విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్
సాక్షి, అమరావతి: విత్తనం మంచిదైతే.. పంట బాగుంటుంది. పంట కళకళలాడితే... దిగుబడి దిగులుండదు. దిగుబడి, ధరలూ బాగుంటే ఇక రైతన్నకు తిరుగుండదు.. అంతా సవ్యంగా జరగాలంటే మేలి రకం విత్తనం కావాలి. అన్నదాతలు నకిలీ విత్తనాలతో మోసపో కుండా వైఎస్సార్ అగ్రి ల్యాబ్స్ భరోసా కల్పిస్తున్నాయి. ఏటా రూ.వేల కోట్ల పెట్టుబడి మట్టి పాలు కాకుండా కాపాడుతున్నాయి. పైసా ఖర్చు లేకుండా ఇన్‌పుట్స్‌ను ముందుగానే పరీక్షించుకోవడం ద్వారా నాసిరకం బారిన పడకుండా ధైర్యంగా సాగు పనులు చేపడుతున్నామని రైతన్నలు ఆనందంగా చెబుతున్నారు. నాణ్యమైన ధ్రువీకరించిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇప్పటికే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే రైతులకు అందుబాటులోకి వచ్చాయి.
ఇక ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటవుతున్న వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ నాణ్యత పరీక్షకు భరోసా కల్పిస్తున్నాయి. 70 కేంద్రాలు ఇప్పటికే సేవలందిస్తుండగా కొద్ది నెలల్లోనే మిగతావి కూడా ప్రారంభం కానున్నాయి. ఆర్బీకేల ద్వారా సరఫరా చేసే ఇన్‌పుట్స్‌తో పాటు మార్కెట్‌లోకి వచ్చే ప్రతీ ఇన్‌పుట్ శాంపిల్‌ను ఇక్కడ పరీక్షించుకునే సదుపాయం ఉండటం వల్ల రైతుల్లో నమ్మకం పెరుగుతోంది. సొంతంగా తయారు చేసుకున్న విత్తనమైనా, మార్కెట్‌లో కొనుగోలు చేసినవైనా నేరుగా ఈ ల్యాబ్‌కు వెళ్లి నాణ్యతను ఉచితంగా పరీక్షించుకోవచ్చు. విత్తనమే కాకుండా ఎరువులు, పురుగు మందుల నాణ్యతను కూడా పరీక్షించుకుని ధీమాగా సాగు పనులు చేపట్టవచ్చు.
గతంలో 3 శాతం లోపే పరీక్ష..
రాష్ట్రంలో ఏటా వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు కోసం 1.25 లక్షల లాట్స్ విత్తనాలు, 2.80 లక్షల బ్యాచ్‌ల పురుగు మందులు, 20 వేల బ్యాచ్‌ల ఎరువులు మార్కెట్‌కు వస్తుంటాయి. గతంలో వీటి నాణ్యతను పరీక్షించేందుకు రాష్ట్రంలో 11 ల్యాబరేటరీలు మాత్రమే అందుబాటులో ఉండేవి. పెస్టిసైడ్స్ కోసం 5, ఎరువులు, విత్తన పరీక్షల కోసం మూడు చొప్పున మాత్రమే ప్రయోగశాలలున్నాయి. మార్కెట్‌లోకి వచ్చే ఎరువుల్లో 30 శాతం, విత్తనాల్లో 3–4 శాతం, పురుగు మందుల్లో ఒక శాతానికి మించి శాంపిళ్లను పరీక్షించే సామర్ధ్యం వీటికి లేదు. దీంతో మార్కెట్‌లో నకిలీలు రాజ్యమేలేవి. ఏటా వీటి బారిన పడి రైతన్నలు ఆర్థికంగా చితికిపోయే వారు. ఇప్పుడా దుస్థితి తొలగిపోయింది.
నాసిరకం తయారీదారుల ప్రొసిక్యూషన్
నాసిరకం ఇన్‌పుట్స్ బారిన పడకుండా ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన 70 ల్యాబ్స్ ద్వారా 2021–22లో విత్తనాలు, ఎరువులు 10 వేల నమూనాల చొప్పున, పురుగు మందుల శాంపిళ్లు 5,500 పరీక్షించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటివరకు 8,238 విత్తన, 6,490 ఎరువులు, 3,618 పురుగుల మందుల శాంపిల్స్ పరీక్షించారు. వీటిలో 10–20 శాతం రైతులు తెచ్చిన శాంపిల్స్ కాగా మిగిలినవి డీలర్లు అందచేసిన నమూనాలు ఉన్నాయి. 112 విత్తన, 240 ఎరువులు, 41 పురుగుల మందుల నమూనాలు నాసిరకంగా ఉన్నట్లు గుర్తించి తయారీ కంపెనీలను చట్టపరంగా ప్రాసిక్యూట్ చేసేందుకు నోటీసులు జారీ చేశారు.
ఖరీఫ్ కల్లా మిగిలిన ల్యాబ్స్
ఇప్పటిదాకా తమిళనాడులో అత్యధికంగా 33 అగ్రీ ల్యాబ్స్ ఉండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి ఫలితంగా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్‌తో నంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఒక్కొక్కటి రూ.6.25 కోట్లతో జిల్లా స్థాయిలో 13 ల్యాబ్స్ ఏర్పాటవుతున్నాయి. రూ.81 లక్షలతో నియోజకవర్గ స్థాయిలో 147 చోట్ల గ్రామీణ ప్రాంతంలో ల్యాబ్స్ సేవలందిస్తాయి. రూ.75 లక్షలతో నాలుగు (విశాఖ, తిరుపతి, అమరావతి, తాడేపల్లిగూడెం) రీజనల్ కోడింగ్ సెంటర్స్ ఏర్పాటు కానున్నాయి. వీటన్నిటి కోసం ప్రభుత్వం రూ.213.27 కోట్లు వ్యయం చేస్తోంది.
ఇక సీడ్ జన్యు పరీక్ష కోసం డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీతో మరో రూ.8.50 కోట్ల అంచనా వ్యయంతో గుంటూరులో ల్యాబ్ అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే అత్యాధునిక సౌకర్యాలతో నెలకొల్పిన 70 అగ్రీ ల్యాబ్స్‌ను రైతు దినోత్సవమైన డాక్టర్ వైఎస్సార్ జయంతి రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించడం తెలిసిందే. మిగిలిన వాటిలో 50 ల్యాబ్‌లను మార్చిలో, మిగతా ల్యాబ్‌లతో పాటు జిల్లా ల్యాబ్‌లు, కోడింగ్ సెంటర్లను ఖరీఫ్ సీజన్ కల్లా సిద్ధం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వేగంగా పరీక్ష నివేదికలు..
నియోజకవర్గ స్థాయి ల్యాబ్‌లన్నీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాగానే నెలకు 50 శాంపిల్స్‌ను విత్తనాలు, ఎరువులు ఏటా 88,200 చొప్పున నమూనాలు పరీక్షిస్తారు. ప్రతీ జిల్లా ల్యాబ్‌లో విత్తనాలు, ఎరువుల నమూనాలు 39 వేల చొప్పున, 2 వేల చొప్పున పురుగు మందుల శాంపిల్స్‌ను పరీక్షిస్తారు. ఆ విధంగా ఏటా 1,27,200 శాంపిళ్ల చొప్పున విత్తనాలు, ఎరువులతోపాటు 26 వేల పురుగు మందుల నమూనాలను పరీక్షించి నిర్ధారిస్తారు.
విత్తన పరీక్ష నివేదికను వారం నుంచి పది రోజులలోపు పొందవచ్చు. పురుగు మందులు, ఎరువుల నాణ్యత నిర్థారణ రిపోర్టును రెండు మూడు రోజుల్లోనే అందచేస్తారు. రైతులు కాకుండా వ్యాపారులు, డీలర్లు, తయారీదారులు, ఇతరులు నాణ్యత ప్రమాణాల పరీక్ష నివేదిక కోసం ఎరువుల రకాన్ని బట్టి రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు చెల్లించాలి. పురుగు మందులకు సంబంధించి రూ.3,500 చెల్లించాలి. విత్తనాల నివేదిక కోసం రూ.200 చొప్పున చెల్లించాలి. రైతులకు మాత్రం పూర్తి ఉచితం.
ప్రభుత్వమే ఈ వ్యయాన్ని భరించి రైతన్నకు తోడుగా నిలుస్తుంది.
