
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
మనో నేత్రంతో చూస్తున్నా..
ప్రసవ సమయంలో దురదృష్టం నన్ను వెంటాడింది. ఎందుకో ఏమో తెలియదు గానీ, ఉన్నట్లుండి ఒక కన్ను చూపు కోల్పోయింది. ఒక కన్ను ఉందిలే.. పర్వాలేదు.. దానితో సరిపెట్టుకుందామనుకున్నా. నా దరిద్రం కొద్దీ కొన్నాళ్ల తర్వాత ఆ కన్నూ పోయింది. కర్నూలు జిల్లా హోళగుందలోని పెద్ద మసీదు వీధిలో నేను ఉంటున్నా. నా భర్త మహేశ్. మాకో కూతురు. నాకు కంటి చూపు పోగానే నా భర్త వదిలేశాడు. గతిలేక పుట్టింటికి వచ్చాను.
మా అమ్మ బాగానే చూసుకుంది. కానీ, దేవుడు మళ్లీ నా మీద పగ పట్టాడేమో.. నాకు ఉన్న ఏకైక దిక్కు మా అమ్మను కూడా అందని లోకాలకు తీసుకుపోయాడు. ఇప్పడు నేను, నా కూతురు.. ఒకరికి ఒకరం తోడుగా మిగిలాము. ఇద్దరు సోదరులున్నా, వారి బతుకులు వారివి. రూపాయి ఆదాయం లేదు.. ఎలా బతకాలి? చచ్చిపోతే మేలనుకున్నా. ‘తల్లివైన నీవే కుంగిపోతే నీ కూతురు ఐశ్వర్య పరిస్థితి ఏంటి? కూతురు కోసం నువ్వు కష్టాలకు ఎదురీది బతకాలి’ అని చుట్టుపక్కల వాళ్లు ధైర్యం నూరిపోశారు. అదే సమయంలో జగనన్న రూపంలో నా కుటుంబానికి పెద్ద దన్ను దొరికింది.
పిల్లలను చదివిస్తే డబ్బులిస్తారని చెప్పారు. నా గారాలపట్టి ఐశ్వర్యను ఊర్లోని బడిలో వేశా. ఇప్పుడు ఆరో తరగతి చదువుతోంది. అమ్మ ఒడి కింద ఏటా 15,000 రూపాయలు ఆరి్థక తోడ్పాటు లభిస్తోంది. వికలాంగ పింఛన్ కింద ప్రతి నెలా రూ.3 వేల పింఛను వస్తోంది. సరిగ్గా 1వ తేదీన వలంటీరే మా ఇంటి వద్దకు తెచ్చి ఇస్తున్నారు. ఐశ్వర్యకు పాఠశాలలోనే మధ్యాహ్నం మంచి భోజనం పెడుతున్నారు. పాఠశాల కూడా చాలా బాగుంటుందని మా పిల్లతో పాటు ఆమె స్నేహితులు చెప్పారు. ఈ ప్రభుత్వం రంగులు వేయించి, కొత్త కురీ్చలు, టేబుళ్లు సమకూర్చిందని తెలిపారు. వాటిని నా మనోనేత్రంతో చూస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. – కె.మహంకాళమ్మ, హోళగుంద, కర్నూలు జిల్లా (గవిని శ్రీనివాసులు, విలేకరి, కర్నూలు)
కళ్యాణమస్తుతో పెళ్లి జరిపించాం..
అమ్మాయికి పెళ్లీడు వచ్చింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఏం చేయాలో పాలుపోలేదు. దేవుడిపైనే భారం వేశాం. ఆ సమయంలో కళ్యాణమస్తు పథకం మాకు తోడుగా నిలిచింది. మాది బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేటలోని విజయనగర్ కాలనీ. నా భర్త సత్యాల మరిదాసు రోజూ బేల్దారి పనులు చేసి తీసుకొచ్చిన కూలి డబ్బులతోనే జీవనం సాగిస్తున్నాం.
ఒక్కోసారి పనులు దొరక్క ఇంట్లోనే ఉండేవారు. అప్పుడప్పుడు పనులకు వెళ్లేవాడు. ఆ వచ్చే డబ్బులు మా జీవనానికి సరిపోయేవి కావు. మాకు ఇద్దరు పిల్లలు. ఆయన తెచ్చే డబ్బులతో పెద్ద చదువులు చెప్పించలేక ఇబ్బంది పడ్డాం. ఆ సమయంలో అమ్మ ఒడి పథకం భరోసా ఇచ్చింది. పాపను ఇంటర్ వరకు చదివించాను. మంచి సంబంధం రావడంతో పెళ్లి చేయాలని భావించాం.
అప్పడు వైఎస్సార్ కళ్యాణమస్తు పథకంతో మాకు ధైర్యం వచ్చింది. వలంటీర్ సహాయంతో గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేష చేశాం. వెంటనే ప్రభుత్వం మాకు రూ. లక్ష మంజూరు చేసింది. పెళ్లికి చేసిన అప్పులను ఆ డబ్బులతో తీర్చేశాం. అసలు ఈ పథకమే లేకపోయింటే పెళ్లి ఎలా జరిపించేవాళ్లమో ఊహించుకుంటేనే భయమేస్తోంది. – సత్యాల పుష్పలీల, దేశాయిపేట (దగ్గుమాటి శ్రీధర్ రెడ్డి, విలేకరి, వేటపాలెం)
ఎవరి సిఫారసు లేకుండా పింఛన్
మా ఆయన చనిపోయి దాదాపు 14 ఏళ్లయింది. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాను. ఎంతో కష్టపడి ముగ్గురు పిల్లలను పెంచి పోషించాను. నానా తంటాలు పడి వారి పెళ్లిళ్లు చేశాను. వితంతు పింఛన్‌కు అన్ని అర్హతలూ ఉన్నా, గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. అప్పట్లో టీడీపీ నాయకులు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాను. జన్మభూమి కమిటీ సభ్యుల ఇళ్లకు వెళ్లి వారిని అభ్యర్థిచాను.
అయినా వారు ఏమాత్రం కనికరం చూపలేదు. విసిగిపోయాను. నాకు ఇక పింఛన్ రాదు అనుకున్న సమయంలో ఈ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థ కొత్త దారి చూపించింది. మా ప్రాంత వలంటీర్ మా ఇంటికి వచ్చి, నాతో దరఖాస్తు చేయించింది. వెంటనే అధికారులు మా ఇంటికి వచ్చి విచారణ చేపట్టి పింఛన్ మంజూరు చేశారు. రెండున్నరేళ్ల నుంచి ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లారేసరికి పింఛన్ అందుతోంది. వితంతు పింఛన్ రూ.2,750, అభయ హస్తం పింఛన్ మరో రూ.500 అందుతుండటంతో నా బతుక్కు భరోసా దక్కింది. నా జీవనానికి ఎలాంటి ఇబ్బందీ లేదు. – కోటి ఈశ్వరమ్మ, సీతాపురం, వజ్రపుకొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా (కుసుమూరి చలపతిరావు, విలేకరి, వజ్రపుకొత్తూరు)