![True up charges only with the permission of APERC - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/10/pwr.jpg.webp?itok=8ph583JV)
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలను భారీగా పెంచేసిందంటూ టీడీపీ నేతలు, ఎల్లో మీడియా మరోసారి దుష్ప్రచారానికి తెగబడ్డాయి. రకరకాల పేర్లతో అదనపు బాదుడు పెరిగిందంటూ వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. నిజానికి విద్యుత్ బిల్లులో అన్ని వివరాలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) అనుమతితో, మార్గదర్శకాల ప్రకారమే పొందుపరుస్తున్నట్లు ఇంధన శాఖ తెలిపింది.
చట్టప్రకారమే సర్దుబాటు..
విద్యుత్ రిటైల్ సరఫరా వ్యవస్థలో ఏడాదికోసారి ఆర్థిక సంవత్సరం మొదలయ్యే ముందు ధరలు ప్రకటిస్తారు. విద్యుత్ పంపిణీ రంగంలో ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలకు అనుగుణంగా సర్దుబాటు చార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ, అవసరాల నివేదికను సెప్టెంబర్ నాటికి ఉన్న పరిస్థితుల ఆధారంగా రూపొందిస్తాయి.
కాబట్టి అప్పుడు వంద శాతం ఖచ్చితత్వంతో విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని అంచనా వేయడం సాధ్యం కాదు. ఆర్థిక సంవత్సరం కొనసాగుతున్నప్పుడు విద్యుత్ కొనుగోలు ఖర్చులో హెచ్చు తగ్గులుంటాయి. విద్యుత్ చట్టం నిబంధనల్లో నిర్దేశించిన విధంగా ఇంధన చార్జీలు / కొనుగోలు వ్యయంలో హెచ్చుతగ్గులను సర్దుబాటు చార్జీల ద్వారా వసూలు చేసుకునే వెసులుబాటు డిస్కమ్‌లకు ఉంది. ఆ ప్రకారమే సర్దుబాటు చార్జీలను విధిస్తున్నాయి.
రైతులపై పైసా భారం లేదు..
2014–15 నుంచి 2018–19 వరకు పంపిణీ వ్యవస్థకు సంబంధించి నెట్‌వర్క్ ట్రూఅప్ చార్జీలు దాదాపు రూ.3,977 కోట్లుగా ఏపీఈఆర్‌సీ నిర్ధారించింది. ఇందులో ఏపీఎస్పీడీసీఎల్ వాటా రూ.2135 కోట్లు కాగా ఏపీసీపీడీసీఎల్ వాటా రూ.1,232 కోట్లు, ఏపీఈపీడీసీఎల్ ఖర్చు రూ.609 కోట్లుగా మండలి పేర్కొంది.
ఉచిత వ్యవసాయ విద్యుత్ నిమిత్తం ట్రూఅప్ భారం రూ.1,066.54 కోట్లు. రైతులకు అందించే విద్యుత్ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో భరిస్తోంది. కాబట్టి ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగానికి సంబంధించి ఇంధన వ్యయ సర్దుబాటును కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. మిగిలిన మొత్తం ఇతర కేటగిరీ (వ్యవసాయం కాకుండా) వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాలని డిస్కమ్‌లను కమిషన్ ఆదేశించింది.
పెరిగినదానికన్నా తక్కువే..
విద్యుత్ కొనుగోలులో స్థిర చార్జీలు, చర చార్జీలు (బొగ్గు, ఆయిల్, రవాణా, వాటిపై పన్నులు, డ్యూటీలు) ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. దానికి తోడు బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ ధరలు ప్రస్తుత అధిక డిమాండ్ సీజన్‌లో (ఫిబ్రవరి – జూన్) గరిష్టంగా యూనిట్ రూ.10 వరకు ఉంటున్నాయి. అంటే టారిఫ్ ఉత్తర్వుల్లో అంచనా విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్ రూ.4.30 కన్నా వాస్తవ విద్యుత్ కొనుగోలు ధర అధికంగా ఉంటోంది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత పరిస్థితుల నడుమ విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. అయినప్పటికీ వినియోగదారులకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో బహిరంగ మార్కెట్ నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. దానివల్ల విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్‌కు దాదాపు రూ.1.20 పెరిగింది. నిబంధనలకు లోబడి ప్రతి నెల విద్యుత్ కొనుగోలు వ్యయ సర్దుబాటు తగ్గింపు లేదా పెంపు యూనిట్‌కు రూ.0.40 వరకూ వసూలు చేసుకునేందుకు డిస్కమ్‌లకు అనుమతి ఉంది.
కేంద్రమే చెప్పింది
అప్పీలేట్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల ప్రకారం వార్షిక సర్దుబాటు విధానం స్థానంలో 2021–22 నుంచి త్రైమాసిక సర్దుబాటు విధానం అమలులోకి వచ్చింది. ఈ నిబంధనలకు అనుగుణంగానే ప్రతి త్రైమాసికం పూర్తి కాగానే పంపిణీ సంస్థలు విద్యుత్ కొనుగోలు వ్యయంలో హెచ్చుతగ్గులపై నివేదికలను సమర్పిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు త్రైమాసిక విద్యుత్ సర్దుబాటు చార్జీల విధానానికి బదులుగా నెలవారీ విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని సర్దుబాటు చేసేలా ఇటీవల ఏపీఈఆర్‌సీ మార్గదర్శకాలు జారీ చేసింది. 2021–22కి సంబంధించి త్రైమాసికం ప్రాతిపదికన ఇంధన విద్యుత్ కొనుగోలు సవరింపు చార్జీలు వసూలు చేస్తుండగా ఏపీఈఆర్‌సీ నియమావళి ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నెల అదనపు విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని జూన్ నెల విద్యుత్ బిల్లులతో కలిపి తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment