
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
మాకూ ఓ గూడు దొరికింది
రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు మావి.నేను, మా ఆయన రోజూ కూలిపనికెళ్తేనే పూట గడిచేది. రోజూ పనులు ఉండేవి కాదు. అప్పుడప్పుడు దొరికే పనులతోనే కాలం వెళ్లదీసేవాళ్లం. ఇంటి అద్దె చెల్లించాలన్నా నానా అగచాట్లు పడేవాళ్లం. ఒక్కోసారి ఇంటి యజమాని చేత మాటలు పడాల్సి వచ్చేది. ఈ పరిస్థితిలో సొంత ఇల్లు అనే ఆలోచన కలలో కూడా ఊహించలేకపోయేవాళ్లం.
ఈ ప్రభుత్వం వచ్చాక పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తారని, దానికోసం దరఖాస్తు చేసుకోవాలని మా వలంటీర్ చెప్పారు. అన్నీ దగ్గరుండి చేయించాడు. ఏ నాయకుని వద్దకు వెళ్లకుండానే మాకు వైఎస్సార్ జగనన్న లే అవుట్‌లో లక్షలాది రూపాయల విలువైన స్థలం ఉచితంగా ఇచ్చారు. ఇంటి కోసం లక్షా 80 వేల రూపాయలు మంజూరు చేశారు. రాయితీపై నిర్మాణ సామగ్రిని సమకూర్చారు. ప్రభుత్వం సాయంతో సొంతిల్లు కట్టుకున్నాం. మా ఆయనకు వృద్ధాప్య పింఛన్, నాకు అభయహస్తం పింఛన్ వస్తోంది. ఇన్నాళ్లకు సొంతింటిలో ఉండడం చాలా ఆనందంగా ఉంది. – బోడసింగి సీత, బోడసింగిపేట, బొండపల్లి మండలం, విజయనగరం జిల్లా (ఆదాడ గోవిందరావు, విలేకరి, బొండపల్లి)
రైతు కష్టాలు తెలిసిన ప్రభుత్వమిది
చిన్న, సన్నకారు రైతులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందిస్తున్న సాయం ఎంతో ఉపయోగకరంగా ఉంది. గతంలో ఏనాడు పెట్టుబడి సాయం రాలేదు. పంట నష్టపరిహారం ఆలస్యంగా అందేది. పావలా వడ్డీ పేరుకే ఉండేది. వాటిని తీసుకోవడానికి పైరవీలు చేయాల్సి వచ్చేది. నేడు రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులను ఆదుకుంటున్నారు. పంట నష్టపోతే బీమా సకాలంలో అందిస్తున్నారు. ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. నాలుగేళ్లుగా విడతల వారీగా ఏడాదికి రూ.13,500 చొప్పున ఇప్పటి వరకూ రూ.40 వేలకుపైగా అందుకున్నా.
ఎరువులు, పురుగు మందుల కొరత లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా సకాలంలో అందేవిధంగా సర్కారు చేసిన ఏర్పాటు రైతుల మన్ననలు అందుకుంటోంది. రైతుగా ఆన్‌లైన్‌లో నమోదై ఉంటే చాలు సాయం దానంతట అదే వస్తోంది. విడతల వారీగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తుండడంతో సాగుకు పెట్టుబడిగా వినియోగించుకుంటున్నా. పడుతుందో లేదోననే భయం లేదు. ఇచ్చిన మాట ప్రకారం జమ చేస్తారన్న నమ్మకం ఏర్పడింది. దీంతో పెట్టుబడి అవసరమైనపుడు నేరుగా బ్యాంకుకు వెళ్లి విత్ డ్రా చేసుకుంటున్నాం. నాది పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కొడమంచిలి గ్రామం. రైతు కష్టాలు తెలిసిన ప్రభుత్వం ఇది. – జక్కంశెట్టి సూర్యనారాయణ, కొడమంచిలి (గుర్రాల శ్రీనివాసరావు, విలేకరి, ఆచంట)
నాకు ఉద్యోగం వచ్చింది..
నేను ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో అమలాపురం మండలం భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో గత సంవత్సరం ఇంజినీరింగ్ పూర్తి చేశాను. మాది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రు గ్రామం. మా నాన్న మా ఊళ్లోనే మెడికల్ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అమ్మ గృహిణి. చెల్లి, తమ్ముడు కూడా ఇప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోనే ఇంజనీరింగ్ చదువుతున్నారు.
మా నాన్నకు పైసా ఖర్చు లేకుండా చదివించే అవకాశం కలిగింది. మా ముగ్గుర్ని సొంత డబ్బులతో రూ.వేలల్లో ఫీజులు పోసి చదివించాలంటే మా నాన్నకు సాధ్యమయ్యేపని కాదు. ఈ ప్రభుత్వం వల్లే మమ్మల్ని పెద్ద చదువులు చదివించగలుగుతున్నారు. నా చదువు పూర్తయ్యాక కళాశాల క్యాంపస్ ఇంటర్వ్యూలో ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించాను. నేను ఇప్పుడు రూ.4.50 లక్షల ప్యాకేజీతో బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నానంటే అది ఈ ప్రభుత్వం పుణ్యమే. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాన్ని యువత ప్రశంసిస్తోంది. – పెమ్మిరెడ్డి శ్రీ తులసీ చంద్ర లిఖిత, కేశనకుర్రు (పరస సుబ్బారావు, విలేకరి, ఐ.పోలవరం)