పెళ్లి చేసుకోవాలంటూ యువకుడికి యువతి బెదిరింపులు
ఇంట్లో బంధించి..హత్యాయత్నం
తగరపువలస: విశాఖలోని షీలానగర్‌కు చెందిన ఓ కుటుంబం కొంతకాలంగా అమెరికాలో ఉంటోంది. ఇన్‌స్ట్రాగామ్ ద్వారా వారి కుమారుడితో మురళీనగర్ ఎన్జీవోస్ కాలనీకి చెందిన కొరుప్రోలు జాయ్ జెమీమా పరిచయం పెంచుకుంది. బాధిత యువకుడి ద్వారా షీలానగర్‌లోని వారి చిరునామా తెలుసుకుంది. అతని తల్లిదండ్రులు షీలానగర్‌లో ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్లి కొన్ని రోజుల పాటు మంచి అమ్మాయిగా నటించింది. మీ అబ్బాయి స్నేహితురాలినని..పెళ్లి చేసుకుంటానని అడగ్గా.. అతని తల్లిదండ్రులు నిరాకరించారు. ఆ తర్వాత అమెరికాలో తల్లిదండ్రుల వద్ద ఉంటున్న బాధిత యువకుడికి మాయమాటలు చెప్పి విశాఖకు రప్పించింది.
ఎయిర్‌పోర్టు నుంచే యువకుడిని మురళీనగర్‌లోని తన ఇంటికి తీసుకువెళ్లి బంధించింది. మత్తు పదార్థాలు కలిపిన జ్యూస్‌లు, డ్రింక్‌లు ఇచ్చి పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తూ మైకంలో ఉన్నప్పుడు శారీరకంగా కలిసి ఉన్నట్లు ఫొటోలను తీయించింది. వాటితో ఆ యవకుడిని బ్లాక్‌మెయిల్ చేసింది. దీంతో యువకుడు తన తల్లిదండ్రులకు చెప్పి పెళ్లికి ఒప్పిస్తానన్నా వినిపించుకోకుండా జెమీమా.. తన సహచరులతో కలిసి తరచూ బెదిరించేది.
ఇటీవల భీమిలిలోని ఒక హోటల్‌లో బలవంతంగా నిశ్చితార్థం చేసుకుని..యువకుడితో రూ.5 లక్షల వరకు ఖర్చు చేయించింది. యువకుని ఫోన్ బ్లాక్ చేసి, నిశ్చితార్థం, శారీరకంగా కలిసి ఉన్న ఫొటోలు చూపించి..మురళీనగర్‌లోని తన ఇంట్లో మళ్లీ నిర్భంధించింది. తనను పెళ్లి చేసుకోకపోతే ఈ ఫొటోలతో పోలీస్ కేసులు పెట్టించి.. అమెరికా వెళ్లకుండా చేస్తానని బెదిరిస్తూ అతని వద్ద ఉన్న డబ్బులు కాజేసింది.
ఆమె ఇంటి నుంచి అతను ఒకసారి పారిపోయేందుకు ప్రయత్నించగా సహచరులతో కలిసి కత్తితో చంపడానికి ప్రయత్నించింది. ఆమె సహచారులు కూడా జెమీమాను పెళ్లి చేసుకోకపోతే అమెరికా వెళ్లకుండా శవమైపోతావు అంటూ బెదిరింపులకు దిగేవారు. ఎట్టకేలకు ఈ నెల 4న బాధిత యువకుడు ఆమె నుంచి తప్పించుకుని భీమిలి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు మురళీనగర్‌లో జెమీమాను అదుపులోకి తీసుకున్నారు. శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో కూడా జెమీమా, ఆమె స్నేహితులు ధనవంతుల అబ్బాయిలను ప్రేమపేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు బాధిత యువకుడు పోలీసులకు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment