ఊరి దారులు రహస్యంగా దాచుకున్న కథలు కోకొల్లలు. నల్లటి తారు కప్పుకున్న రోడ్లు, తెల్లటి సిమెంటు రంగేసుకున్న బాటలు.. నిజానికి రహదారులు మాత్రమే కావు.. వేల జ్ఞాపకాలకు ద్వారాలు. పల్లెల్లో మట్టి రోడ్ల రోజులు గతించిపోతూ కొన్ని అలవాట్లను తమతో ఉంచేసుకున్నాయి. అలా నిన్నటి కాలం తనతో ఉంచేసుకున్న కథ ‘పాతర’. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఆరు కాలాల పాటు నిల్వ ఉంచడానికి భూమి కడుపును ఆశ్రయించిన అన్నదాతల తెలివికి ప్రతీక ఇది. ధాన్యలక్ష్మి బాధ్యతను భూదేవికే అప్పగించారు. ఇచ్ఛాపురంలోని సరిహద్దు గ్రామాల్లో అక్కడక్కడా ఈ పాతర్లు ఇంకా దర్శనమిస్తున్నాయి. ధాన్యం నిల్వ ఉంచడానికి ఈరోజు అనేక పద్ధతులు ఉండవచ్చు. కానీ సాంకేతికత అనేదే లేని రోజుల్లో నెలల తరబడి ధాన్యం నిల్వ చేయడానికి మన పూర్వీకులు కనిపెట్టిన ఈ విధానం వారి విజ్ఞానానికి ఓ నిదర్శనం.
ఇచ్ఛాపురం రూరల్(శ్రీకాకుళం జిల్లా): పల్లె ఒడిలో పెరిగి పెద్దయిన వారికి.. గ్రామాల్లో బాల్యం గడిపిన వారికి పాతర్లు పరిచయమే. కానీ పట్టణీకరణ పెరిగి మట్టికి దూరమైపోతున్న ఈ తరానికి మాత్రం పాతర గురించి కచ్చితంగా తెలియాలి. పాతర వేయడం అంటే భూమిలో గొయ్యి తీసి దాచిపెట్టడం. ఒకప్పుడు ధాన్యం నిల్వ ఉంచడానికి ఎలాంటి సాధనం లేని రోజుల్లో భూమిలో ధాన్యం ఉంచే పద్ధతిని మన పూర్వీకులు అనుసరించారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని ఆంధ్రా–ఒడిశా సరిహద్దు పల్లెల్లో ఇప్పటికీ ఇవి కనిపిస్తున్నాయి.
అంత సులభం కాదు..
∙ఈ ధాన్యాన్ని పాతర వేయడం అంటే అనుకున్నంత సులువేం కాదు.
∙పాతర వేయడానికి రైతుల ఇళ్ల ముందు వీధిలో ఉండే ఖాళీ స్థలాన్ని ఎంచుకొని వృత్తాకారంలో, దీర్ఘ చతురస్త్రాకారంలో నిల్వ చేయాల్సిన ధాన్యం రాశి పరిమాణానికి తగినట్లుగా గోతిని తవ్వుతారు.
∙గోతిని కనీసం ఆరు అడుగుల లోతులో తవ్వడం పూర్తయ్యాక, వరి నూర్పులు సమయంలో వచ్చిన ఎండు గడ్డిని జడలా అల్లుతూ ‘బెంటు’ను తయారు చేస్తారు.
∙దాన్ని గోతిలో పేర్చి, అడుగు భాగంలో కొంటి గడ్డిని పొరలు పొరలుగా అమర్చుతారు.
∙భారీ వర్షాలు కురిసినా నీరు గోతిలో చేరకుండా చాకచక్యంగా పై వరకు అమర్చుతారు.
∙అందులో టార్పాలిన్లు గానీ, వలను గానీ వేసి ధాన్యంను వేస్తారు.
∙అనంతరం ధాన్యంపై ఎండు గడ్డిని వేసి, దానిపై మట్టితో కప్పి ఆవు పేడతో శుభ్రంగా అలుకుతారు.
రక్షణ కోసం..
ఒక్కసారి పాతర వేశాక.. ధాన్యం పోతుందన్న దిగులు రైతులకు ఇక ఉండదు. వానలు, దొంగలు, అగ్ని ప్రమాదాలు ఇలా ఏ వైపరీత్యం వచ్చినా పాతరే పంటను కాపాడుకుంటుంది. చాలా ఇళ్లలో ఈ పాతర్లకు ప్రతి గురువారం ప్రత్యేక పూజలు కూడా చేసేవారు. ఎప్పటికప్పుడు శుభ్రంగా పేడతో అలికి ముగ్గులు పెట్టి మురిపెంగా చూసుకునేవారు. బియ్యం కావాల్సిన సమయంలో తీసి మిల్లు చేసుకోవడమో దంచుకోవడమో చేసుకునేవారు. పాతర ధాన్యం తిన్న పిల్లలు పుష్టిగా ఉంటారని గ్రామీణ ప్రాంతాల్లో నానుడి ఉంది. పూర్వం గ్రామాల్లో ఉండే భూస్వాములు రెక్కలు ముక్కలు చేసుకొని పంటలు పండించేవారు. పంట దిగుబడి తనకే అధికంగా వచ్చిందనడానికి ప్రతీకగా తమ ఇళ్లముందు పాతర్ల రూపంలో తోటి రైతులకు తెలియజెప్పేందుకు వేసేవారని చెబుతారు.
పుష్కలంగా పోషకాలు..
పాతర్లలో నిల్వ చేసిన ధాన్యంలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. ధాన్యం పరిమాణంలో కూడా తేడా వస్తుంది. పాతర్లలో నెలల తరబడి ఉండటంతో ధాన్యం భూగర్భంలో బాగా ముక్కుతాయి. ఇలాం ధాన్యం మిల్లులో వేసి బియ్యం చేయడం కన్నా, ఎండలో వేసి రోట్లో వేసి దంచిన తర్వాత వచ్చిన బియ్యాన్ని ఉపయోగిస్తే మరింత రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. బియ్యంతో తయారైన ఆహారం తినడం వల్ల రక్తహీనత సమస్యలు దరికి చేరవు. ఇచ్ఛాపురం మండలంలో చాలా గ్రామాల్లో పాతర్ల పద్ధతిని కొనసాగిస్తుండటం గమనార్హం.
– పిరియా శ్రీదేవి, వ్యవసాయాధికారి, ఇచ్ఛాపురం మండలం
గ్రామంలో సిమ్మెంట్ రోడ్లు వచ్చినా.. తరతరాలుగా వస్తున్న పాతర సంప్రదాయాన్ని ఇప్పటికీ మేము కొనసాగిస్తూనే వస్తున్నాం. రైతుల ఇళ్ల ముందు వేసిన పాతర ఎంత ఎత్తులో ఉంటే యజమాని ఎన్ని ఎకరాల భూస్వామిగా అప్పట్లో నిర్ధారించేవారు. అప్పట్లో రైతుకు మానసికంగా ఎన్ని కష్టాలు వచ్చి నా, ఈ ధాన్యం పాతర చేసి కష్టాలను మరచిపోయేవారు. దొంగల భయం నుంచి, అగ్ని భయం నుంచి సురక్షితంగా ధాన్యం సంరక్షించుకునేందుకు చక్కని అవకాశం ఈ పాతర్లు.
– కొణతాల కనకయ్య, రైతు, తేలుకుంచి, ఇచ్ఛాపురం మండలం
Comments
Please login to add a commentAdd a comment