సాక్షి, విశాఖపట్నం: అర్హత కలిగి ఉండి.. నిరాశ్రయులుగా ఉన్నవారికీ ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్కుమార్ వ్యాస్ ఆదేశించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల జాబితా సవరణ–2024పై రెండు రోజుల సమీక్ష విశాఖలో గురువారం ముగిసింది.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్కుమార్ మీనా అధ్యక్షతన సదస్సు జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ తరఫున డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హృదేశ్‌కుమార్, సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ నరేంద్ర ఎన్ బుటాలియా, ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్‌కుమార్ హాజరయ్యారు.
ప్రత్యేక సంక్షిప్త సవరణపై అవగాహన
కలెక్టర్లకు ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ సమ్మరీ రివిజన్)–2024పై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. మానవ వనరుల లభ్యత, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, చట్టబద్ధమైన డాక్యుమెంటేషన్, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, ఎన్నికల సిబ్బందికి, పోలింగ్ స్టేషన్లకు కనీస సౌకర్యాలు, ఫిర్యాదు నిర్వహణ తదితర అంశాలపై కూడా చర్చించారు. ముగింపు సందర్భంగా సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ, నితీష్కుమార్ వ్యాస్ మాట్లాడుతూ అర్హులైన వారందర్నీ ఓటరు జాబితాలో 100 శాతం చేర్పించేందుకు ప్రతి జిల్లా కలెక్టర్ కృషి చేయాలన్నారు.
ముఖ్యంగా నిరాశ్రయులపై శ్రద్ధ వహించాలనీ, అట్టడుగు సమాజంలో ఉన్న వారిని, మురికివాడలు, సంచార జాతులు, ఎస్సీ, ఎస్టీ ప్రజలు, గిరిజన తండాల్లో నివాసితులు, పీవీజీటీ పరిధిలో (బలహీన గిరిజన సమూహాలు) ఉన్నవారు.. ఇలా ప్రతి ఒక్కరికీ విలువైన ఓటు హక్కు కల్పించాలని ఆదేశించారు. డ్రాఫ్ట్ పబ్లికేషన్ అనంతరం ఓటర్ల నమోదుపై వచ్చే ప్రతి ఫిర్యాదుపై శ్రద్ధ వహించాలని సూచించారు.
రాజకీయ పార్టీలకు ఓటింగ్, ఎన్నికల గురించి పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తూ.. ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా వివరించాలన్నారు. ఈవీఎంలను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని స్పష్టం చేశారు. యువ ఓటర్లు, వలస ఓటర్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ఎస్‌ఎస్‌ఆర్–2024 ప్రక్రియ పూర్తయ్యే సమయానికి అర్హులైన ఓటర్లతో ఎలాంటి తప్పులు లేకుండా పూర్తిస్థాయి పారదర్శకంగా ఉన్న ఓటర్ల జాబితా తయారు చేసేందుకు 26 జిల్లాల కలెక్టర్లు నిరంతరం కృషి చేయాలని ధర్మేంద్రశర్మ, నితీష్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment