శ్రీవారి లడ్డూ వివాదంతో రాష్ట్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి
ఎలాంటి ఆధారం లేకుండా సీఎం చంద్రబాబు తీవ్ర ఆరోపణలు
బాబు తీరుపై ప్రపంచవ్యాప్తంగా భక్తుల ఆగ్రహం
తప్పు జరిగి ఉంటే ఇన్నాళ్లు ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీత
ఒత్తిడి తట్టుకోలేక ఎట్టకేలకు ఏఆర్ ఫుడ్స్‌పై పోలీసులకు ఫిర్యాదు
రెండు నెలల తర్వాత వాడని నెయ్యిపై ఫిర్యాదు చేసిన టీటీడీ జీఎం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీటీడీ ఉన్నతాధికారుల పరిస్థితి దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగాయన్న చందంగా మారింది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందనే అనుమానంతో పరీక్ష చేయించిన రెండు నెలల తర్వాత టీటీడీ.. ఏఆర్ ఫుడ్స్‌పై బుధవారం తీరిగ్గా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అది కూడా వాడని నెయ్యిపై ఫిర్యాదు చేయడం గమనార్హం. తిరుమల లడ్డూలో పశువు, పందికొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు చేసిన తీవ్ర ఆరోపణలు పెద్ద దుమారం లేపాయి.
కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన సున్నితమైన అంశంపై సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడాన్ని భక్తులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. చేసిన తప్పుపై ఉలిక్కిపడ్డ కూటమి ప్రభుత్వ పెద్దలు.. వాటి నుంచి బయట పడేందుకు ప్రాయశ్చిత్తం అంటూ దీక్షలు, హోమాలు, యాగాలు, వంటి కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు ఆరోపణలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నేరుగా తిరుమల పుష్కరణిలో స్నానం చేసి అఖిలాండం వద్ద ప్రమాణం చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
నాటి ప్రభుత్వ హయాంలో ఏ తప్పూ చేయలేదని, అలా చేసి ఉంటే తాను సర్వనాశనం అయిపోతానని, రక్తం కక్కుకుని చావాలని భూమన బహిరంగంగా ప్రకటించారు. అదేవిధంగా సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తప్పు చేయలేదని, అందుకే మాజీ చైర్మన్ భూమన ప్రమాణం చేసినప్పుడు.. కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా శ్రీవారి ఎదుట ప్రమాణం చేయాలని శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
నెయ్యిలో కల్తీ జరిగి ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని, కనీసం పోలీసులకైనా ఫిర్యాదు చేశారా? అంటూ భక్తులతో పాటు పలువురు స్వామీజీలు ప్రశ్నించారు. బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి సుప్రీంకోర్టులో పిల్ వేశారు. లడ్డూ వివాదం కూటమి ప్రభుత్వ మెడకు చుట్టుకుంటుండడంతో జూలై 23న నెయ్యిపై నివేదిక వచ్చిన రెండు నెలల తర్వాత అంటే సెపె్టంబర్ 25న హడావుడిగా టీటీడీ ఈఓ శ్యామలారావు ఆదేశాల మేరకు.. ప్రొక్యూర్‌మెంట్ జీఎం మురళీకృష్ణ తిరుపతి ఈస్ట్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
వాడని నెయ్యి ట్యాంకర్ల టెస్ట్ నివేదికపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడల్ట్రేషన్ టెస్ట్ (కల్తీ నిర్ధారణ పరీక్ష) నివేదిక ఆధారంగా ఫిర్యాదు చేసినట్లు టీటీడీ పేర్కొంది. ఈ ఫిర్యాదుపై కేస్ నంబర్ 470/24 లో సెక్షన్లు 274, 275, 316, 318(3), 318(4), 61(2), 299 రెడ్ విత్ 494, 3(5) బీఎన్‌ఎస్, సెక్షన్ 51, 59 ఫుడ్ సేఫ్టీ యాక్ట్ 2006 కింద కేసు నమోదు చేశారు. టీటీడీ, కూటమి ప్రభుత్వ వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment