ఉండదు. ఇంత చిన్న విషయం కూడా తెలియకుండా ఈనాడు రామోజీరావు కథనాలు అచ్చేసి ప్రజల మీదకు వదిలేస్తున్నారు.  వాస్తవాలు తెలుసుకోకుండా డ్రోన్స్‌ ఎగురుతోందెక్కడ? అంటూ రైతులను తప్పుదోవ పట్టించేలా ఓ కథనాన్ని ప్రచురించారు. సర్టిఫైడ్‌ డ్రోన్‌ పైలెట్‌ లేకుండా డ్రోన్‌ యూనిట్లు ఏర్పాటు చేయడం కుదరదన్న విషయం అందరికీ తెలిసిందే.ఇందుకోసం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కిసాన్‌ డ్రోన్స్‌ కోసం ఎంపిక చేసిన రైతులకు, నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తోంది.

మరో వైపు అధిక సామర్థ్యంతో కూడిన డ్రోన్స్‌  రైతులకు అందుబాటులోకి తీసుకు రావాలన్న సంకల్పంతో  ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే తొలుత పైలెట్‌ శిక్షణ పూర్తి చేయడం, తర్వాత డ్రోన్‌ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు, మరీ ముఖ్యంగా ఎక్కువ సామర్థ్యం కలిగిన డ్రోన్స్‌ను రైతులకు అందించాలన్న సంకల్పంతో పటిష్ట ప్రణాళిక అమలుచేస్తోంది. రాష్ట్రంలో రైతు బాగుపడితే చూడలేని చంద్రబాబు, రామోజీ బ్యాచ్‌కి ప్రభుత్వ చర్యలు కంటగింపుగానే  ఉంటాయి. అందుకే రామోజీ కుటిల రాతలు. అసలు ఈ కథనంలో వాస్తవం ఎంత.. ఈ నాలుగున్నరేళ్లలో ఈ ప్రభుత్వం యాంత్రీకరణకు ఏ స్థాయిలో పెద్ద పీట వేసిందో ఒక్కసారి పరిశీలిద్దాం..

సీఎం జగన్‌ పాలనలో ఎంపిక, కొనుగోలు, నిర్వహణ అంతా పారదర్శకమే
ఆధునిక యంత్ర పరికరాలను తక్కువ అద్దెకు సన్న, చిన్నకారు రైతుల ముంగిట తీసుకు రావడం ద్వారా సాగు వ్యయం తగ్గించి వారికి నికర ఆదాయం పెంచాలన్న సంకల్పంతో సీఎం జగన్‌ ప్రభుత్వం గ్రామ స్థాయిలో వైఎస్సార్‌ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతులు సంఘటితంగా ఏర్పాటు చేసుకున్న గ్రూపులకే యంత్ర పరికరాలను అందించింది. ఇందులో దళారులెవరూ ఉండరు. 2021–22లో శ్రీకారం చుట్టిన వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం ద్వారా విత్తు నుంచి కోత వరకు గ్రామ స్థాయిలో ప్రతి రైతుకు ఉపయోగపడేలా అత్యాధునిక యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది.

ఆర్బీకే, క్లస్టర్‌ స్థాయిలో ఏర్పాటు చేసిన రైతు సంఘాల (సీహెచ్‌సీ)కు 40 శాతం సబ్సిడీతో ఈ యంత్రాలని సమకూర్చింది. ఆర్బీకే స్థాయిలో రూ.15 లక్షల విలువైనవి, క్లస్టర్‌ స్థాయిలో రూ.25 లక్షల విలువైన కంబైన్డ్‌ హార్వెస్టర్స్‌తో కూడిన పరికరాలను ఇచ్చింది. వీటి వ్యయంలో 40 శాతం సబ్సిడీ ఇవ్వగా, 10 శాతం సంబంధిత రైతు సంఘాలు సమకూర్చుకుంటే మిగిలిన 50 శాతం బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కూడా ప్రభుత్వమే కల్పించింది.  ఇప్పటివరకు రూ.1052.42 కోట్ల అంచనాతో 10,444 ఆర్బీకే, 492 క్లస్టర్‌ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది.

వీటిలో 6,362 ట్రాక్టర్లు, 492 కంబైన్డ్‌ హార్వెస్టర్లతో పాటు 31,356 ఇతర యంత్రాలను సమకూర్చింది. సబ్సిడీ మొత్తం రూ.366.25 కోట్లను నేరుగా సీహెచ్‌సీ రైతు సంఘాల ఖాతాల్లో జమ చేసింది. వీటి ఎంపిక, కొనుగోలు, నిర్వహణ బాధ్యతలను రైతు సంఘాలకే అప్పగించింది. ఇందులో ప్రభుత్వం లేదా ఇతర వ్యక్తుల ప్రమేయం ఉండదు. అత్యంత పారదర్శకంగా జరుగుతుంది. ఎక్కడా పైసా అవినీతి ఉండదు. పైగా, మార్కెట్‌ అద్దె కంటే తక్కువ అద్దెకు వారి ప్రాంతంలో డిమాండ్‌ ఉన్న పరికరాలను సంఘాలే ఎంపిక చేసుకొంటాయి. అంతేకాదు.. నచ్చిన కంపెనీల నుంచి, నచ్చిన పరికరాలను కొనుక్కొనే స్వేచ్ఛనిచ్చింది. దీంతో రైతులు వారికి అవసరమైన యంత్రాలను నాణ్యత, మన్నికను పరిశీలించి మరీ కొనుక్కున్నారు. ప్రైవేటుగా యంత్ర పరికరాలకు వసూలు చేస్తున్న అద్దె కంటే తక్కువ అద్దెకు రైతులకు అందుబాటులో ఉంచారు.

గ్రామంలోనే కాదు మండల స్థాయిలో ఎక్కడి నుంచైనా రైతుకు అవసరమైన యంత్రాలను బుక్‌ చేసుకున్న 15 రోజుల్లో పొందేందుకు వీలుగా వైఎస్సార్‌ యంత్ర సేవా యాప్‌ని తీసుకొచ్చారు. ఈ యాప్‌ ద్వారా రైతు సంఘాల రుణాల చెల్లింపులను కూడా పర్యవేక్షిస్తున్నారు. 2021 జనవరి నుండి ఇప్పటి వరకు 26 జిల్లాల్లో 5.15 లక్షల మంది రైతులు ఈ కేంద్రాల ద్వారా యంత్ర సేవలు పొందారు. వీరు 14.68 లక్షల ఎకరాల్లో యంత్రాలను వినియోగించారు. అద్దె రూపంలో సీహెచ్‌సీలు ఇప్పటి వరకు రూ.87.64 కోట్లు ఆర్జించాయంటే ఏ స్థాయిలో పారదర్శకంగా ఈ కార్యక్రమం అమలవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

చిత్తశుద్ధితో కిసాన్‌ డ్రోన్స్‌ ఏర్పాటుకు కసరత్తు 
రైతుల పెట్టుబడులను మరింతగా తగ్గించడమే లక్ష్యంగా ఆర్చీకే స్థాయిలో వ్యవసాయ డ్రోన్లను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం సంకల్పించింది. తొలి విడతగా 2023–24లో 2వేల గ్రామాల్లో 40 శాతం రాయితీతో డ్రోన్లు ఏర్పాటు చేస్తోంది. వాణిజ్య పంటలు, ఒకే పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే మండలాలను జిల్లాకు 3 చొప్పున ఎంపిక చేసింది. ఈ మండలాల్లో కనీసం 3 గ్రామాల్లో డ్రోన్స్‌తో కూడిన యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఐదారుగురు రైతులతో సంఘాలు (సీహెచ్‌సీ) కూడా ఏర్పాటు చేసింది. తొలుత ఈ సంఘాల్లోని ఎంపిక చేసిన రైతులను డ్రోన్‌ పైలెట్లుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది.

వీరితోపాటు గ్రామ స్థాయిలో డ్రోన్‌ పైలెట్‌గా ఉత్సాహవంతులైన నిరుద్యోగ యువతకు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, తాడేపల్లిలోని డ్రోగో డ్రోన్‌ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా బ్యాచ్‌ల వారీగా శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి 369 మంది రైతులకు, 160 మంది యువతకు మొత్తం 529 మందికి శిక్షణ ఇచ్చారు. మరోపక్క డ్రోన్ల ఎంపికకు కసరత్తు చేపట్టారు. పౌర విమానయాన శాఖ ధ్రువీకరణ పొందిన వివిధ కంపెనీల డ్రోన్‌ల పనితీరును వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా పరీక్షించి రైతులకు ఉపయోగపడే వాటి ఎంపిక జరుగుతోంది.

అధిక సామర్థ్యం కల్గిన డ్రోన్ల కోసమే..
కనీసం 10 లీటర్ల ట్యాంక్‌తో కూడిన డ్రోన్లు 10 నుంచి 22 నిముషాలు మాత్ర­మే ఎగురగలవని గుర్తించారు. వీటి కంటే మెరుగైన డ్రోన్స్‌ను రైతులకు అందించే సంకల్పంతో ఎక్కువ సమయం ఎగిరే డ్రోన్లను గుర్తించి అదే యూనిట్‌ ధరకు సరఫరా చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇలా రైతులకు పూర్తి స్థాయిలో సమర్ధవంతంగా సేవలందించే డ్రోన్లను తయారు చేసేందుకు వ్యవసాయ వర్శిటీకి చెందిన అప్సరా డ్రోన్‌ టెక్నాలజీ సెంటర్‌ ద్వారా పైలెట్‌ పరిశోధనలు జరుగుతున్నాయి. ఇలా డ్రోన్స్‌ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే, వాస్తవాలను తెలుసుకోకుండా పనిగట్టుకొని రైతులను రెచ్చగొట్టేలా కుట్రపూరిత కథనాలు అచ్చేయడం ఈనాడుకే చెల్లింది.

బాబు హయాంలో రైతు రథాల పేరిట అంతా దోపిడీయే 
చంద్రబాబు సీఎంగా ఉండగా రైతు రథాల పేరిట వ్యవసాయ యాంత్రీకరణ ఓ ఫార్సుగా నడిచింది. ఈ పథకం కొంతమందికే పరిమితమయ్యేది. అందులోనూ అనేక అవకతవకలు, అవినీతే. 2014–2019 మధ్య కేవలం 3,584 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసింది. వీటిలో రైతులు తక్కువ, దళారులెక్కువ. వీటి ద్వారా రూ.239.16 కోట్ల సబ్సిడీతో కూడిన ట్రాక్టర్లు పంపిణీ చేశారు. రుణ సహాయానికి రైతే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది.

ఏ కంపెనీ యంత్రం లేదా పరికరం ఏ డీలర్‌ వద్ద ఎంత రేటుకు కొనాలో కూడా టీడీపీ నేతలే నిర్ణయించేవారు. సబ్సిడీ మొత్తాన్ని నేరుగా డీలర్లకే జమ చేసేవారు. టీడీపీ నేతలు, డీలర్లు కుమ్మక్కై మార్కెట్‌ రేటు కంటే 30 శాతం ఎక్కువకు అమ్మి, ఆ సొమ్మును జేబుల్లో వేసుకున్నారు. రైతు రథాల పేరిట రూ.100 కోట్లకుపైగా సబ్సిడీ సొమ్మును టీడీపీ నేతలు స్వాహా చేశారు. పైగా, రైతులకు నాసిరకం యంత్రాలు ఇచ్చారు. అవి నాలుగు రోజులకే మరమ్మతులకు గురైతే, రైతులే బాగు చేయించుకోవాల్సి వచ్చేది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement