ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
జగనన్న దీవెన వల్లే ఉద్యోగం
ఈ రోజు నేను బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నానంటే ఈ ప్రభుత్వం దయే. మా నాన్న ఇప్పిలి అప్పారావు ఆటో డ్రైవర్. అమ్మ గృహిణి. తమ్ముడు మురళీకృష్ణ ఐటీఐ చదువుతున్నాడు. నాన్న విశాఖ జిల్లా పెందుర్తిలో ఆటో నడుపుతూ మా కుటుంబాన్ని పోషిస్తున్నారు. మా చదువులు, ఇతరత్రా అవసరాలకు దాదాపు రూ.5 లక్షల వరకు అప్పులు చేయాల్సి వచ్చింది. అదే సమయంలో నా డిప్లమో పూర్తయింది.
ఈ–సెట్‌లో 600వ ర్యాంక్ సాధించాను. రెండో కౌన్సెలింగ్‌లో సీటు వచ్చింది. అయితే ఫీజు ఎక్కువ కట్టాల్సి రావడం.. చంద్రబాబు ప్రభుత్వం తీరు వల్ల రూ.35 వేలు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామనడంతో ఇక చదువు మానేద్దామని నిర్ణయించుకున్నా. అదే సమయంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పూర్తిగా చెల్లిస్తామని ప్రకటించడంతో 2019లో బీటెక్‌లో చేరాను. అనుకున్నట్లుగానే సమయానికి జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా దాదాపు రూ.2.50 లక్షలు అందించారు.
సొంత అన్నయ్యే నా చేయి పట్టుకుని చదివించిన అనుభూతి కలుగుతోంది. ఇప్పుడు ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. రానున్న రోజుల్లో గ్రూప్స్/సివిల్స్‌కి ప్రిపేర్ అవుతాను. వైఎస్ జగన్ సీఎంగా దీర్ఘకాలం కొనసాగితే మాలాంటి వారు ఎంతో మంది ఉన్నత స్థాయికి చేరుకోగలమన్న నమ్మకాన్ని కలిగించారు. మా అమ్మకు ఆసరా, నాన్నకు వాహన మిత్ర పథకం ద్వారా లబ్ధి కలిగింది. – ఇప్పిలి అప్పలరాజు, ఇప్పిలివానిపాలెం, పెందుర్తి (సమ్మంగి భాస్కర్, విలేకరి, పెందుర్తి)
మేకల పెంపకంతో చక్కని ఉపాధి
ఒకప్పుడు మా లాంటి గిరిజన మహిళలు వ్యవసాయ పనులతో పాటు కొండలపై నుంచి తెచ్చుకునే కర్రలను అమ్ముకొని కుటుంబానికి ఆసరాగా నిలిచేవాళ్లం. భర్త సంపాదన చాలక కుటుంబం పోషణ ఎంతో భారంగా ఉండేది. ఇంటిల్లిపాదీ కష్టపడినా ఆదాయం మాత్రం కష్టానికి తగినట్లుగా ఉండేది కాదు. వైఎస్సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,750 వస్తోంది. ఈ పథకం మా కుటుంబానికి ఎంతో మేలు చేసింది. మూడేళ్లుగా వస్తున్న సాయంతో మేకలు కొనుగోలు చేసి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం సవరగోపాలపురంలో వాటిని పెంచుతున్నా.
దీనికి తోడు వైఎస్సార్ ఆసరా కింద ఇప్పటి వరకు రూ.36 వేలు వచ్చింది. ఈ సొమ్ము కూడా పెట్టుబడికి ఉపయోగపడింది. మేకల పెంపకం వల్ల ఆదాయం బాగుంది. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున అందుతోంది. దీనిని వ్యవసాయానికి పెట్టుబడిగా వాడుకుంటున్నాం. నాకో కుమారుడు. వాడు వ్యవసాయ కూలి. వాడి కుమార్తె టెక్కలి జూనియర్ కాలేజ్‌లో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఆమెకు అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ. 15 వేల వంతున మా కోడలు ఖాతాలో జమవుతోంది. నా భర్తకు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. నా కోడలి పేరున జగనన్న కాలనీలో ఇల్లు మంజూరైంది. ఇల్లు నిర్మాణ దశలో ఉంది. ఇప్పుడు మా కుటుంబం హాయిగా జీవనం సాగిస్తోంది. – చింతపల్లి పెంటమ్మ, సవరగోపాలపురం (ఎల్.వి.రమణ, విలేకరి, టెక్కలి)
ప్రభుత్వ పథకాలే మా జీవనాధారం
దివ్యాంగురాలినైన నాతో పాటు 70 ఏళ్ల వయస్సున్న మా అమ్మ ఉంటోంది. ఏలూరు జిల్లా నూజివీడులో చిన్నపాటి కూలి పనులు చేసుకుంటూ మా అమ్మను కంటికి రెప్పలా చూసుకోవడానికి చాలా అవస్థలు పడుతున్నా. ఈ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మాలాంటి పేదలను ఆదుకుంటోంది. నాకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున అందిస్తోంది. దీంతో కుటుంబ అవసరాలను తీర్చుకుంటున్నాం. జీవనానికి ఈ పథకం ద్వారా వస్తున్న డబ్బు ఎంతో తోడ్పడుతోంది.
దీనికి తోడు ప్రభుత్వం నాకు దివ్యాంగ పింఛన్ కింద రూ.3 వేలు ఇస్తుండగా, మా అమ్మకు వద్ధాప్య పింఛను వస్తోంది. రేషన్‌కార్డు ద్వారా ఇద్దరికీ అవసరమైన బియ్యం, ఇతర సరుకులు అందుతున్నాయి. మా అమ్మకు అవసరమైన బీపీ, సుగర్ మందులతో పాటు బీ కాంప్లెక్స్, మోకాళ్ల నొప్పులకు సంబంధించిన మందులు ప్రతి నెలా విలేజ్ క్లినిక్‌లో ఉచితంగా అందిస్తున్నారు. అవసరమైనప్పుడు రక్త పరీక్షలను సైతం చేస్తున్నారు. ఇప్పుడు మా జీవనానికి ఎలాంటి ఇబ్బంది లేదు. – జె.రమాప్రభ, నూజివీడు, ఏలూరు జిల్లా (ఉమ్మా రవీంద్రరెడ్డి, విలేకరి, నూజివీడు)
Comments
Please login to add a commentAdd a comment