ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
కష్టకాలంలో కన్న వారిలా ఆదుకున్నారు
మాది మధ్య తరగతి కుటుంబం. మా ఆయన శ్రీనివాసరావు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో టైలరింగ్ చేసి కుటుంబాన్ని పోషించేవారు. మూడేళ్ల కిందట ఆయన గుండెపోటుతో ఆకస్మికంగా కన్ను మూశారు. పిల్లలను ఎలా చదివించుకోవాలో తెలియక సతమతమయ్యా. నేను తప్పనిసరి పరిస్థితుల్లో టైలరింగ్ నేర్చుకుని ఆ పని మొదలుపెట్టా. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు నన్ను ఆదుకున్నాయి. మా ఆయన బతికి ఉన్నప్పుడు ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ.76,964, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ.8,375 వచ్చాయి.
మా అబ్బాయి ఆకాశ్ పదో తరగతి చదువుతున్నాడు. వాడికి అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు వంతున వచ్చింది. మా అమ్మాయి మేఘన డిగ్రీ చదువుతోంది. ఆమెకు జగనన్న విద్యా దీవెన కింద ఇప్పటి వరకు రూ.12 వేలు వచ్చింది. నాకు వైఎస్సార్ ఆసరా కింద రూ.22,682, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రూ.1,577, జగనన్న చేదోడు ద్వారా ఏటా రూ.పది వేల వంతున వచ్చాయి. వితంతు పింఛన్ కూడా మంజూరైంది. ఇప్పుడు మేము ఎలాంటి చీకు చింతా లేకుండా జీవిస్తున్నామంటే కారణం ఈ ప్రభుత్వం అందించిన పథకాలే. ముఖ్యమంత్రి జగనన్న మేలును ఎప్పటికీ మరువలేం. – రౌతు అనూరాధ, కురుపాం (కె.చంద్రమౌళి, విలేకరి, కురుపాం)
‘వెన్ను’దన్నుగా జగనన్న
ప్రభుత్వ వైద్య శాలలు అందుబాటులో లేని సమయంలో 2012కు ముందు వరకు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెం గ్రామంలో ఉంటూ సైకిల్‌పై ఊరూరా తిరుగుతూ ఆర్‌ఎంపీ వైద్యుడిగా ప్రజలకు వైద్యం అందిస్తూ వచ్చాను. నాడు కుటుంబ పోషణ బాగానే ఉండేది. 2012 ఏప్రిల్‌లో ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడ్డాను. వెన్నుపూసకు గాయమై మంచం పట్టాల్సి వచ్చింది. నాటి నుంచి ఎన్ని మందులు వాడినా, వైద్యం చేయించుకున్నా ఫలితం లేకపోయింది.
మాకు ఒక కుమార్తె ఉంది. ఆమే కొడుకులా మారి కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తోంది. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు డీఎంహెచ్‌ఓ పింఛన్ రూ.5 వేలు వస్తోంది. దీనిలో రూ.3 వేలు నెలవారీ మందులకు ఖర్చవుతోంది. ప్రభుత్వం ఉచితంగా బియ్యం అందిస్తోంది. మిగిలిన రూ.2 వేలతో కుటుంబ పోషణ చేస్తున్నా. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా నా భార్యకు ఏటా రూ.18,750 వస్తోంది. జగనన్న మాకు వెన్నుదన్నుగా నిలిచారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను. – బెజ్జంకి పాండురంగారావు, బంగారుగూడెం (కొడమంచిలి ఆశీర్వాదరావు, విలేకరి, తాడేపల్లిగూడెం రూరల్)
ఆపద వేళ సర్కారు ఆసరా
మాది పేద కుటుంబం. నా భర్త వెంకటరమణ చిల్లరకొట్టులో గుమాస్తా. నేను టైలరింగ్ చేస్తుంటాను. మాకిద్దరు పిల్లలు. గుంటూరు జిల్లా తెనాలిలో ఉంటున్నాం. నా భర్త సంపాదనతోనే కుటుంబాన్ని నెట్టుకు రావడం కష్టం కావడంతో నేను టైలరింగ్ షాపు పెట్టుకున్నా. అదే సమయంలో కరోనా మహమ్మారి విలయ తాండవంతో వ్యాపారం లేక, ఆదాయం సరిపోక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం. షాపు మూసి వేయాల్సి వచ్చింది.
ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో వైఎస్సార్ ఆసరా పథకం మా కుటుంబాన్ని ఆదుకుంది. ఏటా రూ.12 వేలు చొప్పున నాలుగు విడతలుగా రూ.48 వేలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ డబ్బుతో టైలరింగ్ షాపును మళ్లీ ప్రారంభించా. జగనన్న తోడు పథకం కింద అదనంగా మరో రూ.10 వేలు వచ్చాయి. ఆ డబ్బులను కూడా వ్యాపారానికి ఉపయోగించా. దీంతో మా జీవితం గాడిలో పడింది. నా కొడుకు ఇటీవలే గుమాస్తాగా చేరాడు.
కుమార్తెకు వివాహం చేశాం. చేయూత పథకంలో భాగంగా నాకు ఏటా రూ.18,750 చొప్పున రావడంతో హోల్ సేల్ మార్కెట్ నుంచి చీరలు కొనుగోలు చేసి తీసుకువచ్చి మా టైలరింగ్ షాపులోనే విక్రయిస్తున్నా. సాధారణ కుట్టుమెషిన్ అమ్మేసి ఆధునిక యంత్రాన్ని కొనుగోలు చేశా. దీంతో ఆర్డర్లు కూడా బాగా వస్తున్నాయి. ఇప్పుడు ఉన్నంతలో ఆనందంగా బతుకుతున్నాం. మా ఆర్థికాభివృద్ధికి తోడ్పడిన సీఎం జగన్ మోహన్‌రెడ్డిని జీవితాంతం గుర్తుంచుకుంటాం. – మునిపల్లి పార్వతి, తెనాలి (ఆలపాటి సుదీర్ కుమార్, విలేకరి, తెనాలిఅర్బన్)
Comments
Please login to add a commentAdd a comment