
సాక్షి, తాడేపల్లి: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద చోటు చేసుకున్న రైలు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్ రైలుకు ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం వచ్చిందని, ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్టుగా సమాచారం అందుతోందని సీఎంఓ అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.దాంతో వెంటనే సహాయక చర్యటు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.
విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లినుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని, మంచి వైద్య అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటన సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు.
కాగా, కంటకాపల్లి వద్ద పట్టాలపై ఉన్న విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలును పలాస-విశాఖ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో రాయగడ ప్యాసింజర్ చివరి మూడు బోగీలు పట్టాలు తప్పాయి.