సాక్షి, చెన్నై : తమిళనాడులోని కన్యాకుమారిలో వివేకానంద ట్రస్ట్ సహకారంతో ఇక మీదట పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. వైవీ దంపతులు బుధవారం కన్యాకుమారిలోని శ్రీవారి ఆలయం ద్వితీయ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. అర్చకులు శాస్త్రోక్తంగా పుణ్యాహవచనం ఇతర వైదిక క్రతువులు నిర్వహించారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కోవిడ్ కారణంగా కన్యాకుమారిలో ధార్మిక కార్యక్రమాలకు అవరోధం ఏర్పడిందన్నారు. వివేకానంద ట్రస్ట్ టీటీడీకి చట్ట పరంగా భూమి అప్పగిస్తే కళ్యాణ మండపం నిర్మాణం ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.
భక్తుల కోరిక మేరకు కన్యాకుమారి ఆలయం ఆవరణంలో గరుడాళ్వార్ విగ్రహం ఏర్పాటు చేసే విషయం ఆగమ పండితులతో మాట్లాడి, రానున్న బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ముగిశాక తిరుమలకు గతంలో సాధారణ రోజుల్లో ఎంత సంఖ్యలో భక్తులను అనుమతించేవారో అంత సంఖ్య పెంచుతామని చైర్మన్ తెలిపారు. ఆలయానికి రోడ్డు నిర్మాణం కూడా చేపడతామని తెలిపారు. టీటీడీ పాలకమండలి సభ్యులు శేఖర్ రెడ్డి, డాక్టర్ నిశ్చిత అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment