రైతుల అభ్యర్థనతో అటవీ వేలం పాటల నిలుపుదల
సుబాబుల్ టన్ను రూ.4,500 నుంచి రూ.4,800
యూకలిప్టస్ టన్ను రూ.5 వేల నుంచి రూ.5,500
రైతుకు మరింత ధర లభించేలా ప్రభుత్వ చర్యలు
సాక్షి, అమరావతి: జామాయిల్ (యూకలిప్టస్), సరుగుడు, ఇతర కాగితపు గుజ్జు కలప సాగుదారులకు మరింత మేలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అటవీ శాఖ పరిధిలోని యూకలిప్టస్, సరుగుడు తోటల వేలం పాటలను ప్రభుత్వం నిలిపివేసింది. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ప్రస్తుతం పలుకుతున్న ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయంపై హర్షాతిరేకాలు
సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చర్చించారు. రైతుల ప్రయోజనార్థం వేలం వాయిదా వేయాలని కోరగా.. అటవీ శాఖకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తక్షణమే వేలాన్ని నిలిపివేస్తూ మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
తమ అభ్యర్థనకు మంత్రులు కాకాణి, పెద్దిరెడ్డి స్పందించిన తీరు పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ప్రస్తుతం పలుకుతున్న ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని, ఏప్రిల్, మే నెలల్లో సుబాబుల్ టన్ను ధర రూ.5 వేలు, యూకలిప్టస్ ధర రూ.6 వేలకు పైగా పలికే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
టన్నుకు వెయ్యి మిగలడం కష్టంగా ఉండేది
రాష్ట్రంలో 1,04,985 మంది రైతులు 3,28,954 ఎకరాల్లో సుబాబుల్, యూకలిప్టస్, సరుగుడు పంటలు సాగు చేస్తున్నారు. ఏటా రూ.35 లక్షల టన్నులకుపైగా దిగుబడులొస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో టన్ను సుబాబుల్ రూ.4,200, యూకలిప్టస్ రూ.4,400గా ధర నిర్ణయించగా.. ఏనాడూ ఈ ధర లభించిన దాఖలాలు లేవు. గతంలో కంపెనీలు కోరుకున్న చోటకు తీసుకొస్తే కాని కొనుగోలు చేసేవారు కాదు.
కటింగ్, డీ బార్కింగ్, లోడింగ్, వే బ్రిడ్జి, రవాణా చార్జీల రూపంలో టన్నుకు రూ.800కు పైగా రైతులకు ఖర్చయ్యేది. కంపెనీలు చెల్లించే మొత్తంలో ఖర్చులు పోనూ రైతులకు టన్నుకు రూ.వెయ్యి మిగలడం కష్టంగా ఉండేది. గతంలో సరైన మార్కెటింగ్ సౌకర్యాల్లేక నష్టాలను చవిచూసిన ఈ రైతులకు గడచిన ఐదేళ్లుగా ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా నిలిచింది.
రైతు క్షేత్రం నుంచే కొనుగోలు
ప్రభుత్వ కృషి ఫలితంగా రైతు క్షేత్రం వద్దే కొనుగోలు చేసేందుకు 20కు పైగా కంపెనీలు ముందుకొచ్చాయి. కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల కంపెనీలు సైతం ఏపీకి క్యూ కట్టాయి.
ఈ పంట ద్వారా నమోదు చేయడమేకాకుండా, దళారీలకు చెక్‌పెట్టేలా క్రయ విక్రయాలను సీఎం యాప్ ద్వారా పర్యవేక్షించడం, ట్రేడర్లను ఎంచుకునే వెసులుబాటు కూడా రైతులకే కల్పించడం, నాణ్యతను బట్టి ధరలు నిర్ణయించడం, ఇరువురి అంగీకారంతో నిర్ధేశించిన తేదీన కోత కోయించి కలపను రైతు క్షేత్రం నుంచే తీసుకెళ్లడం వంటి చర్యల ఫలితంగా గతం కంటే మెరుగైన ధరలను రైతులు పొందగలిగారు.
రైతుల అభ్యర్థనతో వేలం పాటలకు బ్రేకు
ప్రస్తుతం రైతు క్షేత్రం వద్దే టన్ను సుబాబుల్‌కు రూ.4,500–రూ.4,800, యూకలిప్టస్‌కు రూ.5,000–రూ.5,500 మధ్య ధర లభిస్తోంది. ప్రస్తుతం రైతుకు దక్కే ధరలను స్థిరీకరించడమే కాకుండా మరింత పెరిగేలా చర్యలు చేపట్టింది.
అటవీ శాఖ పరిధిలో 7,500 హెక్టార్లలో సుబాబుల్, యూకలిప్టస్ తోటలకు శుక్రవారం వేలం పాటలు నిర్వహించేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు చేసింది. మరో 2 నెలల్లో పంట కోతకొచ్చే దశలో వేలం నిర్వహిస్తే తమకు ఆశించిన ధర దక్కదని రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. తక్షణం వేలం పాటల్ని నిలిపివేయాలని అభ్యర్థించారు.
క్షణం ఆలోచించకుండా ఆదేశాలు
గతంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన కలప గుజ్జు రైతులకు గడచిన ఐదేళ్లుగా మంచి ధర లభించేలా చర్యలు తీసుకున్నాం. ఫలితంగా రైతు క్షేత్రం వద్దే టన్నుకు రూ.4,500కు పైగా ధర లభిస్తోంది. రైతుల అభ్యర్థన మేరకు వేలం పాటల్ని నిలిపి వేయాలని కోరగానే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్షణం కూడా ఆలోచించకుండా ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతు క్షేత్రం వద్ద కలపగుజ్జు ధర మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
– కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖమంత్రి
Comments
Please login to add a commentAdd a comment