అప్పటి అఘోరాల ఆవాసం.. లంకమల | - | Sakshi
Sakshi News home page

అప్పటి అఘోరాల ఆవాసం.. లంకమల

Published Fri, Jan 31 2025 1:11 AM | Last Updated on Fri, Jan 31 2025 1:11 AM

అప్పటి అఘోరాల ఆవాసం.. లంకమల

అప్పటి అఘోరాల ఆవాసం.. లంకమల

బి.కొత్తకోట : ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వేల సంఖ్యలో అఘోరాలు వస్తున్నారు. ప్రతి కుంభమేళాకు పెద్ద సంఖ్యలో వచ్చే ఈ అఘోరాలు హిమాలయాల్లో ఉంటారని చెబుతుంటారు. అయితే, 4–14 శతాబ్దాల మధ్య అఘోరాలు ఆంధ్రప్రదేశ్‌లోనూ మనుగడ సాగించినట్లు పురాత త్వ శాఖ చెబుతోంది. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటంలోని లంకమల అభయారణ్యం బ్రాహ్మీ లిపి కాలంలో అఘోరాలకు ఆవాసమని ఆ శాఖ నిర్ధారించింది. ఇక్కడ లభించిన వివిధ శతాబ్దాలకు చెందిన లిపి, భాష, బండలపై చెక్కిన పాదాల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చింది. దీన్నిబట్టి చూస్తే లంకమల అభయారణ్యంలో ఇప్ప టి వరకు వెలుగుచూడని రహస్యాలు దాగి ఉన్నా యని చెబుతున్నారు. ఇక్కడ అఘోరాలు భయంకరమైన ఆకారాలతో ఉండేవారని, శివుడిని ఆరాధిస్తూ గుహల్లో నివాసం ఉండేవారనడానికి చారిత్రక ఆధారాలు లభ్యమయ్యాయి. వారు శైవం వ్యాప్తికి పాటుపడినట్టుగా ఈ ఆధారాలు చెబుతున్నాయి. అటవీశాఖ సిద్ధవటం రేంజర్‌ కళావతి అడవిలో తిరుగుతున్న సమయాల్లో కనిపించిన వీటిని ఫొటోలు తీయడంతో ఈ చరిత్ర వెలుగులోకి వచ్చింది.

బండలపై శివుడి పాదాలను చెక్కి..

సిద్ధవటానికి 4 కిలోమీటర్ల దూరంలోని వెలుగుపల్లి, జంగాలపల్లి అటవీ ప్రాంతంలో బండలపై పాదాలు, పక్కనే శంఖు లిపిలో చెక్కిన అక్షరాలు ఉన్నాయి. వీటి ఆధారంగా అఘోరాలు ఇక్కడ శివుడిని ఆరాధించే వారని వెల్లడైంది. బండరాయిపై పాదాలను పలుచోట్ల చెక్కారు. ఒక బండపై చెక్కిన పాదాలకు వేళ్లు కూడా ఉన్నాయి. మిగతా వాటికి ఇలా లేవు. ఇదే అటవీ ప్రాంతంలో ఓ శివాలయం కూడా ఉండేదని భావిస్తున్నారు. బుద్ధుడు, మహావీరుని పాదాలను చెక్కిన విధంగానే లంకమలలో అఘోరాలు కూడా బండలపై శివుడి పాదాలను చెక్కి పూజించేవాళ్లని భావిస్తున్నారు. ఇందుకు గుర్తుగా సంస్కృత భాష–నాగర లిపి కలిపి ఓ చోట బండపై ‘శ్రీ విశిష్ట కంకణధారి’ అనే నామం రాసి ఉంది. శివుడ్ని పిలుచుకునే పేర్లలో ఇదొకటని గుర్తించారు. సంస్కృతంలో చెక్కిన ఈ అక్షరాలను బట్టి శ్రీ అనేది గౌరవసూచకం, విశిష్ట అంటే ప్రత్యేకమైనది అని అర్థం. కంకణ అంటే కంకణం లేదా మణికట్టు, ధారి అంటే ధరించిన వాడు లేదా పట్టుకున్న వాడు అని అర్థం. శివుడి చేతిలో శూలం ఉంటుంది కనుక ఈ అర్థం వచ్చేలా కంకణధారి అని చెక్కి ఉండొచ్చని చెబుతున్నారు. కంకణధారి అనేది శివుడికి సంబంధించిన లక్షణంగా చెబుతారు. కనుక శ్రీ విశిష్ట కంకణధారి అనే పేరు శివుడిని సూచించేదేనని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిపై సమగ్ర అధ్యయనం చేస్తే లంకమల అభయారణ్యంలో దాగిన ఎన్నో రహస్యలు వెలుగులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.

4–14 శతాబ్దాల మధ్య మనుగడ సాగించారు

బండలపై శివుడి పాదాలు చెక్కి పూజలు

అభయారణ్యంలో శివాలయం, గుహలు

శతాబ్దాలు గడిచినా చెరిగిపోని గుర్తులు

అటవీ శాఖ రేంజర్‌ తీసిన చిత్రాలతో వెలుగులోకి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement