పల్నాడు జిల్లా అమరావతిలో పోలీసులతో టీడీపీ శ్రేణుల వాగ్వాదం
అమరావతి: ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా తరచూ అధికార పక్షంపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న టీడీపీ నేతలు తాజాగా పల్నాడు జిల్లా అమరావతిలోనూ కయ్యానికి కాలుదువ్వారు. అక్కడి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ గత కొంతకాలంగా ప్రస్తుత పెదకూరపాడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే నంబూరి శంకరరావుపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.
వీటిపై చర్చకు తాను సిద్ధమని ప్రకటించి అమరేశ్వరస్వామి ఆలయానికి ఆయన చేరుకున్నారు. కానీ, కొమ్మాలపాటి చర్చకు కాకుండా తన బలగంతో రచ్చచేయడానికే అన్నట్లు అక్కడికి బయల్దేరారు. దీంతో పోలీసులు అప్రమత్తమై కొమ్మాలపాటిని అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ మూకలు రెచ్చిపోయి బస్సుపై దాడిచేశారు. పోలీసులు వెంటనే ఇరుపార్టీల వారిని వెనక్కి పంపడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఘటన పూర్వాపరాలు..
తనపై టీడీపీ నేతలు ఇటీవల కొన్నిరోజులుగా చేస్తున్న ఆరోపణలు, అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని ఆదివారం అమరావతి అమరేశ్వరస్వామి సన్నిధిలో ప్రమాణానికి సిద్ధమని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సవాల్ విసిరారు. ఇందుకు టీడీపీ నేతలు, కొమ్మాలపాటి శ్రీధర్ స్పందించి తాము కూడా సిద్ధమని ప్రకటించారు. దీంతో వారం రోజులుగా పెదకూరపాడు నియోజకవర్గంలో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ నేపథ్యంలో.. సత్తెనపల్లి డీఎప్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో ఇరుపార్టీల నాయకులకు నోటీసులు జారీచేసి ముఖ్య నేతలపై నిఘా పెట్టారు. అయితే, శనివారం అర్ధరాత్రి వరకు వారంతా ఎక్కడ ఉన్నారో తెలీక పోలీసులు విస్తృతంగా సోదాలు చేశారు. అమరావతితోపాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో 144 సెక్షన్ విధించి అమరావతికి నాలుగు వైపులా చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు.
అలాగే, ఆదివారం ఉదయం చుట్టుపక్కల గ్రామాల నుంచి అమరావతికి వచ్చే ఇరుపార్టీల నేతలను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉ.9.35కు ఎమ్మెల్యే శంకరరావు అమరేశ్వరస్వామి దేవస్థానం గాలిగోపురం వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో స్థానిక ముస్లిం కాలనీ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వైపు దాడులకు తెగబడేందుకు అన్నట్లుగా పెద్దఎత్తున తన మందీమార్బలంతో కొమ్మాలపాటి శ్రీధర్ బయల్దేరారు.
దీనిని పోలీసులు పసిగట్టి వారిని అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య తోపులాట జరిగింది. అనంతరం.. కొమ్మాలపాటిని పోలీసులు అదుపులోకి తీసుకుని అమరావతి పోలీస్‌స్టేషన్ వైపు తరలిస్తుండగా టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. ఒక్కసారిగా అక్కడున్న బస్సుపై వారు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో బస్సు అద్దం ధ్వంసమైంది. దీంతో కొమ్మాలపాటిని క్రోసూరు వైపునకు మళ్లించారు.
ఇదే సమయంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అమరేశ్వరస్వామి దేవస్థానం వద్ద నుంచి గాంధీబొమ్మ వైపు వస్తుండగా పోలీసులు వారినీ అడ్డుకున్నారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు మద్దతుగా నినాదాలు చేస్తూ కొమ్మాలపాటి శ్రీధర్ దిష్టిబొమ్మను దగ్థం చేశారు. డీఎస్పీ ఆదినారాయణ సంయమనంతో వారిని నిలువరించడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment