Central Govt Launches e-SHRAM Portal and Get Rs 2 Lakh Benefits - Sakshi
Sakshi News home page

పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకుంటే చాలు .. రూ.లక్షల్లో ప్రమాద బీమా

Published Wed, Apr 6 2022 7:39 PM | Last Updated on Wed, Apr 6 2022 7:50 PM

Union Govt Launches e-SHRAM Portal: Rs 2 Lakh Benefits - Sakshi

సాక్షి, మన్యం పార్వతీపురం కురుపాం: అసంఘటిత కార్మికులకు కేంద్రం ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఈ–శ్రమ్‌ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకుంటే చాలు రూ.లక్షల్లో ప్రమాద బీమా వచ్చేలా చర్యలు చేపట్టింది. గతేడాది అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ–పోర్టల్‌పై అప్పట్లో కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేయగా, ఇప్పుడు ఈ పథకంపై తగినంత అవగాహన లేకపోవడంతో రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగుతున్నాయి. త్వరగా రిజిస్ట్రేషన్లు చేసుకుని, పథకం లబ్ధి పొందాలని అధికారులు కోరుతున్నారు. 16 నుంచి 59 వయసు కలిగిన వారంతా ఈ పథకానికి అర్హులు కాగా, ప్రమాదవశాత్తు చనిపోతే రూ.2 లక్షలు, అంగవైకల్యం బారినపడితే రూ.లక్ష అందజేస్తారు. రాష్ట్రాలు, కార్మిక సంఘాల సమన్వయంతో సామాజిక సంక్షేమ పథకాలను ఈ పోర్టల్‌ ద్వారా ఏకీకృతం చేయడాన్ని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుని, ఈ–పోర్టల్‌ ప్రారంభించిననట్లు సమాచారం.

రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికి 12 అంకెల నంబర్‌ కలిగిన ఈ–శ్రమ్‌ గుర్తింపు కార్డు ఇస్తారు. అనంతరం వారికి ఏడాది కాలానికి గాను ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన((పీఎంఎస్‌బీవై), ప్రధాన మంత్రి కర్షక బీమా పథకం కింద ప్రమాద బీమా వర్తింపజేస్తారు. ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ సౌకర్యం పొందని వారంతా ఈ పథకానికి అర్హులే కాగా, ఈ జాబితాలో భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, భూమి లేని రైతులు, మత్స్య కార్మికులు, ఉపాధి హామీ కూలీలు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, తోపుడు బండ్ల వ్యాపారులు, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, తాపీమేస్త్రీలు, కార్పెంటర్లు, టైలర్లు, రజకులు, కల్లుగీత కార్మికులు, చేనేత, క్షౌ ర వృత్తి వారు, చిరు వ్యాపారులు ఉన్నారు.  

పోస్టాఫీసుల్లో రిజిస్ట్రేషన్లు.. 
ప్రస్తుతం కార్మిక శాఖ అధికారులు తపాలా శాఖ సహాయంతో అసంఘటిత కార్మికుల వివరాలు సేకరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్మార్ట్‌ యోజన వెల్ఫేర్‌ సొసైటీ సంస్థ సభ్యులు కూడా ఈ–శ్రమ్‌ పోర్టల్‌లో కార్మికుల నమోదు ప్రక్రియ చేపడుతున్నారు. ఆధార్‌ లింక్‌ చేసిన ఫోన్‌ నంబర్, ఆధార్‌ కార్డ్, బ్యాంక్‌ పాస్‌బుక్‌ లేదా పోస్టాఫీస్‌ పాస్‌బుక్‌లతో జిల్లాలోని ఏ పోస్టాఫీస్‌కు వెళ్లినా ఈ–శ్రమ్‌ పోర్టల్‌లో కార్మికుల వివరాలు నమోదు చేస్తారు. 

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. 
కోవిడ్‌ విపత్తు సమయంలో వలస కూలీలు, అసంఘటిత కార్మికులు పడిన ఇబ్బందులు చూసి, వారికి ఎలాగైనా ఆర్థిక భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సుప్రీంకోర్టు 2021 జూన్‌ 29వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ–శ్రమ్‌ పోర్టల్‌ని అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. 2021 ఆగస్టు 26వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కాగా, అన్నిచోట్ల నుంచి ఇప్పుడిప్పుడే ఈ పథకానికి స్పందన లభిస్తోంది. అయితే దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో రిజిస్టేషన్లు అంతగా జరగకపోవడం బాధాకరం. ప్రస్తుతం కురుపాం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, పాలకొండ, విజయనగరం, చీపురుపల్లి ప్రాంతాల్లోని స్మార్ట్‌ యోజన వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఈ–శ్రమ్‌ నమోదు ప్రక్రియ జరుగుతుండగా, రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 

పథకం సద్వినియోగం చేసుకోవాలి  
కార్మికులంతా ఈ–శ్రమ్‌ పథకం లబ్ధి పొందాలి. దగ్గరలోని పోస్టాఫీస్‌కి గానీ, స్మార్ట్‌ యోజన వెల్ఫేర్‌ సొసైటీ సభ్యుల వద్దకు గానీ వెళ్లి పేర్లు నమోదు చేసుకోవాలి.   
సి.హెచ్‌.సాయికిశోర్, ఈ–శ్రమ్‌ ప్రాజెక్ట్‌ జోనల్‌ ఇన్‌చార్జ్,  కురుపాం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement