మదనపల్లె సిటీ : రక్తం ఎంత విలువైందో అందరికీ తెలిసిందే. ఒక యూనిట్ రక్తంతో ఒకరి ప్రాణాలే కాపాడొచ్చు. అత్యవసర సమయంలోనే కాదు... పలువురు వ్యాధిగ్రస్తులకు పక్షం రోజులకోసారి రక్తం ఎక్కించాల్సిందే. లేకపోతే వారి ప్రాణాలకే ప్రమాదం. కరోనా సమయంలో తలసేమియా, సికల్‌సెల్ వ్యాధిగ్రస్తులు, గర్భిణులకు ఒక యూనిట్ దొరకడం ఎంత కష్టంగా మారిందో చూశాం. ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతి మూడు, ఆరు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చుని వైద్యనిపుణులు చెబుతూనే ఉన్నారు. అయినా చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. రక్తమిస్తే అనారోగ్యం పాలవుతామని అపోహ పడుతున్నారు. దీంతో రక్తనిల్వల కొరత ఎప్పుడూ ఏర్పడుతూనే ఉంది. బ్లడ్‌బ్యాంకు నిర్వాహకులు శిబిరాల నిర్వహణ, దాతల కోసం తరచూ పలు సంస్థలను కోరుతూనే ఉన్నారు. అయినా స్పందన అంతంత మాత్రమే లభిస్తోంది. కొంత మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి వారు పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. బుధవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
ఇవ్వడమే కాదు.. ఇప్పిస్తారు
రక్తం ఇవ్వడమే కాదు. అవగాహన కల్పించి ఇతరులతో ఇప్పించడం కూడా గొప్ప విషయమే. ఈ విషయంలో రెండో కోవకు చెందుతారు అబూబకర్‌సిద్దిక్. మదనపల్లె పట్టణంలో హెల్పింగ్‌మైండ్స్ సంస్థను ఏర్పాటు చేశారు. తరచూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తారు. అంతే కాకుండా అత్యవసర సమయంలో ఎవరైనా ఫోన్ చేస్తే వారికి రక్తం ఇస్తారు. ఇప్పటి రకు 38 సార్లు రక్తదానం చేశారు. సంస్థ తరఫున పదేళ్లలో సుమారు 18 వేల మందితో రక్తదానం చేయించారు.
చిరు వ్యాపారి.. రక్తదానంలో మేటి
మదనపల్లె పట్టణానికి చెందిన హర్షద్‌అలీ చిరు వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. స్నేహితుడు అనారోగ్యం పాలవడంతో ఓ గ్రూపు రక్తం అవసరం కావడంతో దొరకపోవడం వల్ల ఇబ్బందులు పడ్డాడు. అప్పటి నుంచి రక్తంతో ఎవరూ ఇబ్బందులు పడకూడదని రక్తదానం చేస్తున్నారు. ఇప్పటి వరకు 44 సార్లు రక్తదానం చేశారు.
ఆపద వస్తే .. వాలిపోతాడు
స్వర్ణకారుడిగా పని చేస్తూ స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నాడు మదనపల్లె పట్టణానికి చెందిన ఢంకనాచారి. ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసే తృప్తిలో ఎక్కడా ఉండదని నమ్మిన యువకుడు. బ్లడ్ బ్యాంకులో తన ఫోన్ నంబర్ ఇచ్చాడు. అత్యవసరమైతే ఫోన్ చేస్తే చాలు రక్తదానం చేస్తున్నాడు. ఇప్పటి వరకు 45 సార్లు రక్తదానం చేసి అందరి మన్ననలు పొందాడు.
చదువుకుంటూ.. రక్తదాతగా
మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన పుష్ప తిరుపతిలో ఫుడ్ టెక్నాలజీ కోర్సు చదువుతోంది. రక్తదానం చేయడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చునని తెలుసుకుంది. ఎవరికికై నా ఆపద వస్తే చాలు రక్తదానం చేస్తుంది. ఇప్పటి వరకు ఆరు సార్లు రక్తదానం చేసింది. రక్తదానం చేయడమే కాకుండా సహ విద్యార్థినులకు రక్తదానం గురించి అవగాహన కల్పిస్తుంది.
స్ఫూర్తి ప్రదాత శివాజీ
డిగ్రీ చదువుతూ రక్తదానం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన శివాజి. వివేకా ఆశయ ఫౌండేషన్ తరచూ నిర్వహించే రక్తదాన శిబిరాలు ఏర్పాటులో సహాయ, సహకారాలు అందిస్తున్నాడు. ఇప్పటి వరకు 11 సార్లు రక్తదానం చేశారు. రక్తదానం గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చూస్తూ..
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన శివ. ఉద్యోగం చేస్తూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తే స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు సార్లు రక్తదానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment