తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సజ్జల, తదితరులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీలోనే దళిత డీఎన్‌ఏ ఉందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. అంబేద్కర్, జగ్జీవన్ రామ్‌లు ఒకరు ఆలోచన, మరొకరు ఆచరణ అని తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఒకప్పుడు అసమానతలకు పుట్టినిల్లుగా ఉన్న భారతదేశం నేడు సమానత్వం, అభివృద్ధి దిశగా వెళ్తోందంటే అంబేద్కర్, జగ్జీవన్ రామ్‌లే కారణమని అన్నారు.
జగ్జీవన్ రామ్ ఆశయాలు ఆంధ్రప్రదేశ్‌లో సంపూర్ణంగా నెరవేరతాయని వివరించారు. అణగారినవర్గాలు రాజకీయ సాధికారత సాధించే దిశగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతోందని తెలిపారు. ఈ వర్గాలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాల్సిన ఆవశ్యకతను గుర్తించింది వైఎస్సార్‌సీపీయే అని చెప్పారు. మంత్రివర్గ కూర్పు నుంచి అన్నింటిలోనూ సీఎం జగన్ ఈ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. గతంలో పాలించిన పార్టీలు దళిత వర్గాల అభివృద్ధి గురించి మాటలు మాత్రమే చెప్పాయని, వారి అభ్యున్నతికి చేసిందేమీ లేదని తెలిపారు.
దళితుల మధ్య విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలనే ప్రతిపక్ష పార్టీల కుట్రలను తిప్పికొట్టాలన్నారు. దళితుల అభ్యున్నతికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, లేళ్ల అప్పిరెడ్డి, అరుణ్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (సోషల్ జస్టిస్) జూపూడి ప్రభాకరరావు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment