ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
పాకలో ఉండేవాళ్లం.. ఇప్పుడు పక్కా ఇంట్లో
నా భర్త పోశియ్యకు ముగ్గురు అన్నదమ్ములు. ఉమ్మడిగా మాది కాకినాడ జిల్లా కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో ఉన్న రెండు సెంట్ల స్థలంలో వేసుకున్న తాటాకు ఇంట్లో(పాక)నే అందరితో కలసి ఉండేవాళ్లం. మాకు 2005లో వివాహమైంది. అప్పటి నుంచి ఆ పాకలోనే కాపురం చేశాం. ఈ పాక స్థలాన్నే ఐదు వాటాలుగా పంచుకోవాల్సి ఉంది. భవిష్యత్తులో ఎలా బతకాలో అని నిత్యం భయపడుతూ ఉండేవాళ్లం.
సొంత ఇంటి కోసం గతంలో ఎన్నో సార్లు నాయకుల చుట్టూ తిరిగినా స్థలం గానీ, ఇల్లుగానీ మంజూరు కాలేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటి స్థలం కోసం సచివాలయంలో వినతి పత్రం అందించాం. ఎవరికి ఏ విధమైన లంచాలు ఇవ్వకుండానే ఇంటి స్థలం మంజూరు చేశారు. ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండానే రూ.1.80 లక్షల బిల్లులు దశల వారీగా మంజూరు చేశారు. ఇన్నాళ్లకు సొంతింటి కలను సాకారం చేసుకున్నాం. మాకు ఇద్దరు అబ్బాయిలు. ఓ అబ్బాయి లక్ష్మి వెంకటరమణ ఏడో తరగతి చదువుతున్నాడు. నాలుగేళ్ల నుంచి అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు చొప్పున ఇప్పటి వరకూ రూ.60 వేలు నా ఖాతాలో జమ కావడంతో చదివించుకోడానికి ఇబ్బంది లేకుండా పోయింది. – నాగిరెడ్డి ప్రభావతి, కాపవరం (జీవీవీ సత్యనారాయణ, విలేకరి, కొవ్వూరు)
ధైర్యంగా పిల్లల్ని చదివిస్తున్నాం
మాది సాధారణ పేద కుటుంబం. మా ఆయన కామేశ్ పెయింటింగ్ వేస్తుంటారు. నేను ఇంటిదగ్గర టైలరింగ్ చేస్తుంటాను. మాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరినీ పెద్ద చదువులు చదివించాలనేది మా కోరిక. మేమిద్దరం ఎంతగా కష్టపడినా అరకొర ఆదాయమే వస్తోంది. అది కుటుంబ పోషణకే సరిపోవట్లేదు. ఇక గొప్పగా చదివించేందుకు అయ్యే ఖర్చు మేం పెట్టగలమో లేదో అని భయం వేసేది.
మా లాంటి మధ్య తరగతి కుటుంబాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి వరంలా మారింది. మా పెద్దబ్బాయి నవీన్ ప్రైవేటు స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వాడికి మూడేళ్లుగా అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేల వంతున నా ఖాతాలో జమ కావడంతో మా బిడ్డల చదువుకు ఇబ్బంది తొలగింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని జగనన్న కాలనీ లే అవుట్‌లో మాకు ఇంటి స్థలం ఇచ్చారు. ప్రభుత్వ సహకారంతో అందులో ఇల్లు నిర్మించుకున్నాం. నాకు జగనన్న చేదోడు పథకం కింద ఏటా రూ.పది వేలు అందుతోంది. ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. – అగడపోలు దీప, కొత్తవీధి, నరసన్నపేట (ఎం.రవి, విలేకరి, నరసన్నపేట)
రెండు కుటుంబాలను పోషించగలుగుతున్నా
బతుకు తెరువు కోసం 20 ఏళ్ల క్రితం విశాఖపట్నం రైల్వే కాలనీ నుంచి మధురవాడకు కుటుంబంతో వచ్చాం. విధి వక్రీకరించడంతో నా భర్త సింహాచలం 2013లో కార్‌షెడ్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నాకు గౌరి అపర్ణ, నూకాలమ్మ అనే ఇద్దరు ఆడపిల్లలు. వారి కోసం ఎంత కష్టం అయినా బతకాలనుకున్నాను. విధిలేని పరిస్థితుల్లో కొన్నాళ్లు హౌస్ కీపింగ్, మరి కొన్నాళ్లు వంట పని చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చేదాన్ని.
ఎన్ని ఇబ్బందులు పడినా కుటుంబాన్ని సక్రమంగా పోషించుకోలేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఎంతటి అత్యవసరమైనా, పనికి సెలవు పెట్టడానికి అవకాశం ఉండేది కాదు. కొన్నిసార్లు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సున్నా వడ్డీ కింద రూ.లక్ష, వైఎస్సార్ ఆసరా కింద మూడు దఫాలుగా రూ.30 వేలు వచ్చింది. ఆ మొత్తంతో బండి కొనుక్కుని మా వాంబేకాలనీలోనే పండ్ల విక్రయం మొదలుపెట్టాను. రోజుకు మూడు నుంచి నాలుగు వందల వరకు మిగులుతుంది.
నేను సొంతంగా నా కాళ్ల మీద నేను నిలబడి వ్యాపారం చేసుకుంటున్నా. నాకు పెన్షన్ రూ.2,750 వస్తోంది. రేపు రూ.3 వేలు అందుకుంటానని సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో మూడుసార్లు ఇంటి కోసం దరఖాస్తు చేసినా రాలేదు. ఇప్పుడు ఇంటి స్థలం వచ్చింది. ఇంటి నిర్మాణ ప్రయత్నాల్లో ఉన్నాను. మాకున్న ఆస్తి ఇదే. పెద్ద పాపకు పెళ్లి చేశాను. చిన్న పాప, నేను అద్దె ఇంట్లో ఉంటున్నాము. కొన్నేళ్ల క్రితం మా నాన్న అనారోగ్యంతో మృతి చెందారు. మా అన్నయ్య కూడా మృతి చెందాడు. దీంతో అమ్మ, దివ్యాంగుడైన తమ్ముడు పోషణ భారం కూడా నా మీదే పడింది. రెండు కుటుంబాలను నా పండ్ల బండి వ్యాపారం తోనే పోషిస్తున్నాను. – చుక్క పార్వతి, మధురవాడ, వాంబేకాలనీ (కె.టి.రామునాయుడు, విలేకరి, మధురవాడ)
Comments
Please login to add a commentAdd a comment