
పెద్దమండ్యం : గాయపడిన అక్కులప్ప, వెంకటప్ప, వెంకటరమణ
మదనపల్లె : వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పెద్దమండ్యం మండలం బండమీదపల్లెకు చెందిన మల్లికార్జున(38), రమణమ్మ(33) దంపతులు శుక్రవారం సొంత పనులపై ద్విచక్ర వాహనంలో పెద్దమండ్యంకు వెళ్లారు. అక్కడి నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా దారిలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పీటీఎం మండలం కాట్నగల్లుకు చెందిన చెన్నకేశవులు(50) ప్యాసింజర్ ఆటోలో మదనపల్లెకు వస్తూ, దారిలో పట్టుతప్పి కిందపడ్డాడు. ఆయన తీవ్రంగా గాయపడటంతో స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న పాల వాహనం
పెద్దమండ్యం: ద్విచక్ర వాహనాన్ని పాల వాహనం ఢీకొనడంతో ముగ్గురు భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా గాయపడిన సంఘటన పెద్దమండ్యం మండలంలో జరిగింది. పాపేపల్లి పంచాయతీ వెలిగింటివారిపల్లెకు చెందిన ఓ.అక్కులప్ప(52), ఎం.వెంకటయ్య(60), ఆర్.వెంకటరమణ(50) భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం పనుల అనంతరం ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంలో పాపేపల్లెకు బయలుదేరారు. మార్గంమధ్యలో పెద్దమండ్యం పోలీస్‌స్టేషన్ వద్ద ఎదురుగా వచ్చిన జెర్సీ ప్రైవేట్ డెయిరీ పాల వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా గమనించిన స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో అక్కులప్ప పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు.