48.63 లక్షల మందికి రూ.1,157 కోట్ల పింఛన్‌ | Volunteers distributed Pensions All Over Andhra Pradesh | Sakshi
Sakshi News home page

48.63 లక్షల మందికి రూ.1,157 కోట్ల పింఛన్‌

Published Mon, Aug 2 2021 2:44 AM | Last Updated on Mon, Aug 2 2021 2:44 AM

Volunteers distributed Pensions All Over Andhra Pradesh - Sakshi

శ్రీకాకుళం నగరంలోని ఆరో వార్డులో దంపతులకు (భర్తకు పక్షవాతం, భార్యకు వృద్ధాప్య పింఛన్‌) పింఛన్‌ ఇస్తున్న వలంటీర్‌ ఎన్‌.అశ్విని

సాక్షి, అమరావతి/సాక్షి, నెట్‌వర్క్‌: ఆంధ్ర రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు వలంటీర్లు సెలవు రోజు అయినా.. ఆదివారం తెల్లవారుజాము నుంచే పింఛన్లు పంపిణీ చేశారు. ఠంచన్‌గా ఒకటో తేదీ తెల్లవారకముందే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి డబ్బులు అందజేశారు. రాత్రి 8 గంటల సమయానికి 48,63,732 మందికి రూ.1,157.74 కోట్లు పంపిణీ చేశారు. రాత్రి వేళ కూడా ఇంకా పంపిణీ కొనసాగుతున్నట్టు గ్రామీణ పేదరిక నిర్మూలనసంస్థ (సెర్ప్‌) అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో 60.50 లక్షల మంది పింఛనుదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.1,455 కోట్లు విడుదల చేసింది. సాంకేతిక కారణాల వల్ల కొన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు పాక్షిక మొత్తంలో డబ్బులు చేరినట్టు అధికారులు గుర్తించారు. దాదాపు రూ.90 కోట్లు సకాలంలో క్షేత్రస్థాయికి చేరలేదని గుర్తించినట్టు సెర్ప్‌ అధికారులు తెలిపారు. ఆయా వార్డుల్లో కూడా ఆదివారం పింఛన్ల పంపిణీ కొనసాగినట్టు చెప్పారు. సెలవు రోజు అయినా, కొన్నిచోట్లకు సకాలంలో పూర్తి డబ్బు చేరకపోయినా ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా 80.4 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ పూర్తయినట్టు తెలిపారు. పింఛన్ల పంపిణీ తీరును సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌ స్వయంగా పరిశీలించారు. గుంటూరు జిల్లా పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో ఆయన పర్యటించి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమ, మంగళవారాల్లో ఈ పంపిణీ కొనసాగనుందని ఆయన తెలిపారు. 

హైదరాబాద్‌ వెళ్లి డయాలసిస్‌ పేషెంట్‌కు..
హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న డయాలసిస్‌ పేషెంట్‌ వద్దకు వలంటీర్లు వెళ్లి పింఛను సొమ్ము అందించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం ఖాజీగూడేనికి చెందిన డయాలసిస్‌ పేషెంట్‌ కుమ్మరి శ్యాంసన్‌రాజు డయాలసిస్‌ పేషెంట్‌ కావడంతో ప్రభుత్వం రూ.10 వేల పింఛను మంజూరు చేసింది. కరోనా బారిన పడి చికిత్స పొందిన అతడికి తరువాత బ్లాక్‌ఫంగస్‌ రావడంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. గత రెండునెలలు పింఛను తీసుకోకపోవడంతో ఈసారి తీసుకోకపోతే పింఛను రద్దయ్యే ప్రమాదముందని స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుడు అక్కినేని రాజశేఖర్‌ వలంటీర్లను అప్రమత్తం చేశారు. హైదరాబాద్‌ వెళ్లి అతడికి పింఛను ఇచ్చి రావాలని సూచించి, ప్రయాణ ఖర్చులకు తన సొంత సొమ్ము ఇచ్చారు. దీంతో వలంటీర్లు హైదరాబాద్‌ వెళ్లి 3 నెలల పింఛన్‌ సొమ్ము రూ.30 వేలు శ్యాంసన్‌రాజుకు అందజేశారు. 
– పెదపాడు (దెందులూరు), పశ్చిమ గోదావరి జిల్లా 
విజయనగరంలో చికిత్స పొందుతున్న రాబంద గ్రామానికి చెందిన వృద్ధుడికి పింఛన్‌ ఇస్తున్న వలంటీర్‌ నిర్మల  


జిల్లా సరిహద్దులు దాటి..
అనారోగ్యంతో బాధపడుతున్న పింఛను లబ్ధిదారుకు జిల్లా దాటివెళ్లి మరీ పింఛను అందజేశారు వైఎస్సార్‌ జిల్లా కేంద్రం కడపలోని వలంటీరు. కడప నగరం నకాష్‌ వీధికి చెందిన పీరాన్‌ బీ (85) అనారోగ్యంతో బాధపడుతోంది. నడవలేని ఆమె ప్రస్తుతం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సీతారామపురంలో కుమార్తె ఇంటివద్ద ఉంటోంది. రెండు నెలలుగా పింఛను తీసుకోలేకపోయిన ఆమె పరిస్థితిని తెలుసుకున్న వలంటీరు షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌ ఆదివారం సీతారాంపురం వెళ్లి పింఛను మొత్తాన్ని అందజేశారు.
– కడప కార్పొరేషన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement