
సాక్షి, అమరావతి: పేద విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్యను అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో చదువుకు పేదరికం అడ్డు పడకుండా ఆయన అనేక చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు సమాజంలో అత్యంత గౌరవం ఉందన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దగలిగేది ఉపాధ్యాయులేనని కొనియాడారు. మంచి వ్యక్తిత్వం, అలవాట్లు, బాధ్యతాయుత జీవనవిధానం గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గనిర్దేశనం చేయగలిగితే మంచి సమాజాన్ని నిర్మించవచ్చన్నారు. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం వైఎస్సార్‌సీపీ ‘సమాజంలో గురువుల పాత్ర–ప్రభుత్వ నూతన విద్యా విధానం’ అనే అంశంపై వెబినార్ నిర్వహించింది. ఇందులో ప్రభుత్వ సలహాదారు సజ్జల మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల నుంచి ఉన్నత విద్య వరకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నారని గుర్తు చేశారు. రూ.16 వేల కోట్ల వ్యయంతో ‘నాడు–నేడు’ ద్వారా పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చుతున్నారన్నారు. జాతీయ విద్యావిధానంలో భాగంగా అందులో ఉన్న అన్ని అంశాలను అమలు చేస్తామన్నారు. గత పాలకులు విద్య, వైద్యరంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. దీంతో విద్య, వైద్యాన్ని కొనలేక అనేక కుటుంబాలు ఆర్థికంగా ఛిన్నాభిన్నమయ్యాయని చెప్పారు. దీన్ని మార్చాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పనిచేస్తున్నారన్నారు.
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, స్పృహ కల్పించేది ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. విద్యార్ధిని గ్లోబల్ స్టూడెంట్‌గా తీర్చిదిద్దాలన్నదే నూతన విద్యావిధానం లక్ష్యమన్నారు. గ్రామీణ, పేద విద్యార్థులకు మేలు చేయడానికే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టామన్నారు. కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ రామలింగేశ్వరస్వామి మాట్లాడుతూ గురుశిష్యుల బంధం చాలా గొప్పదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment