![Vidadala Rajini Inaugurated Sickle Cell Anemia Examination Centre AP - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/27/vidadhalrajini.jpg.webp?itok=7Rl_KJAH)
సాక్షి, పాడేరు: సికిల్ సెల్ అనీమియా.. తలసేమియా. ఈ వ్యాధుల మధ్య స్వల్ప వ్యత్యాసాలున్నా రెండూ అత్యంత ప్రమాదకరమైనవే. ఇవి శరీరంలో ఎర్ర రక్త కణాలను ప్రభావితం చేసి రక్తహీనతను కలిగించే వారసత్వ రుగ్మతలే. వీటితో ఎక్కువగా గిరిజనులు బాధపడుతుంటారు. చికిత్స లేని ఈ వ్యాధుల నుంచి గిరిజనులను రక్షించేందుకు.. జీవిత కాలమంతా పూర్తి ఆరోగ్యంతో బతికేలా చర్యలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక కార్యక్రమానికి సోమవారం శ్రీకారం చుట్టారు. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అల్లూరి జిల్లా పాడేరులో ‘రుధిర రక్షణ’ యజ్ఞాన్ని ప్రారంభించింది. సికిల్ సెల్, తలసేమియా మరణాల నుంచి గిరిజనుల్ని రక్షించేందుకు పెద్ద యుద్ధమే తలపెట్టింది.
ఏమిటీ.. సికిల్ సెల్!
సికిల్ సెల్ అనీమియా అనేది వంశపారంపర్య వ్యాధులలో ఒకటి. ఇది ఎర్ర రక్త కణాల నిర్మాణంపై ప్రభావం చూపుతుంది. ఎర్ర రక్త కణాలు సాధారణంగా గోళాకారంలో రక్తనాళాల నుంచి సులభంగా వెళ్లేలా ఉంటాయి. సికిల్ సెల్ అనీమియాలో కొన్ని ఎర్ర రక్త కణాలు సికిల్స్ (కొడవలి) లేదా చంద్రవంక ఆకారంలో తయారవుతాయి. ఇవి రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. నిజానికి శరీరంలోని వివిధ అవయవాలకు రక్తం ద్వారానే ఆక్సిజన్ అందుతుంది. సికిల్ సెల్స్ రక్తప్రవాహాని అడ్డుకోవడం వల్ల ఆవయవాలకు ఆక్సిజన అందక సమస్యలు తలెత్తి మరణానికి దారి తీసే ప్రమాదం ఉంది. సాధారణంగా ఎప్పటికప్పుడు పుట్టే ఎర్ర రక్త కణాలు 120 రోజుల వరకు జీవిస్తాయి. కానీ.. సికిల్ సెల్ రక్త కణాలు మాత్రం పుట్టిన 10 నుంచి 20 రోజులకే మరణిస్తాయి. అందువల్ల ఈ రుగ్మత ఉన్నవారికి రక్తహీనత తలెత్తి ప్రాణాపాయానికి దారి తీస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందంటే..
రాష్ట్రంలో సికిల్ సెల్, తలసేమియా బారిన పడిన వారికి ప్రభుత్వం నెలకు రూ.10 వేల చొప్పున ఇప్పటికే పింఛన్లను పంపిణీ చేస్తోంది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, నంద్యాల, ప్రకాశం, పల్నాడు, శ్రీకాకుళం, ఏలూరు జిల్లాల పరిధిలో 19 లక్షల 90 వేల 277 మంది సికిల్ సెల్, తలసేమియా బాధితులు ఉన్నట్టు ప్రభుత్వం అంచనా వేసింది. వీరందరికీ వ్యాధి నిర్థారణ పరీక్షలు చేసేందుకు చర్యలు చేపట్టింది.
నిర్థారణ అయితే..
సికిల్ సెల్ పాజిటివ్‌గా నిర్థారణ అయితే వారికి ఉచితంగా కౌన్సెలింగ్, మందులను ప్రభుత్వం సమకూరుస్తుంది. 2047 కల్లా రాష్ట్రంలో సికిల్‌సెల్ లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో ఐదు చోట్ల ఇంటిగ్రేటెడ్ సెంటర్స్ ఫర్ హిమోగ్లోబినోపాథిస్ పరీక్షల ప్రయోగశాలను సీఎం జగన్ ఏర్పాటు చేశారు. పాడేరు జిల్లా ఆస్పత్రి, విశాఖలోని కేజీహెచ్, కాకినాడ, గుంటూరు, కర్నూలు పట్టణాల్లోని టీచింగ్ ఆస్పత్రుల్లో ఈ ల్యాబ్‌లను అభివృద్ధి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment