సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే మద్యంలో హానికర రసాయనాలు ఉన్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం అమ్ముతున్నట్టు గత కొన్నిరోజులుగా ఎంపీ రఘురామకృష్ణరాజు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మద్యం శాంపిల్స్‌కు లేబొరేటరీలో పరీక్షలు చేయించామని వారు చూపుతున్న పత్రాలు కూడా తప్పుడువేనన్నారు. ఈ మేరకు రజత్ భార్గవ మంగళవారం సచివాలయంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులతో కలసి మీడియాతో మాట్లాడారు.
రఘురామ అండ్ కో మద్యం శాంపిల్స్ పరీక్ష చేయించామని చెబుతున్న చెన్నైలోని ఎస్‌జీఎస్ ల్యాబ్ నుంచి ఈ మేరకు నివేదిక తెప్పించామన్నారు. మద్యం శాంపిళ్లలో హానికర రసాయనాలు లేవని, పైగా ఆ మద్యాన్ని ఏపీ నుంచి తెచ్చినట్టు ఆధారాలు కూడా లేవని స్పష్టమైందన్నారు. సమర్పించిన వ్యక్తులు కోరనందున ఆ నమూనాలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఎస్‌ఐ) 4449 (విస్కీ), 4450 (బ్రాందీ) ప్రకారం పరీక్షించలేదని ఎస్‌జీఎస్ ల్యాబ్ పేర్కొందన్నారు. ఈ పరీక్షలు ఎక్సైజ్ చట్టం ప్రకారం అనుసరించాల్సిన విధానాల మేరకు జరగలేదన్నారు. ఈ మేరకు ల్యాబ్ ఇచ్చిన లేఖను రజత్ భార్గవ మీడియాకు చూపించారు. తప్పుడు ప్రచారానికి కారణమైన రఘురామపై పరువునష్టం దావా వేస్తామన్నారు. క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తామని తెలిపారు.
ప్రమాణాలు పాటించకుండా పరీక్షలు..
చైతన్య, పవన్ అనే వ్యక్తులు గతేడాది డిసెంబర్ 11న నాలుగు విస్కీ, ఒక బ్రాందీ నమూనాలను అనధికారికంగా చెన్నైలోని ల్యాబ్‌కు పంపారని తెలిపారు. డిసెంబర్ 24న వారికి నివేదిక ఇచ్చినట్టు ఎస్‌జీఎస్ ల్యాబ్ తెలిపిందన్నారు. వీటిని ఏపీ నుంచి కొనుగోలు చేశారా, లేదా అనే విషయం తేలాలన్నారు. పరీక్షల కోసం నమూనాలను కల్తీ చేసి పంపారా, లేదా అనేదాన్ని గుంటూరులోని ప్రభుత్వ కెమికల్ ల్యాబ్ ఎగ్జామినర్ తేల్చాల్సి ఉందన్నారు.
ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసేందుకే చైతన్య, పవన్ ఈ పనిచేసినట్టు అనుమానం వ్యక్తం చేశారు. నిర్ణీత ప్రమాణాల ప్రకారం.. మద్యం శాంపిల్స్‌ను కమిషనర్ లేదా శాంపిల్స్ సేకరించేందుకు అనుమతించిన ఇతర డిస్టిలరీ ఎక్సైజ్ అధికారి మాత్రమే ల్యాబ్‌కు పంపాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలోని ఐదు ప్రభుత్వ లేబొరేటరీల్లో ఎప్పటికప్పుడు మద్యం నమూనాలను ఎన్నో విధాలుగా పరీక్షిస్తున్నామని తెలిపారు. 2021–22 (ఫిబ్రవరి వరకు)లో 1,47,636 శాంపిళ్లను పరీక్షించామని, ఎందులోనూ కల్తీ జరిగినట్టు, హానికర పదార్థాలు ఉన్నట్టు తేలలేదన్నారు.
ప్రియాంక రాష్ట్రానికి గర్వకారణం
మహిళా గ్రాండ్ మాస్టర్ నూతక్కి ప్రియాంక రాష్ట్రానికి గర్వకారణమని ç రజత్‌భార్గవ చెప్పారు. ఆయన మంగళవారం సచివాలయంలోని తన చాంబర్‌లో ప్రియాంకను సత్కరించారు. క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందన్నారు. ఇటీవల భువనేశ్వర్‌లో జరిగిన జాతీయ చెస్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకోవడంతోపాటు డబ్ల్యూజీఎం మూడో నార్మ్‌ను సొంతం చేసుకున్న ప్రియాంకను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment