
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
జగనన్న పాల వెల్లువ జీవితాన్నిచ్చింది
గుంటూరు జిల్లా క్రోసూరులో ఇద్దరు పిల్లలు సాయిభార్గవి, స్నేహశ్రీతో కలసి అద్దె ఇంట్లో జీవిస్తున్నాం. పెద్దమ్మాయి ఇంటర్, చిన్నమ్మాయి ఎనిమిదో తరగతి చదువుతున్నారు. మా కుటుంబ పోషణ కోసం మా కన్నవారు రెండు గేదెలు కొనుగోలు చేసి ఇచ్చారు. గతంలో నేను ప్రైవేట్ డెయిరీలో పాలు పోసేదానిని. వారు లెక్కల్లో తేడా చేయడమే కాకుండా చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవారు. అమూల్ డెయిరీ రాకతో నా జీవితంలో కొత్త వెలుగులు తెచ్చింది. ఇతర డెయిరీలకంటే పాల ధర అధికంగా ఇస్తుండడంతో ఆరి్థకంగా నిలదొక్కుకుంటున్నాను.
గేదెల సంతతి పెరగడంతో ప్రస్తుతం ఆ సంఖ్య పదికి చేరింది. గతంలో డెయిరీల్లో పాలు పోస్తే నాణ్యత ఎంత ఉన్నా ఫ్యాట్ పది శాతం మించి లెక్కించేవారు కాదు. లీటరుకు 80 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. దీంతో నేను నష్టపోయేదానిని. అమూల్ డెయిరీలో మాత్రం పాల నాణ్యత 12 శాతానికి కూడా లెక్క కట్టి లీటరుకు 103 రూపాయలు ఇస్తున్నారు. అంటే లీటరుకు నేను అదనంగా 23 రూపాయలు పొందుతున్నాను. నేను రోజూ ఉదయం 13 లీటర్లు, సాయంత్రం 10 లీటర్లు పాలు పోస్తున్నాను. ఇప్పుడు వ్యాపారం బాగుంది.
ఇంకో గేదె కొనుగోలుకు దరఖాస్తు చేసుకున్నాను. త్వరలోనే రుణం కూడా మంజూరవుతుందని అధికారులు చెప్పారు. ఒంటరి మహిళను కావడంతో ప్రతి నెలా రూ.2,750 పింఛను వస్తోంది. మా చిన్నమ్మాయికి అమ్మ ఒడి పథకం కింద ప్రతి ఏటా రూ.15 వేలు వస్తుండడంతో పిల్లల చదువులకు కూడా ఇబ్బంది లేకుండా పోయింది. పాల విక్రయం ద్వారా.. పశువుల మేత, దాణా ఖర్చులు, అద్దెలు పోను నెలకు రూ.10 వేలు మిగులుతున్నాయి. ఉన్నంతలో ఇబ్బంది లేకుండా జీవిస్తున్నాం. – దాసం చెంచులక్ష్మి, క్రోసూరు (ఎస్‌ఎన్ జిలాని, విలేకరి, క్రోసూరు)
అప్పు లేకుండా వ్యవసాయం
మాది సన్నకారు రైతు కుటుంబం. మాకు నరసన్నపేట సమీపంలో ఒకటిన్నర ఎకరం భూమి ఉంది. నాలుగేళ్ల క్రితం వరకు ఖరీఫ్ వస్తుందంటే చాలు పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులు పెట్టాల్సి వచ్చేది. వారు దయతలచి ఇచ్చిన అప్పుతో సాగు చేసేవాళ్లం. పంట చేతికి వచ్చాక వ్యాపారులకు నచి్చన ధరకే ధాన్యం ఇవ్వాల్సి వచ్చేది. లేకపోతే వడ్డీతో సహా డబ్బు చెల్లించేవాళ్లం.
ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ఖరీఫ్‌కు ముందు పెట్టుబడి సాయంగా కొంత మొత్తాన్ని, పంట చేతికొచ్చే సమయంలో మరి కొంత మొత్తాన్ని బ్యాంకుల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. ఏటా రూ.13,500 వంతున వచ్చింది. దీంతో మా కష్టాలన్నీ తీరుతున్నాయి. అవసరమైన ఎరువులు, విత్తనాలు ఆర్‌బీకేల ద్వారా రాయితీపైనే కొనుగోలు చేసుకుంటున్నాం.
పండిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుండటంతో మద్దతు ధర లభిస్తోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు అంతా మేలు జరుగుతోంది. నాకు ఇద్దరు కుమారులున్నారు. వారిద్దరికీ పెళ్లిళ్లు చేశాను. నా భార్య కాలం చేయడంతో చిన్నబ్బాయి దగ్గర ఉంటున్నాను. అందరం కలసికట్టుగా వ్యవసాయం చేసుకుంటున్నాం. – నేతింటి కిత్తయ్య, భవానీపురం, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా (ఎం.రవి, విలేకరి, నరసన్నపేట)
చీకటి నుంచి వెలుగులోకి..
మా నాన్న పేరూరి కుజుడు ఏడాది కిందట చనిపోయారు. మాది తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు. నిరుపేద కుటుంబం. మా అమ్మ కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమెకు వితంతు పింఛను రూ.2,750 వస్తోంది. వచ్చే నెల నుంచి రూ.3 వేలకు పెరుగుతుందని చెబుతున్నారు. మేము ఉన్నత చదువులు చదవాలని కోరిక ఉన్నా, దానికయ్యే ఖర్చు ఎలా భరించాలా అని సతమతం అయ్యాం. పరీక్ష ఫీజులు, ట్యూషన్ ఫీజులు చెల్లించుకోలేక చదువుకు స్వస్తి పలకాలేమోనని భయపడ్డాం.
కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్ (విద్యా దీవెన) చేస్తోంది. అందువల్లే నేను ఈ రోజు డిగ్రీ చదువుకుంటున్నాను. బ్యాంక్ ప్రవేశ పరీక్షకు కోచింగ్ తీసుకొని ఉద్యోగంలో స్థిర పడాలని అనుకుంటున్నా. కింది నుంచి పైదాకా విద్యా రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. అందువల్లే మా లాంటి పేదలెందరో ఉన్నత చదువులు చదువుకోగలుగుతున్నారు. మరికొందరైతే ఏకంగా విదేశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. పిల్లలకు ఉద్యోగాలొస్తేనే మాలాంటి వాళ్లం చీకటి నుంచి వెలుగులోకి వస్తాం. పేదరికం నుంచి బయటపడతాం. – పి.లీల, డిగ్రీ ద్వితీయ సంవత్సరం, నిడదవోలు (గాడి శేఖర్ బాబు, విలేకరి, నిడదవోలు)