ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
కష్ట కాలంలో కొండంత ఆసరా
భర్త చనిపోయి ఇద్దరు పిల్లలతో అతి కష్టంగా జీవనం గడుపుతున్న సమయంలో ఈ ప్రభుత్వం వల్ల మా జీవితాలే మారిపోయాయి. మాది అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం రాయపుర అగ్రహారం. నాకు వివాహమై 15 సంవత్సరాలు అవుతోంది. నా భర్త రాము వ్యవసాయంతో పాటు మైక్, లైటింగ్ పనులు చేసేవారు. ఎనిమిదేళ్ల క్రితం విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. అప్పటికి నాకు ఇద్దరు చిన్న పిల్లలు. అప్పట్లో మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. జగనన్న సీఎం అయ్యాక వితంతు పింఛన్ మంజూరైంది. నాలుగున్నరేళ్లుగా పింఛన్ సొమ్ము ఎంతో ఉపయోగపడుతోంది.
ఈ నెల నుంచి రూ.3 వేలు ఇస్తుండడం మరింత సంతోషం కలిగించింది. ప్రస్తుతం పెద్ద పాప గీతిక సబ్బవరం కేజీబీవీ పాఠశాలలో 9వ తరగతి, రెండో పాప దివ్య అదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. వారిద్దరూ వసతి గృహంలో ఉండటంతో ఆరి్థక భారం తప్పింది. ఇప్పటికి నాలుగు విడతలుగా అమ్మ ఒడి సొమ్ము రూ.60 వేలు వచ్చింది. నాకు 35 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. రైతు భరోసా కింద నాలుగు విడతలు రూ.13,500 వంతున వచ్చింది. ఐదో ఏట కూడా మొదటి విడత సొమ్ము వచ్చింది. డ్వాక్రా రుణ మాఫీ.. ఆసరా కూడా వచ్చింది. మరో వైపు పశు పోషణ ద్వారా కూడా కొంత ఆదాయం వస్తోంది. సొంత ఇంట్లోనే ఉంటున్నాం. ఈ ప్రభుత్వం వల్ల ఆనందంగా ఉన్నాం. – నక్కెళ్ల సన్యాసమ్మ, రాయపుర అగ్రహారం (సుర్ల నాగేశ్వరావు, విలేకరి, సబ్బవరం)
ఇప్పుడు మా సొంతింట్లో ఉన్నాం
ముగ్గురు మగ పిల్లలు, భర్తతో కలసి 38 సంవత్సరాలుగా పశ్చిమగోదావరి జిల్లా కైకలూరులో అద్దె ఇళ్లల్లో కాపురం చేశాను. నా భర్త షరీఫ్ వంట మేస్త్రీగా పని చేస్తున్నారు. ఆయన కష్టంతో వచ్చే డబ్బుల్లో సగం అద్దె కోసమే వెచ్చించాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయంలో ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాను. కొద్ది రోజుల తర్వాత ఇంటి స్థలం కేటాయించినట్టు మా వలంటీర్ చెప్పారు.
అన్నట్లుగానే పట్టా నా చేతికిచ్చి, స్థలాన్ని చూపించారు. ఇల్లు కట్టుకునేందుకు రూ.1.80 లక్షలు మంజూరు చేశారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని సబ్సిడీతో అందజేశారు. కొంత డబ్బు మేము అదనంగా జత చేసి చక్కటి ఇల్లు కట్టుకున్నాం. వివాహమైన నా కుమారుడి భార్యకు కూడా ఇంటి స్థలం కేటాయించారు. చేయూత పథకం కింద నాకు ఏటా రూ.18,750 వంతున వచ్చింది. ఈ ప్రభుత్వం పుణ్యాన మేం ఆనందంగా జీవిస్తున్నాం. – సయ్యద్ షంసున్నీసా, వైఎస్సార్ గ్రీన్ విలేజ్, కైకలూరు (బి.శ్యామలరాజు విలేకరి, కైకలూరు)
ఉన్న ఊళ్లోనే ఉపాధి
మాది మారుమూల గిరిశిఖర గ్రామం. నేను, నా భర్త పోలి జీవనోపాధి కోసం ఎన్నో పనులు చేశాం. ఏ పని చేసినా ముగ్గురు పిల్లలుగల మాకు రెండుపూటలా తిండి కూడా కష్టమయ్యేది. బతుకు తెరువు రోజురోజుకూ కష్టంగా మారింది. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ చేయూత నాకొక ఆధారంలా కనిపించింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నా బ్యాంకు ఖాతాలో రూ.18,750 చొప్పున మూడేళ్లపాటు నగదు జమ చేసింది.
ఆ డబ్బుతో మేక పిల్లలను కొనుగోలు చేసి పెంచుతున్నాను. దానినే బతుకు బాటగా మలుచుకున్నాను. ఇప్పుడు నేను కుటుంబానికి ఆసరాగా మారాను. మా సొంతూరైన పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం పెదరావికోనలోనే బతకలగనన్న నమ్మకం కలిగింది. ఈ పథకం నా జీవితాన్నే మార్చేసింది. పెద్దకొడుకు మత ప్రచారకుడిగా ఉన్నాడు. మిగిలిన ఇద్దరు పిల్లలు ఇంట్లోనే మాకు చేదోడు వాదోడుగా ఉన్నారు. ఇప్పుడు మా కుటుంబం హాయిగా జీవనం సాగిస్తోంది. – నిమ్మక మూగి, పెదరావికోన, గుమ్మలక్ష్మీపురం మండలం (గంటా పెంటయ్య, విలేకరి, గుమ్మలక్ష్మీపురం)
Comments
Please login to add a commentAdd a comment