బారికేడ్లను తోసివేస్తున్న టీడీపీ సభ్యులు
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలను టీడీపీ ఎమ్మెల్యేలు తమ పబ్లిసిటీకి ఉపయోగించుకునే క్రమంలో హైడ్రామా సృష్టించారు. సోమవారం సమావేశాలు ప్రారంభానికి ముందు అసెంబ్లీ ఆవరణలో టీడీపీ సభ్యులు నిరసన పేరుతో హడావుడి మొదలెట్టారు. అసెంబ్లీ పరిసరాల్లో నిరసనలు, ప్రదర్శనలకు అనుమతి లేదని తెలిసి కూడా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రదర్శనగా వచ్చారు.
ఒక్కసారిగా అసెంబ్లీ గేట్లు తోసుకుంటూ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి వారిని ఆపేందుకు ప్రయత్నించారు. టీడీపీ సభ్యులు బారికేడ్లను నెట్టివేసి అసెంబ్లీ లోపలికి వెళ్లారు. పోలీసులను తిడుతూ కావాలనే రాద్ధాంతం సృష్టించి అక్కడే అనుకూల మీడియాతో మాట్లాడారు. అవసరం లేకున్నా ఫొటోలు, వీడియోల కోసం పోలీసులతో వాగ్వాదానికి దిగి, నెట్టుకుంటూ గందరగోళం సృష్టించారు.
రాజ్యాంగ వ్యవస్థకు అవమానం
ఇకపోతే ఉభయ సభల సంయుక్త సమావేశం వేదికగా రాజ్యాంగ వ్యవస్థను టీడీపీ అవమానించింది. సభా సంప్రదాయాలను అపహాస్యం చేసింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ఉపక్రమించారు. తొలుత కొద్ది నిముషాల పాటు గవర్నర్ ప్రసంగం సాఫీగా సాగింది. అనంతరం ప్రతిపక్ష సభ్యులు గవర్నర్ ప్రసంగానికి సమాంతరంగా పదే పదే రన్నింగ్ కామెంట్రీతో ఆటంకం కలిగించారు.
టీడీపీ సభ్యుల్లో ముఖ్యంగా బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు తదితరులు తమ స్థానాల్లో కూర్చునే ప్రసంగ అంశాలపై కామెంట్లు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలో సభలో ప్రతిపక్ష సభ్యుల తీరును అధికార పక్షం సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పేదలందరికీ ఇళ్లు, మహిళా సాధికారత రంగాల్లో ప్రభుత్వం చేపట్టి సంస్కరణలు, ఆయా వర్గాలకు జరిగిన మేలుపై గణాంకాలతో సహా గవర్నర్ తన ప్రసంగంలో వివరిస్తుండగా టీడీపీ సభ్యులు అంతరాయం కలిగించే యత్నం ఎక్కువగా చేశారు.
ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన
సామాజిక భద్రత–సున్నితత్వం నుంచి సుస్థిరత దిశగా పరివర్తన.. అనే అంశంపై గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ వెంట తెచ్చుకున్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభలో నినాదాలు చేశారు. తమ స్థానాల్లో నిలబడి.. గవర్నర్ ప్రసంగంలో వాస్తవాలు లేవంటూ ఆరోపించారు. అసత్యాల ప్రసంగాన్ని వినలేమంటూ వాకౌట్ చేశారు. ఈ క్రమంలో ఓ వైపు ప్రసంగం కొనసాగుతుండగానే అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. టీడీపీ సభ్యులను పూర్తిగా ఇళ్లకు పరిమితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు.
ఆ తర్వాత టీడీపీ సభ్యులు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం అంతా అంకెల గారడీ, అభూత కల్పనలు, అసత్యాలు, అర్థసత్యాలమయమని.. ఈ సందర్భంగా టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చయ్యచౌదరి తదితరులు విమర్శించారు. ఎన్నికల ముందు గవర్నర్ ద్వారా ప్రజల్ని మోసగించడానికి సీఎం జగన్ మరోసారి ప్రయత్నించారని విమర్శించారు. 36 పేజీల గవర్నర్ ప్రసంగంలో వాస్తవ పరిస్థితులు ప్రజల ముందు ఉంచలేదన్నారు. 98 శాతం హామీలు నెరవేర్చాను, 175 స్థానాల్లో గెలిపించండి.. అనే అర్హత ముఖ్యమంత్రికి లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని సీఎం నెరవేర్చ లేదని చెప్పారు. గవర్నర్ కూడా నీళ్లు నములుతూ, చెప్పలేక చెప్పలేక దగ్గుతూ అబద్ధాలు చెప్పారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment