ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
స్వయం ఉపాధికి సర్కారు ఊతం
మా ఆయన చదువుకున్నప్పటికీ సరైన ఉద్యోగం లేదు. ఏదైనా వ్యాపారం చేసుకుని నిలదొక్కుకుందామనుకుంటే గత ప్రభుత్వం ఆశించిన సహకారం అందివ్వలేదు. ఇక చేసేది లేక ఎలాగోలా బతుకుతుండగా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చింది. మా కలలు సాకారం చేసుకోవడానికి అడుగులు పడ్డాయి. మహిళాభివృద్ధికి ఈ ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో మా సొంత ఊరైన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఆంధ్రా ఒడిశా సరిహద్దులోని బొడ్డపడలో సొంతంగా హోటల్ ఏర్పాటు చేసుకుందామని మా ఆయన నర్సింగ్ సాహు యోచించారు.
వెంటనే పెట్టుబడి కోసం బ్యాంకు లింకేజీ ద్వారా లక్ష రూపాయల రుణం తీసుకున్నాం. ఆ సొమ్ముతో బస్టాండ్ కూడలిలో చిన్నపాటి హోటల్ ఏర్పాటు చేశాం. మౌలిక వసతులకోసం జగనన్న తోడు పథకం ద్వారా పది వేల రూపాయలు వడ్డీలేని రుణం తీసుకున్నాం. వైఎస్సార్ ఆసరా ద్వారా నాకు ప్రభుత్వం అందజేసిన రూ.14వేలు కూడా వ్యాపారానికి వినియోగించాం. ఇప్పుడు రోజుకు సుమారు ఐదు వందల వరకు లాభం వస్తోంది. అలాగే ప్రభుత్వం మాకు ఓ మంచి గూడును కూడా జగనన్న కాలనీలో సమకూర్చింది. ప్రతీ ఏడాది మా పాపకు జగనన్న విద్యా దీవెన అందుతుండటంతో ఆమె చదువు మాకు భారం కాలేదు. ఈ రోజు మా కుటుంబం ఇలా ఉందంటే దానికి కారణమైన ఈ ముఖ్యమంత్రికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – కుమారీ సాహూ, బొడ్డబడ (మద్దిలి కేశవరావు, విలేకరి, ఇచ్ఛాపురం రూరల్)
ఏ దిక్కూ లేని నాకు పింఛనే ఆధారం
నా వయస్సు 75 సంవత్సరాలు. భర్త దూరమై 20 ఏళ్లు అవుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరులో నివాసం ఉంటున్న నాకు బిడ్డలు, బంధువులు ఎవరూ లేరు. ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నాను. కిడ్నీ సమస్య, బీపీ, షుగర్‌తో బాధపడుతున్న నేను కనీసం కూలి పని కూడా చేసుకోలేను. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కొడుకులా ఆదుకున్నాడు. ప్రతి నెలా రూ.3 వేల పింఛన్ ఇంటికి వచ్చి ఇస్తున్నారు.
నెలా నెలా ఇంటికి బియ్యాన్ని ఉచితంగా తీసుకువస్తున్నారు. ఏ దిక్కూ లేని నాకు పింఛనే ఆధారం. మూడు పూటలా తింటూ బతుకుతున్నాను. బీపీ, షుగర్, ఇతర సమస్యలకు మందులు క్రమం తప్పకుండా ఉచితంగా ఇస్తున్నారు. నాకు ఎవరూ అండగా లేకపోయినా ఈ ప్రభుత్వ సాయంతో బతకగలుగుతున్నాను. మళ్లీ జగన్ సీఎం అయితేనే మా లాంటి పేదలు హాయిగా బతుకుతారు. – పిల్లి శాంతమ్మ, సీలేరు (చీపురుపల్లి రామారావు, విలేకరి, సీలేరు)
సమస్యలు తొలగి సంతోషంగా జీవనం
మాది చేనేత కుటుంబం. మా వృత్తికి సరైన ఆదరణ లేక... చేసిన పనికి గిట్టుబాటైన కూలి లేక నానా అవస్థలు పడేవాళ్లం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బండార్లంకలో మా అబ్బాయి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చిన్నపాటి కమ్మరేకుల ఇళ్లలో జీవిస్తున్నాం. గత ప్రభుత్వం మాలాంటివారికి ఎలాంటి సాయం అందివ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక మా బతుకులు మారాయి. ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయాన్నే వలంటీర్ మా ఇంటి తలుపులు తట్టి నాకు వృద్ధాప్య పింఛన్ అందిస్తోంది. మా అబ్బాయి భోగ భాగ్య నారాయణ తాతారావుకు వాహన మిత్ర పథకం ద్వారా ఏటా రూ.10 వేలు అందుకుంటున్నాడు.
నా కోడలు లక్ష్మి ఇంట్లోనే చేనేత మగ్గాన్ని నేస్తూ నేతన్న నేస్తం పథకం ద్వారా ఏటా రూ.24 వేలు తీసుకుంటోంది. డ్వాక్రా రుణ మాఫీతో వచి్చన సొమ్ముతో కుటుంబాన్ని తీర్చిదిద్దుతోంది. మా మనవడు క్రాంతికుమార్ స్కూల్లో చదువుకుంటున్నాడు. వాడికి అమ్మ ఒడి పథకం ద్వారా అందిస్తున్న రూ.15000లు ఏటా మా కోడలి ఖాతాలో జమవుతున్నాయి. మా కుటుంబానికి జగనన్న ఇంటి స్థలం కూడా ఇచ్చారు. త్వరలోనే ఇల్లు కట్టుకుని అక్కడకు వెళ్లిపోతాం. ఇప్పుడు నా కుటుంబం ఏ చీకూ చింతా లేకుండా ముందుకు సాగుతోంది. మాకుటుంబాన్ని ఆదుకున్న జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. – కూర్మా దుర్గ, బండార్లంక (పరసా సుబ్బారావు, విలేకరి, అమలాపురం టౌన్)
Comments
Please login to add a commentAdd a comment