చేప పిల్లలు విడుదల | - | Sakshi
Sakshi News home page

చేప పిల్లలు విడుదల

Published Fri, Jan 31 2025 1:12 AM | Last Updated on Fri, Jan 31 2025 1:12 AM

చేప పిల్లలు విడుదల

చేప పిల్లలు విడుదల

నందలూరు : మండలంలోని కోనాపురం సోమశిల వెనుకజలాల్లోకి 15.80 లక్షల చేప పిల్లలు విడుదల చేశారు. మదన మోహనపురం గ్రామ సర్పంచ్‌ చుక్క నిర్మల, చుక్క యానాది, ఉప సర్పంచ్‌ పుల్లయ్యల చేతులు మీదుగా గురువారం ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మత్స్యశాఖాధికారి సుస్మిత, అధికారులు వెంకటరమణ, రామమోహన్‌ పాల్గొన్నారు.

చీడపీడల నిఘా వ్యవస్థపై అవగాహన ఉండాలి

కేవీపల్లె : జాతీయ చీడపీడల నిఘా వ్యవస్థ యాప్‌పై రైతులు అవగాహన ఉండాలని జిల్లా వ్యవసాయాధికారి చంద్రానాయక్‌ అన్నారు. గురువారం మండలంలోని మహల్‌రాజుపల్లె పంచాయితీ హిస్సాపల్లెలో ఉలవపంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలను చీడపీడలు ఆశించిన సమయంలో నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. పీలేరు ఏడీఏ వై.వి.రమణరావు, వ్యవసాయాధికారిణి శ్రావణి, వ్యవసాయ విస్తరణాధికారులు ఇంద్రసేనారెడ్డి, అనితాదేవి పాల్గొన్నారు.

ఒంటిమిట్టకు చేరిన లడ్డూలు

ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయానికి గురువారం తిరుమల శ్రీవారి లడ్డూలు చేరాయి. తిరుమల నుంచి ప్రత్యేక వాహనంలో 2 వేల లడ్డూలు వచ్చాయి. గతంలో రెండు, నాలుగో శనివారాల్లో ఇచ్చే లడ్డూలు గత కొన్ని నెలలుగా ప్రతిరోజూ ఇస్తున్నారు.

3న వేలం పాట

రాజంపేట టౌన్‌ : పవిత్ర పుణ్యక్షేత్రం హత్యరాలలో టెంకాయలను విక్రయించుకునేందుకు ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 11 గంటలకు త్రేతేశ్వర స్వామి ఆలయ ఆవరణలో బహిరంగ వేలంపాటను నిర్వహించనున్నట్లు సమూహ దేవస్థానాల కార్యనిర్వహణాధికారి గంగవరం కొండారెడ్డి గురువారం తెలిపారు. వేలంపాటలో పాల్గొనే ప్రతి ఒక్కరు ధరావత్తు కింద రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వేలంపాట దక్కించుకున్న వారు ఒక్కో టెంకాయను రూ. 50కి మాత్రమే విక్రయించాలన్నారు. దేవస్థానానికి బకాయిలు ఉన్నవారు, వాజ్యం ఉన్నవారు, మైనర్లు, హిందూయేతరులు వేలంపాటలో పాల్గొనేందుకు అనర్హులన్నారు. వేలంపాటను దక్కించుకున్న వారు ఈఏడాది ఫిబ్రవరి 3వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు మాత్రమే హత్యరాలలోని త్రేతేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతంలో టెంకాయలను విక్రయించుకోవచ్చని తెలిపారు.

కేజీబీవీ ఎస్‌వోకు

షోకాజు నోటీస్‌ జారీ

పెద్దమండ్యం : మండలంలోని శిద్దవరం కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) లో పురుగుల అన్నం... నీళ్ల సాంబారు.. విద్యార్థుతో బాతురూంల శుభ్రం చేయిస్తున్న ఫోటోలు సామాజిక మాధ్యమాలలో బుధవారం వైరల్‌ ఆయ్యాయి. ఈ ఫోటోలు జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యంకు చేరడంతో కేజీబీవీ ఎస్‌వో రాణికుమారికి షోకాజు నోటీసు జారీ చేశారు. డీఈవో ఆదేశాల మేరకు గురువారం ఇద్దరు ఎంఈవోలు, క్లస్టర్‌ హెచ్‌ఎం, మరో మహిళా హెచ్‌ఎం, ఉపాధ్యాయురాలు కేజీబీవీలో విచారణ నిర్వహించారు. ప్రతి తరగతిలో ఉన్న విద్యార్థినులను విచారించి వివరాలను సేకరించారు.ఇవి పాత ఫొటోలని బాతురూంలు శుభ్రం చేస్తూ ఫొటోలో ఉన్న ఇద్దరు విద్యార్థులు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. కాగా కెజిబివిలో ఎప్పుడు, ఎవరు ఫోటోలు తీశారనేది తెలియరాలేదు. విచారణలో సేకరించిన వివరాలను డీఈవోకు నివేదిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఎంఈవోలు మనోహర, జి. రామక్రిష్ణ, క్లస్టర్‌ హెచ్‌ఎం కె రామచంద్ర, ఉర్దూ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం రషీదాబాను, ఉపాధ్యాయురాలు జి సుగుణ పాల్గొన్నారు.

ఏసీబీకి చిక్కిన ఎస్‌ఐ

– సీఐ ప్రమేయం కూడా..

రామసముద్రం : ఓ లారీ యజమాని నుంచి లంచం తీసుకుంటూ రామసముద్రం ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రం మండలం వనగానిపల్లె సమీపంలోని ఏటవాకిలి క్రాస్‌ వద్ద లారీ ఢీకొని ఇద్దరు మృతిచెందారు. దీనికి సంబంధించి సూళ్లూరుపేటకు చెందిన లారీ ఓనర్‌ మనోజ్‌ను ఎస్‌ఐ లంచం డిమాండ్‌ చేశారు. దీంతో లారీ యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రామసముద్రం పెట్రోల్‌బంక్‌ వద్ద లారీ యజమాని నుంచి ఎస్‌ఐ రూ.70వేలు లంచం తీసుకుంటుండగా, ఏఎస్పీ విమలకుమారి, ఏసీబీ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకున్నారు. ఎస్‌ఐను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.లంచం తీసుకున్న విషయంలో మదనపల్లె సీఐ రమేష్‌కు ప్రమేయమున్నట్లు విచారణలో తేలిందని ఏఎస్పీ విమలకుమారి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement