‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’: జనం పట్టిన జెండా | Why AP Needs Jagan program started grandly | Sakshi
Sakshi News home page

‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’: జనం పట్టిన జెండా

Published Fri, Nov 10 2023 3:55 AM | Last Updated on Fri, Nov 10 2023 10:38 AM

Why AP Needs Jagan program started grandly - Sakshi

విశాఖలోని అక్కయ్యపాలెంలో భారీ ర్యాలీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు

సాక్షి, అమరావతి: సంక్షేమమే అభివృద్ధి అని నిరూపించిన సంక్షేమ ప్రదాతకు నీరాజనం పలికారు. విద్య – వైద్య రంగాలలో విప్లవాత్మక మార్పులతో మేలు చేసిన ప్రజానేతకు బ్రహ్మరథం పట్టారు. వ్యవసాయాన్ని పండుగగా మార్చి రైతును రాజుగా చేసిన రైతు బాంధవుడికి జేజేలు పలికారు. పోర్టులు, రహదారులతో పారిశ్రా­మికాభివృద్ధిని పరుగు­లెత్తిస్తూ ఉపాధి కల్పిస్తున్న ప్రగతిశీలిపై ప్రశంసల వర్షం కురి­పించారు.

తాము, తమ కుటుంబం, గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్లాలంటే మాట తప్పని, మడమ తప్పని యోధుడు ‘జగనే కావాలంటూ..’ అన్ని వర్గాల ప్రజలు ఒక్కటై నినదించారు. అందరి ఆకాంక్షలను నెరవేరుస్తూ, మనోభావాలను గౌరవిస్తున్న వైఎస్సార్‌ సీపీ తమదంటూ ప్రజలంతా పార్టీ జెండాను పట్టారు. విజయవాడ, విశాఖలో భారీ ర్యాలీలతో కదం తొక్కారు. ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ (ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలంటే..) కార్యక్రమం ప్రారంభం సందర్భంగా తొలిరోజు గురువారం గ్రామ, వార్డు సచివాలయాల వద్ద నెలకొన్న పండుగ వాతావరణం ఇదీ!


చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో వై ఏపీ నీడ్స్‌ జగన్‌ బుక్‌ను అందజేస్తున్న ఎమ్మెల్సీ భరత్‌

సాదర స్వాగతాల నడుమ..
రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా విప్లవాత్మక పరిపాలనతో చేసిన మంచిని వివరించడంతోపాటు అధికారంలో ఉండగా చంద్రబాబు – పవన్‌ కళ్యాణ్‌ జోడీ చేసిన మోసాలను గుర్తు చేయడమే లక్ష్యంగా చేపట్టిన ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమం గురువారం 26 జిల్లాల్లో 660 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో భారీ జనసందోహం, జగన్నినాదాల మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, గృహ సారథులు, కార్యకర్తలు, పార్టీ మద్దతుదారులు, సీఎం జగన్‌ అభిమానులు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొన్నారు.

మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడి నేతృత్వంలో ప్రజాప్రతినిధులు మధ్యాహ్నం గ్రామ సచివాలయాల వద్దకు చేరుకోగానే సర్పంచులు, సచివాలయ ఉద్యోగులు, గ్రామ ప్రజలు సాదరంగా స్వాగతం పలికారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా గ్రామానికి చేసిన మంచిని గణాంకాలతో సహా వివరించేలా సంక్షేమ బోర్డును ఆవిష్కరించారు. అనంతరం భారీ జనసందోహం మధ్య  గ్రామ ప్రధాన కూడళ్లలో వైఎస్సార్‌సీపీ జెండాను ఆవిష్కరించి నేతలు ప్రసంగించారు.

వాస్తవాలను వివరించి వంచనలను ఎండగడుతూ
నాలుగున్నరేళ్లుగా సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా రాష్ట్రాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రగతిపథంలో నిలపడాన్ని నేతలంతా ప్రజలకు వివరించారు. ఆయా గ్రామాలకు చేసిన మంచిని గణాంకాలతో సహా కళ్లకు కట్టినట్లు వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టోలో 99.5 శాతం హామీలను సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేసి మాట నిలబెట్టుకోగా 2014లో చంద్రబాబు వ్యవసాయ, డ్వాక్రా రుణాలను మాఫీ చేయకుండా నిలువుగా మోసగించిన తీరును వివరించారు.

ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో నాడు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే చంద్రబాబు మేనిఫెస్టోను మాయం చేయడాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు పూచీ తనదంటూ 2014లో నమ్మబలికిన పవన్‌ కళ్యాణ్‌ అనంతరం దగా చేసిన తీరును ఎండగట్టారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు–పవన్‌లు ఉమ్మడి మేనిఫెస్టోతో వస్తున్నారని, వారికి తగినరీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సుపరిపాలన కొనసాగాలంటే సీఎం జగన్‌ను ఆశీర్వదించి మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.


అనంతపురంజిల్లా రాయదుర్గంలో సంక్షేమ లబ్ధి బోర్డును ఆవిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వవిప్‌ కాపు రామచంద్రారెడ్డి

మా నమ్మకం నువ్వే జగన్‌ అంటూ నినాదాలు..
నేతలు పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తున్న సమయంలో పలుచోట్ల మా నమ్మకం నువ్వే జగన్‌.. జగనన్నే మా భవిష్యత్తు అంటూ ప్రజలు నినదించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వల్ల మంచి జరిగిందని అనుకుంటేనే ఓటేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేస్తున్నారని, మంచి చేసిన జగన్‌ వెంటే తాము నడుస్తామని ప్రజలు స్పష్టం చేశారు. విప్లవాత్మక పరిపాలనను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్న దుష్ట శక్తుల ఆట కట్టిస్తామంటూ నినదించారు.

నేడు 721 సచివాలయాల పరిధిలో ప్రారంభం..
గ్రామాల్లో సమావేశాలు ముగిశాక రాత్రికి వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లలో పార్టీ నేతలు బస చేశారు. శుక్రవారం ఉదయం వలంటీర్లు, గృహ సారథులతో కలిసి ఇంటింటా ప్రచారాన్ని  ప్రారంభించనున్నారు. గ్రామ సచివాలయం పరిధిలోని ప్రతి ఇంటికీ వలంటీర్లు, గృహ సారథులు, పార్టీ మద్దతుదారులు, సీఎం జగన్‌ అభిమానులు వెళ్లి ప్రచారాన్ని కొనసాగిస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలో వివరిస్తూ 24 పేజీలతో రూపొందించిన పుస్తకాన్ని ప్రతి ఇంటికీ అందించనున్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ హామీల అమలు తీరు – చంద్రబాబు హామీల అమలు తీరుపై ప్రతి ఇంటా సర్వే నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రజాతీర్పు పుస్తకంలో ఆయా కుటుంబాల అభిప్రాయాన్ని నమోదు చేస్తారు. మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడి నేతృత్వంలోని పార్టీ ప్రతినిధుల బృందం ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమాన్ని నేడు 721 సచివాలయాల పరిధిలో ప్రారంభించనుంది. 


విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో ర్యాలీగా వస్తున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు
 

విజయవాడ, విశాఖలో భారీ ర్యాలీలు
‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమం సందర్భంగా విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ పరిధిలోని 26వ డివిజన్‌ మారుతీనగర్‌ 29వ సచివాలయంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా పెడనలో ర్యాలీని మంత్రి జోగి రమేష్‌ జెండా ఊపి ప్రారంభించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో సమన్వయకర్త కె.కె.రాజు ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో ఎమ్మెల్సీ భరత్‌ ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement