సాక్షి, తిరుపతి: తిరుమలలో ఇవాళ(సోమవారం, జులై 17) శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం జరగనుంది. ఈ నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను సైతం రద్దు చేసింది. ఇక సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా.. బంగారం వాకిలిలో ఆస్థానం నిర్వహిస్తారు అర్చకులు. ఆపై స్వామివారికి రూపాయి హారతి ఇస్తారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు పుష్ప పల్లకిలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు.
సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినానికి శ్రీవారి ఆలయం ఇప్పటికే ముస్తాబయ్యింది. ఉదయం బంగారువాకిలి ముందు ఘంటా మండపంలో ఉభయదేవేరుల సమేతంగా మలయప్పస్వామివారు గరుత్మంతుడికి అభిముఖంగా, మరో పీఠంపై స్వామివారి విష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేయనున్నారు. ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదించనున్నారు.
ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివార ఆస్థానం అని పేరు. గతంలో ఆణివార ఆస్థానం రోజు నుండి శ్రీవారి ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యేది. అయితే టీటీడీ ఏర్పడ్డాక ఏప్రిల్ నుండి ఆదాయ వ్యయాలు అనుసరిస్తూ వస్తోంది.
జియ్యంగార్ల వస్త్ర సమర్పణ
తిరుమల పెద జియ్యర్ స్వామి వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేస్తారు. వీటిలో నాలుగింటిని మూలమూర్తికి అలంకరిస్తారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరిస్తారు. ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో ‘పరివట్టం’ కట్టుకొని బియ్యపు దక్షిణ స్వీకరించి నిత్యైశ్వర్యోభవ అని స్వామిని ఆశీర్వదిస్తారు.
భక్తులకు శుభవార్త
భక్తుల విజ్ఞప్తి మేరకు ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించి రూ.300 దర్శన టికెట్లను రోజుకు 4వేలు చొప్పున అదనంగా విడుదల చేస్తామని, ఇప్పటికే రోజుకు 20వేల టికెట్లను కేటాయించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ, పునరుద్ధరణకు నిబంధనల ప్రకారమే శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు.
కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.
ఇదీ చదవండి: వాళ్లకు డబ్బులు ఇవ్వకండి.. భక్తులకు ఈవో సూచన
Comments
Please login to add a commentAdd a comment