ప్రతి ల్యాబ్‌లో ఆటోమెషన్
నమూనాల పరీక్ష కోసం ప్రత్యేకంగా ఆటోమేటెడ్ క్వాలిటీ కంట్రోల్ యాప్ (ఇన్‌సైట్) అభివృద్ధి చేశారు. ఫలితాలను ట్యాంపర్ చేసేందుకు వీల్లేని రీతిలో ప్రతి లేబరేటరీలో ఆటోమేషన్ ఏర్పాటు చేశారు. టెస్టింగ్ చేసిన ప్రతీ ఒక్కటి రికార్డు కావడంతోపాటు ఫలితాలు ఆటోమేటిక్‌గా సిస్టమ్‌లో నమోదవుతాయి. ఏ ల్యాబ్‌లో ఏ బ్యాచ్ శాంపిల్‌ను ఏ సమయంలో పరీక్షించారో నిర్ధారిస్తూ ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా ఈ టెక్నాలజీ నమోదు చేస్తుంది. రైతు షాపు కెళ్లినప్పుడు బ్యాచ్ నెంబర్ చెక్ చేసుకుంటే చాలు నాణ్యతా సర్టిఫికెట్ ఉందో లేదో తెలిసిపోతుంది. శాంపిల్స్‌కు టెస్టింగ్ జరిగిందో లేదో కూడా ట్రాక్ చేసుకోవచ్చు.
జిల్లా ల్యాబ్‌లో గ్రో అవుట్ టెస్టింగ్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు. ఇక్కడ మొక్కల జనటిక్ ఫ్యూరిటీ టెస్టింగ్ కూడా చేస్తారు. నాలుగు కేటగీరిల్లో సేకరించిన నమూనాలను పరీక్షిస్తారు. రైతులు తెచ్చే నమూనాలకు ఎలాంటి రుసుము వసూలు చేయరు. ల్యాబ్‌లో విధులు నిర్వహించే ఏవోలు, ఎఈవోలు, ఏడీలకు జాతీయ ఇన్‌స్టిట్యూట్‌ల ద్వారా అత్యాధునిక శిక్షణ ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్‌ను సమీప ఆర్బీకేలతో అనుసంధానిస్తున్నారు. ఇన్‌పుట్స్ పరీక్షించుకునేలా రైతులను ప్రోత్సహించేలా ఆర్బీకే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
ధైర్యంగా వాడా...
గత సీజన్‌లో వాడగా మిగిలిన ఎరువుల నాణ్యతపై అనుమానం రావడంతో అగ్రీ ల్యాబ్‌లో పరీక్షించుకున్నా. నాణ్యత బాగుందని నిర్ధారణ కావడంతో ఎలాంటి సందేహం లేకుండా ధైర్యంగా వాడా. రైతులకు చేరువలో ఇంత అద్భుతమైన సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వానికి రైతులు రుణపడి ఉంటారు. సీఎం సార్‌కు కృతజ్ఞతలు
–తమ్మా వెంకటరెడ్డి, పామర్రు, కృష్ణా జిల్లా
నమ్మకం పెరిగింది
ఖరీఫ్‌లో ఎంటీయూ 1064 రకం సాగు చేసా. విత్తనాన్ని నర్సీపట్నం ల్యాబ్‌లో పరీక్షించి నాణ్యమైనదని నిర్థారించడంతో ధైర్యంగా సాగుచేయగలిగా. ఈ ల్యాబ్స్ వల్ల ఇన్‌పుట్స్ విషయంలో రైతులకు నమ్మకం పెరిగింది. ప్రభుత్వం మంచి పని చేసింది.
–రెడ్డి రామరాజు, సుబ్బరాయుడుపాలెం, విశాఖ జిల్లా
మొలకెత్తడమే అదృష్టంగా ఉండేది...
ఎన్‌ఎల్‌ఆర్ 34449 వరి విత్తనాన్ని ఆత్మకూర్ ల్యాబ్‌లో పరీక్షించుకున్నా. నాణ్యత బాగుందని రిపోర్టు వచ్చింది. గతంలో ఇలాంటి సౌకర్యం లేదు. మార్కెట్‌లో కొన్న విత్తనం ఎలా ఉన్నా విత్తుకోవల్సిందే. అదృష్టం బాగుంటే మొలకెత్తుతాయి. లేకుంటే లేదు అన్నట్టుగా ఉండేది. ల్యాబ్‌లు ఏర్పాటు చేసిన తర్వాత పైసా ఖర్చు లేకుండా పరీక్షించుకునే సౌకర్యం అందుబాటులోకి రావడం వల్ల రైతులకు మేలు జరుగుతోంది.
–షేక్ ఖాదర్ బాషా, ఆత్మకూర్, నెల్లూరు జిల్లా
ఎంతో ఉపయోగం..
మినుము విత్తనాన్ని (ఎన్‌ఆర్‌ఐ–బీ002) ఆళ్లగడ్డ ల్యాబ్‌లో పరీక్షించి చూసుకున్నా. బాగా మొలకెత్తుతుందని నిర్ధారణ కావడంతో విత్తుకున్నా. పంట బాగుంది. చాలా ఆనందంగా ఉంది. ఈ ల్యాబ్‌లు రైతులకెంతో ఉపయోగం.
–ఎన్ వెంకటేశ్వర్లు, రుద్రవరం, కర్నూలు జిల్లా
జవాబుదారీతనం.. నాణ్యమైన ఇన్‌పుట్స్
వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ సేవలు 2021 ఖరీఫ్ సీజన్ నుంచి అందుబాటులోకి వచ్చాయి. కంపెనీలు, అమ్మకందారుల్లో జవాబుదారీతనంతో పాటు రైతులకు నాణ్యమైన ఇన్‌పుట్స్‌ను అందుబాటులోకి తీసుకు రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
– హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ
నకిలీల మాటే ఉండదు..
ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇక మార్కెట్‌లో నకిలీలు, నాసిరకం అనే మాట వినపడదు. ఏ ఇన్‌పుట్ అయినా దర్జాగా వినియోగించుకునే దైర్యం వస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచలనలకు అనుగుణంగా దేశంలో ఎక్కడా లేని విధంగా వీటిని తీసుకొచ్చాం.
–పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ
శాశ్వత వ్యవస్థ.. సీఎం సంకల్పం
రైతులకు నాణ్యమైన ఇ¯న్‌పుట్స్ ఇవ్వడానికి శాశ్వతంగా ఓ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం. ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లను తీసుకొచ్చాం. నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ల్యాబ్స్‌తో పాటు నాలుగు రీజనల్ కోడింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఆర్బీకేలో కూడా టెస్టింగ్ కిట్స్ పెట్టాం. ఈ వ్యవస్థ పూర్తి స్థాయిల్లో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను టెస్టింగ్ చేయకుండా అమ్మకాలకు అనుమతించం.
–కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి
ముందు జాగ్రత్తతో..
కృష్ణా జిల్లా పామర్రు మండలం జుజ్జువరం రైతు జన్ను నాగ ఫణీంద్ర ఐదెకరాల్లో కూరగాయలు పండిస్తుంటారు. విత్తనం మొలకెత్తి పూత, పిందె దశలు దాటి కాపుకొచ్చేదాకా దేవుడినే నమ్ముకునేవాడు. నాసిరకం విత్తనాల వల్ల ఒక్కోసారి మొలక కూడా వచ్చేవి కాదు. మొలకెత్తినా దిగుబడి చూశాక దిగాలు తప్పదు. ఆయనకు ఇప్పుడా అవస్థలు లేవు. వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రీ ల్యాబ్స్ ద్వారా విత్తనాల నాణ్యతను ఉచితంగా పరీక్షించుకుని నమ్మకంగా కూరగాయలు పండిస్తున్నాడు. ఆయన సొంతంగా తయారు చేసుకున్న కూరగాయ విత్తనాలను పామర్రులోని అగ్రి ల్యాబ్‌లో పరీక్షించగా బీర విత్తనాల్లో మొలక శాతం (జర్మినేషన్) ఏమాత్రం లేదని నిర్ధారణ కావడంతో వాటిని వదిలేసి నాణ్యమైన బీర రకాలను ఎంచుకున్నాడు.
బెండ విత్తనంలో 88 శాతం మొలక సామర్థ్యం ఉన్నట్లు తేలడంతో ధీమాగా సాగు చేశాడు. మొలక శాతం లేని బీర విత్తనాలను సాగుచేసి ఉంటే రూ.15 వేల పెట్టుబడితో పాటు కనీసం 20–25 క్వింటాళ్ల దిగుబడి కోల్పోవడం ద్వారా రూ.30–40 వేల ఆదాయాన్ని నష్టపోయే వాడినని చెప్పారు. సీజన్‌లో విలువైన 20 రోజుల సమయాన్ని కోల్పోవాల్సి వచ్చేదని నాగఫణీంద్ర ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. ల్యాబ్‌లో నాణ్యతను పరీక్షించుకోవడం వల్ల ముందు జాగ్రత్తతో విత్తనాన్ని మార్చుకుని పంట కాపాడుకోగలిగానని సంతృప్తిగా చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment